నవతెలంగాణ ముంబయి: రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని అరికట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. ఇకపై పార్కింగ్ స్థలం ఉన్న వారికి మాత్రమే కార్లు అమ్మాలనే నిబంధనలను అమలులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్టు రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రకటించారు. కార్లు కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు పార్కింగ్ స్థలానికి సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. త్వరలో ఈ నిబంధన అమల్లోకి వస్తుందని అన్నారు. నగరంలోని పలు అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్న ప్రజలకు తగిన పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల తమ కార్లను రోడ్లపై పార్క్ చేస్తున్నారు. దీనివల్ల జనాభా ఎక్కువ ఉన్న నగరాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్నాయి. ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపై వేచి ఉండాల్సివస్తోంది. అంతేకాకుండా అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు అందించే అత్యవసర సేవలకు ఆటంకం కలుగుతుంది. వీటిని నివారించడానికి కార్లు కొనుగోలు చేసే వారు పార్కింగ్‌కు సంబంధించిన పత్రాలను సమర్పించాలని నిబంధన పెట్టాం’’ అని ప్రతాప్ సర్నాయక్ పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలు కార్లు కొనుగోలు చేయకూడదని తాము చెప్పట్లేదని.. అయితే దానికి అనుగుణంగా తగిన పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి ఇటువంటి చర్యలు అవసరమని అన్నారు. ట్రాఫిక్‌ను అదుపు చేసేందుకు, ప్రజలు ప్రైవేటు వాహనాలపై ఆధారపడకుండా ఉండేందుకు మెట్రో రైలు, ఇతర ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగా అదనంగా ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో కేబుల్ టాక్సీ వ్యవస్థను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఈ కొత్త నిబంధనను త్వరలో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండేతో చర్చిస్తున్నామన్నారు