నవతెలంగాణ చెన్నై : ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (94) శుక్రవారం మధ్యాహ్నం 1:59 గంటలకు చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆమె మృతితో తెలుగు, తమిళ చలనచిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. షావుకారు.జానకి పూర్తి పేరు శంకరమంచి జానకి. ఆమె డిసెంబర్ 12, 1931న ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో జన్మించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏడు దశాబ్దాలకు పైగా తన అభినయంతో ప్రేక్షకులను అలరించిన నటిగా ఆమె ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. 1950లో విడుదలైన ‘షావుకారు’ సినిమాతో ఆమె నటిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 7 దశాబ్దాలపాటు సాగిన తన కెరీర్‌లో 400కు పైగా చిత్రాల్లో నటించారు. నటనకు ఆమె చేసిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2022లో ఆమెను ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి అలనాటి రంగస్థల, సినీ కథానాయిక. ఆమె తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 370కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో సుమారు 2 వందలకి పైగా కథానాయిక పాత్రలు పోషించారు. ఆమె రేడియో నాటికల ద్వారా కెరీర్ ను ప్రారంభించారు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎం.జి.ఆర్, శివాజి గణేశన్.. మొదలైన నటుల సరసన కథానాయికగా చేసి మెప్పించారు ఆమె చెల్లెలు ప్రముఖ సినీనటి కృష్ణ కుమారి కూడా సినీరంగంలో చెరగని ముద్ర వేసుకున్నారు.
షావుకారు జానకి కన్నడ మాధ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి టి.వెంకోజీరావు పేపర్ పరిశ్రమలో నిపుణులు. ఈయన ఇంగ్లాండులో మూడేళ్ళపాటు పేపర్ మ్యానుఫాక్చరింగ్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ చదివి వచ్చారు. ఆమె తల్లి శచీదేవి, అస్సాం రాష్ట్రం గౌహతిలో మెట్రిక్యులేషన్ వరకు చదివారు. ఆమె అరిజోనా విశ్వవిద్యాయంలో గౌరవ డాక్టరేట్ పొందారు. 15 ఏళ్ళకే ఆమెకు పెళ్ళయింది.
జానకి చిన్ననాటే రంగస్థల నాటకాలలో పలు పాత్రలు పోషిస్తూ నటిగా కెరీర్ ప్రారంభించారు. తన 11వ యేటనే రేడియోలో ఒక తెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె మొట్టమొదటి చిత్రం 1950 లో వచ్చిన షావుకారు.. ఇది ఆమె ఇంటి పేరైపోయింది. ఆమె తెలుగు, తమిళ, కన్నడ భాషలలో 385 చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, ఒక మలయాళం సినిమాలోనూ నటించారు. జాతీయ ఫిల్మ్ అవార్డులకు, తెలుగు సినిమా అవార్డులకు కమిటీలో జ్యూరీ సభ్యురాలిగా పనిచేశారు. విజయా ప్రొడక్షన్స్ వారి షావుకారు (1950) ఆమె మొదటి సినిమా. 1949లో రక్ష రేఖ అనే సినిమాలో చంద్రికగా నటించారు. తరువాత ఆమె షావుకారు జానకిగా ప్రసిద్ధురాలయ్యారు. అప్పటి అందరు ప్రముఖ నాయకుల సరసన నటించారు. అనేక పురస్కారాలు పొందారు. తెలుగులో ఆమె సినిమాలలో ప్రసిద్ధమైనవి కొన్ని – షావుకారు, డాక్టర్ చక్రవర్తి, (1964), మంచి మనసులు (1962), రోజులు మారాయి (1955).



