ఏఎమ్మార్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సపరేట్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి.

– ప్రభుత్వ మందులకు ప్రైవేటు బిల్లులతో సియస్ఆర్ నిధులను కాజేస్తున్నారు.
– తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా కన్వీనర్ పీక కిరణ్
నవతెలంగాణ – మల్హర్ రావు.
మండల కేంద్రమైన తాడిచర్లలోని టిఎస్ జెన్కో ఓసిపి బ్లాక్ 1 బొగ్గు నిక్షేపాలు వెలికితీస్తున్న ఏఎమ్మార్ కంపెనీ సియస్ఆర్ నిధుల ఖర్చుల వివరాలను వెల్లడించకుండా ఏఎమ్మార్ అధికారులే తమ ఇష్టానుసారంగా వాడుకుంటు భూ నిర్వాసిత గ్రామల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా నిధులు కాజేస్తున్న ఏఎమ్మార్ సంస్థ పై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా కన్వీనర్ పీక కిరణ్ డిమాండ్ చేశారు.బుధవారం మండల కేంద్రమైన తాడిచర్లలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.ఏఎమ్మార్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎమ్మార్ వైద్య సిబ్బందితో ఏఎమ్మార్ ఆసుపత్రిని ఏర్పాటు చేసిన ప్రభుత్వ మందులకు ప్రైవేటు బిల్లులతో పెద్ద ఎత్తున సియస్ఆర్ నిధులను కాజేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రితో సంబంధం లేకుండా ఏఎమ్మార్ కంపెనీ సపరేట్ డీస్పెన్సరీ ఏర్పాటు చేసుకుని వైద్య సేవలు అందించాలని కానీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తు జిల్లా వైద్యాధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ దావాఖానలో ఏఎమ్మార్ ఆసుపత్రిని ఏర్పాటు చేసి సియస్ఆర్ నిధులను కాజేస్తున్నారని ఆరోపించారు. అలాగే మండలంలో సియస్ఆర్ నిధులతో తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల చిన్నతూంఢ్ల తదతర గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తప్పుడు బిల్లులతో నిధులను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఓసిపికి 500 మీటర్ల డేంజర్ జోన్ లో ఉన్న నివాస గృహాలను సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని ఓసిపి వెదజల్లే దుమ్ము ధూళి, కాలుష్యం కారణంగా అనేక మంది నిర్వాసితులు దగ్గు,దమ్ము తదతర వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే డేంజర్ జోన్ గృహాల సేకరణకు చర్యలు తీసుకుని నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా కో కన్వీనర్ దుబాసి పార్వతి. దారకొండ శంకర్. మినుగు నగేష్. రాగం విజయ్ కుమార్. పోలోజి సత్యనారాయణ. తదితరులు పాల్గొన్నారు.

Spread the love