ప్రతి గ్రూప్‌లో సంచలనమే!

ప్రతి గ్రూప్‌లో సంచలనమే!– కివీస్‌, పాక్‌, శ్రీలంక నిష్క్రమణ
– ఉత్కంఠరేపిన సూపర్‌8 అర్హత
– ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్‌
ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్‌. తొలిసారి 20 జట్లు పోటీపడుతున్న మెగా ఈవెంట్‌. అగ్రజట్లు సూపర్‌8 దశకు చేరుకునేందుకు అనువుగా గ్రూప్‌ దశ డ్రా ప్రణాళిక చేశారనే విమర్శలు ఆరంభంలో వినిపించాయి. కానీ ప్రతి గ్రూప్‌లో పసికూనలు పంజా విసిరాయి. ప్రీ టోర్నమెంట్‌ సీడింగ్‌ సాధించిన జట్లను సూపర్‌8 దశకు చేరకుండా నిలువరించాయి. ప్రతి గ్రూప్‌లోనూ ఓ సంచలనం నమోదు కాగా.. దాదాపుగా అన్ని గ్రూప్‌ల్లోనూ సూపర్‌8 అర్హత ప్రక్రియ అత్యంత ఉత్కంఠ రేపింది!.
నవతెలంగాణ క్రీడావిభాగం
అమెరికా, వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌ ఆరంభానికి ముందే సూపర్‌8 చేరబోయే జట్లను అంచనా వేసి సీడింగ్‌ కేటాయించారు. భారత్‌ (ఏ1), పాకిస్థాన్‌ (ఏ2), ఇంగ్లాండ్‌ (బి1), ఆస్ట్రేలియా (బి2), న్యూజిలాండ్‌ (సీ1), వెస్టిండీస్‌ (సీ2), దక్షిణాఫ్రికా (డీ1), శ్రీలంక (డీ2)లు సూపర్‌8 దశ షెడ్యూల్‌ కోసం ముందుగానే సీడింగ్‌ దక్కించుకున్నాయి. ప్రతి గ్రూప్‌లో రెండు జట్లకు సీడింగ్‌ ఇవ్వగా.. దాదాపుగా ప్రతి గ్రూప్‌లో సంచలనాల మోత మోగింది. గ్రూప్‌-ఏలో పాకిస్థాన్‌, గ్రూప్‌-సిలో న్యూజిలాండ్‌, గ్రూప్‌-డిలో శ్రీలంకలు గ్రూప్‌ దశను దాటలేకపోతున్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లాండ్‌ సైతం సూపర్‌8కు చేరుకుంటుందా? అనే అనుమానాలు ఉండేవి. ఓమన్‌పై భారీ విజయంతో ఇంగ్లాండ్‌ ఇప్పుడు ఫేవరేట్‌గా నిలిచినా.. అంతకుముందు జోశ్‌ బట్లర్‌ సేన తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంది.
పాకిస్థాన్‌కు పంచ్‌
గ్రూప్‌-ఏలో భారత్‌, పాకిస్థాన్‌లతో పాటు పసికూనలు ఐర్లాండ్‌, కెనడా, అమెరికా (యుఎస్‌ఏ) చోటుచేసుకున్నాయి. బలమైన భారత్‌, పాకిస్థాన్‌లు ఇతర మూడు జట్లపై అలవోక విజయాలు సాధించటం సహజమే అనిపించింది. కానీ ఆతిథ్య అమెరికా అద్భుతం చేసింది. కెనడాను చిత్తు చేసిన ఉత్సాహంలో అమెరికాను సూపర్‌ ఓవర్లో ఓడించింది. పాక్‌పై అమెరికా విజయంతో యుఎస్‌ఏలో ఒక్కసారిగా క్రికెట్‌, టీ20 ప్రపంచకప్‌ గురించి ప్రజలు గూగుల్‌లో అన్వేషించటం మొదలెట్టారు. గ్రూప్‌ దశ చివరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో పాకిస్థాన్‌ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు ముందే సూపర్‌8 బెర్త్‌ను యుఎస్‌ఏ సొంతం చేసుకుంది. 2022 టీ20 ప్రపంచకప్‌లోనూ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించాల్సిన పాకిస్థాన్‌.. నెదర్లాండ్స్‌ అద్భుతంతో ఫైనల్‌ వరకు చేరుకుంది!.
నిలిచిన ఇంగ్లాండ్‌!
డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లాండ్‌కు గ్రూప్‌-బిలో వాతావరణ పరిస్థితులు షాక్‌ ఇచ్చాయి. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌ వర్షార్పణం కావటంతో సూపర్‌8 అవకాశాలే సన్నగిల్లాయి. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఓటమి ఆ జట్టును మరింత కుంగదీసింది. కానీ ఓమన్‌పై స్వల్ప లక్ష్యాన్ని 101 బంతులు ఉండగానే ఛేదించిన ఇంగ్లాండ్‌.. నెట్‌రన్‌రేట్‌ను అమాంతం మెరుగుపర్చుకుంది. గ్రూప్‌ దశ చివరి మ్యాచ్‌లో నమీబియాపై విజయం సాధిస్తే ఇంగ్లాండ్‌ సూపర్‌8కు చేరుకోగలదు. ఆస్ట్రేలియా, స్కాట్లాండ్‌ మ్యాచ్‌ ఫలితం వ్యత్యాసంతో ఇంగ్లాండ్‌ అవకాశాలు ఏమాత్రం ఆధారపడి లేవు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లకు ఓమన్‌, నమీబియా, స్కాట్లాండ్‌ ఏమాత్రం పోటీ ఇవ్వలేవు. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు గ్రూప్‌-బి సూపర్‌8 రేసు కాస్త ఆసక్తికరం చేశాయి.
కివీస్‌ ఖేల్‌ ఖతం
ప్రపంచ క్రికెట్‌లో అత్యంత నిలకడగా రాణిస్తున్న జట్లలో న్యూజిలాండ్‌ ముందుంటుంది. ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్‌ ట్రాక్‌ రికార్డు అమోఘం. కనీసం సెమీఫైనల్స్‌కు చేరుకోవటం న్యూజిలాండ్‌కు ప్రతి మెగా టోర్నీలోనూ వెన్నతో పెట్టిన విద్య. గ్రూప్‌-సిలో వెస్టిండీస్‌, అఫ్గనిస్థాన్‌, ఉగాండా, పాపువ న్యూగినీలతో న్యూజిలాండ్‌ పోటీపడింది. కానీ అఫ్గాన్‌ చేతిలో ఓటమి న్యూజిలాండ్‌ అవకాశాలను దెబ్బతీసింది. వెస్టిండీస్‌ సైతం న్యూజిలాండ్‌ను ఓడించటంతో కివీస్‌ ఖేల్‌ ఖతం అయ్యింది. మూడేసి మ్యాచుల్లో మూడు విజయాలతో అఫ్గాన్‌, వెస్టిండీస్‌ గ్రూప్‌ నుంచి తొలి రెండు స్థానాలు సొంతం చేసుకున్నాయి. న్యూజిలాండ్‌ చివరి మ్యాచ్‌లో నెగ్గినా.. సూపర్‌ 8 రేసులో ఎటువంటి మార్పు ఉండబోదు. మేటీ క్రికెటర్లతో కూడిన న్యూజిలాండ్‌ గ్రూప్‌ దశ నుంచే నిష్క్రమించటం అతి పెద్ద షాక్‌.
శ్రీలంక అవుట్‌
గ్రూప్‌-డిలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, నేపాల్‌లతో పాటు శ్రీలంక చోటుచేసుకుంది. గతంలో దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్‌ షాక్‌ ఇచ్చిన నేపథ్యంలో ఈ గ్రూప్‌లో ఏం జరుగుతుందనే ఆసక్తి నెలకొంది. కానీ దక్షిణాఫ్రికా నాలుగు మ్యాచుల్లో గెలుపొంది అగ్రస్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన శ్రీలంకపై వరుణుడు సైతం పంజా విసిరాడు. నేపాల్‌తో లంకేయుల మ్యాచ్‌ వర్షార్పణం అయ్యింది. చివరిలో మ్యాచ్‌లో నెగ్గినా.. శ్రీలంక అవకాశాల్లో మార్పు ఉండదు. బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌ రెండో స్థానం కోసం పోటీపడుతున్నా.. బంగ్లాదేశ్‌ సూపర్‌8కు చేరుకోవటం లాంఛనమే అనిపిస్తోంది.

Spread the love