– ఐదు నెలలుగా జీతాల కోసం నిరీక్షణ శ్రీ పట్టించుకోని కాంట్రాక్టు సంస్థలు
నవతెలంగాణ-కెరమెరి
ప్రజలకు సురక్షిత తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ కార్మికులు కష్టాల కడలిలో జీవనం సాగిస్తున్నారు. కాంట్రాక్టు సంస్థలు నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోగా అరకొర వేతనాలతో పని చేస్తున్న కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. కాంట్రాక్టు సంస్థలు పట్టించుకోకపోవడంతో రోజులెలా వెళ్లదీయాలని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు సంస్థల నిర్వాకం వల్ల ఆర్థిక ఇబ్బందులతో తాము ఆత్మహత్య చేసుకోవాల్సన పరిస్థితి దాపురించిందని వాపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పోషణ భారమై మానసికంగా కృంగిపోతున్నారు.
నాలుగు నెలలుగా అందని వేతనాలు
జిల్లావ్యాప్తంగా మిషన్ భగీరథలో పలు సంస్థల ఆధ్వర్యంలో సుమారు 600 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ సంస్థల ఆధ్వర్యంలో మిషన్ భగీరథ పనులు జరగగా, పదేళ్లపాటు ఆయా సంస్థలు నీటి సరఫరా బాధ్యతలు కూడా చూసుకోవాలి. ఐదు సంవత్సరాలుగా వ్యాప్తంగా 600 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో సూపర్వైజర్లు, లైన్‌మెన్లు, పంపు ఆపరేటర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, వాచ్‌మెన్లు, ఫిల్టర్లు, ఫిట్టర్లు, వెల్డర్లు తదితరులున్నారు. వీరికి ఒక సంస్థ మినహా మిగతా సంస్థలు నాలుగు నెలలకు పైగా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులంతా అవస్థలు పడుతున్నారు.
కాంట్రాక్టు సంస్థల ఇష్టారాజ్యం
కార్మికులకు వేతనాలు చెల్లింపు విషయంలో కాంట్రాక్టు సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిత్యం ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం 5వ నెల గడుస్తున్నా వేతనాల జాడ లేకుండా ఉంది.
సగం జీతం కూడా ఇవ్వని సంస్థలు
మిషన్ భగీరథలో పని చేసే కార్మికులకు ప్రభుత్వం నెలకు రూ.19500 చొప్పున కంపెనీలకు చెల్లిస్తుంది. అయితే కంపెనీలు మాత్రం కేటగిరీని బట్టి కార్మికులకు చెల్లిస్తున్నాయి. వాస్తవంగా ఈఎస్‌ఐ, పీఎఫ్ సదుపాయం కల్పించడంతో పాటు కిందిస్థాయి కార్మికులకు కనీస వేతనం రూ.15వేలు చెల్లించాల్సి ఉంది. అయినా వేతనాల చెల్లింపులో వ్యత్యాసం చూపుతున్నట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు. 5నెలల పాటు పనులు చేయించుకొని ఇంత కాలానికి ఒక్క నెల జీతం మాత్రమే ఇస్తూ సంస్థలు చేతులు దులుపుకుంటున్నాయి. సంబంధిత కాంట్రాక్టు సంస్థలు కొన్నేళ్లుగా ఇదే తంతు కొనసాగిస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నించిన కార్మికుల పట్ల బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో తమకు వేతనాలు పెంచాలని కార్మికుల పెద్ద ఎత్తున వివిధ సందర్భాల్లో నిరసన వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకునేనాథుడే లేడని కార్మికులు వాపోతున్నారు.
మిషన్ భగీరథ కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తాం : కూటికల ఆనంద్‌రావ్, సీఐటీయూ మండలాధ్యక్షుడు
మిషన్ భగీరథ పథకంలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు ఆయా సంస్థలు వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదు. ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ వేతనాలు సక్రమంగా చెల్లించకుండా కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మిషన్ భగీరథ అధికారులు తీరు మార్చుకోని పక్షంలో కార్మికుల పక్షాన పోరాటాలు ఉధృతం చేస్తాం.
ప్రభుత్వం ఆదుకోవాలి : బుడ్డన్న, మిషన్ భగీరథ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు
ప్రతి నెల వేతనాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఇచ్చే అరకొర వేతనాలను 5నెలల పాటు చెల్లించకుంటే ఎలా బతికేది. కేవలం ఒక నెల జీతం చెల్లిస్తూ కాలయాపన చేస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వేతనాలపై ప్రాజెక్టు మేనేజర్‌కు విన్నవించినా ఫలితం లేకపోగా, పని చేస్తే చేయండని, లేకపోతే వేరే చోట పని చేసుకోవాలని దురుసుగా మాట్లాడుతున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి.