
నవతెలంగాణ – పెద్దవంగర: గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286 జయంతి ఉత్సవాలకు తరలిరావాలని ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బానోత్ సీతారాం నాయక్ పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గిరిజన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంజారాల అభివృద్ధికి సేవాలాల్ చేసిన కృషిని కొనియాడారు. హిందూ ధర్మం గొప్పతనాన్ని బంజారాలకు తెలియజేసి, సంస్కరణలకు సేవాలల్ శ్రీకారం చుట్టారన్నారు. ఈ నెల 15న పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే సేవాలాల్ జయంతి ఉత్సవాలకు తండాల నుండి గిరిజనులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బానోత్ జ్యోతి వెంకన్న, తొర్రూరు ఏఎంసీ డైరెక్టర్ బానోత్ గోపాల్ నాయక్, ధరావత్ శంకర్ నాయక్, బానోత్ సోమన్న, బానోత్ చంద్రశేఖర్, నాయకులు సుధాకర్, రమేష్, యాకన్న, మోతిరాం తదితరులు పాల్గొన్నారు.