అయోధ్య రామ మందిరం వద్ద కాల్పుల కలకలం..భద్రతా సిబ్బంది మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరం వద్ద విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది తుపాకీ కాల్పుల్లో మరణించాడు. అతడిపై ఎవరైనా కాల్పులు జరిపారా? ప్రమాదవశాత్తు గన్‌ పేలిందా? లేదా తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అన్నది స్పష్టం కాలేదు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. యూపీ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్‌ఎస్‌ఎఫ్)కు చెందిన 25 ఏళ్ల శత్రుఘ్న విశ్వకర్మ నూతన రామాలయానికి 150 మీటర్ల దూరంలోని కోటేశ్వరాలయం వీఐపీ గేట్ వద్ద సెక్యూరిటీ విధుల్లో ఉన్నాడు. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో తుపాకీ కాల్పుల వల్ల అతడు మరణించినట్లు సీనియర్ పోలీస్‌ అధికారి తెలిపారు. మృతుడి నుదుటిపై తుపాకీ గాయం ఉందని చెప్పారు. కాగా, ఆ గేటు వద్ద శత్రుఘ్న విశ్వకర్మతోపాటు మరో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో ఉన్నారు. కాల్పుల శబ్దం విన్న వారిద్దరూ అక్కడకు వచ్చి చూడగా శత్రుఘ్న కుప్పకూలినట్లు గమనించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారని పోలీస్‌ అధికారి తెలిపారు. ప్రమాదవశాత్తు గన్‌ పేలడంతో విశ్వకర్మ మరణించడా? లేదా ఆత్మహత్య చేసుకున్నాడా? అన్నది స్పష్టంగా తెలియలేదని అన్నారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించినట్లు వెల్లడించారు.

Spread the love