Wednesday, August 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపట్టభద్రుల ఎన్నికలకు సై

పట్టభద్రుల ఎన్నికలకు సై

- Advertisement -


కాంగ్రెస్ ఫోకస్..విపక్షాలూ సన్నద్ధం
అభ్యర్థిత్వాలపై కసరత్తు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి

వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్‌ ‌రానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు పోటీకి సై అంటున్నాయి. వివిధ పార్టీల నుంచి ఆశావహులు పోటీకి సన్నద్ధమవుతున్నారు. అధికార కాంగెస్‌ ‌పార్టీతో పాటు బీఆర్‌ఎస్‌, వామపక్షాలు, బీజేపీ పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి గత శాసనసభ ఎన్నికల్లో జనగామ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ‌గెలవడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. 52 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చింతపండు నవీన్‌కుమార్ ఎలియాస్ తీన్మార్ మల్లన్న తన సమీప బీఆర్‌ఎస్ ప్రత్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిపై విజయం సాధించారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో 4 లక్షలా 63వేలా839మంది ఓటర్లు గత ఎన్నికల ఓటరు జాబితాలో వున్నారు. తీన్మార్‌ మల్లన్న పదవీకాలం ముగుస్తుండడంతో పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశముందని సమాచారం. దీంతో ఆయా రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. గత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్‌ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డితో పాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేశారు.

పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలపై ఫోకస్‌
పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశముండడంతో కాంగ్రెస్ పార్టీతోపాటు బీఆర్‌ఎస్, ‌లెప్ట్, బీజేపీ రంగంలోకి దిగడానికి కసరత్తు చేస్తున్నాయి. గత ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిప తీన్మార్ మల్లన్న ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయనకు ఆ ఎన్నికల్లో వామపక్షపార్టీలు మద్దతు ఇచ్చాయి. మళ్లీ పోటీలో నిలుస్తారా..? పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే అవకాశం ఉందా అంటే లేదనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ సొంతంగానే రంగంలోకి దిగే అవకాశాలున్నట్టు సంకేతాలు ఉన్నాయి. బలమైన అభ్యర్థి కోసం పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. వరంగల్ జిల్లా నుంచి సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా పేరొందిన దొమ్మాటి సాంబయ్య పేరు ప్రధానంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ విషయంలో సామాజిక సమీకరణలను సైతం పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి రాములునాయక్ పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ ‌నాయకత్వం ఉమ్మడిగా ఏకాభిప్రాయంతో అభ్యర్థిని బరిలోకి దించి గెలవాలని చూస్తున్నారు.

​బీఆర్‌ఎస్, బీజేపీలు సన్నద్ధం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గతంలో పోటీ చేసిన ఏనుగుల రాకేశ్‌రెడ్డినే రంగంలోకి దించే అవకాశమున్నట్టు ప్రచారం జరుగుతుంది. పార్టీలో పలువురు టికెట్‌ ఆశిస్తున్నా రాకేశ్‌రెడ్డి వైపే పార్టీ నాయకత్వం మొగ్గు చూపే అవకాశముంది. రాకేశ్‌‌రెడ్డి పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కాంగ్రెస్‌ ‌వైఫల్యాలపై యువతను సమీకరించి ఆందోళనలు చేస్తున్నందున ఆయన్నే బరిలోకి దించే అవకాశంలేకపోలేదు. ఇక బీజేపీ నుంచి కూడా గత ఎన్నికల్లో పోటీ చేసిన గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మళ్లీ పోటీకి సుముఖంగా ఉన్నట్టు చెబుతున్నాయి. పార్టీ నాయకత్వం ‘గుజ్జుల’నే రంగంలోకి దించుతుందా ? లేక కొత్త అభ్యర్థిని పోటీకి పెబుతుందా..? అన్న విషయంలో సందిగ్ధత నెలకొంది.

లెఫ్ట్‌ పార్టీలకూ బలమైన ఓటింగ్‌
వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో వామపక్ష పార్టీలకూ బలమైన ఓట్లు ఉన్నాయి. లెఫ్ట్‌ పార్టీలు ఉమ్మడిగా ఒక అభ్యర్థిని పోటీ చేయించే అవకాశంలేకపోలేదు. వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు యువత పక్షాన అనేక ఉద్యమాలు నడిపాయి. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య, ఉపాధి కల్పన కోసం పోరాటాలు చేశారు. మరో పక్క జెన్‌‌జీ సైతం మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అగ్నిపరీక్షగా నిలవనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -