
నవతెలంగాణ – కంఠేశ్వర్
భారత ముద్దుబిడ్డ విప్లవ కిశోరాలు షహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ 94 వ వర్ధంతి సందర్భంగా భారత ఐక్య విద్యార్థి సమాఖ్య నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని దేవి రోడ్ లో గల భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి పోషమైన మహేష్ మాట్లాడుతూ.. పంజాబ్ రాష్ట్రంలో లయల్ పూర్ జిల్లాలోని బంగ గ్రామంలో 1907 సెప్టెంబర్ 28న విద్యావతి కిషన్ సింగ్ దంపతులకు భగత్ సింగ్ జన్మించారు తన బాల్యం నుండే పోరాటాల్లో పాల్గొన్నారు. గాంధీజీ నిర్వహించిన విదేశీ వస్త్ర బహిష్కరణ లాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు జలియన్వాలాబాగ్ దురంతర ఘటనను తన 12వ యేట స్వయంగా చూసి చలించిపోయి భారతీయుల రక్తంతో తడిసిన మట్టిని పిడికిట్లో తీసుకొని శాంతియుత పోరాటాలతో స్వాతంత్రం సాధించలేమని సమరశీల పోరాటాలే సరైన మార్గమని గాంధీయవాదాన్ని విడిచి విప్లవ మార్గాన్ని ఎంచుకున్నారు.అలాగే ఎంచుకున్న మార్గంలో నిరంతర నిర్విరామ ఉద్యమాలు నిర్వహించి రెండు వందల సంవత్సరాలు భారత సమాజాన్ని పట్టిపీడించిన రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో సింహం గా నిలిచారు. భగత్ సింగ్ పేరును తలుచుకుంటేనే బ్రిటిష్ అధికారుల వెన్నులో వణుకు పుట్టేలా యువతరాన్ని ఉర్రూతలూగించారు. భారతీయులను చిత్రహింసలకు గురిచేసిన ఎంతోమంది బ్రిటిష్ అధికారులను మట్టి కరిపారు. నాటి బ్రిటిష్ పార్లమెంటులో ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పొగ బాంబులు విసిరారు చివరకు లాహోర్ జైల్లో 1931 మార్చి 23వ తేదీన ఉరికంబాన్ని ముద్దాడి చిరునవ్వుతో భావితరాల భవిష్యత్తు భారతీయుల స్వాతంత్ర స్వేచ్ఛ వాయువుల కోసం అతి చిన్న వయసు తన 23వ యేటనే మేము జీవితాన్ని ప్రేమిస్తాం మరణాన్ని ప్రేమిస్తాం మేము మరణించి ఎర్ర పూల వనంలో పూలై పూస్తాం అంటూ ప్రాణ త్యాగాలు చేసిన మహానీయుడు ఆదర్శప్రాయుడు షహీద్ భగత్ సింగ్ అని అన్నారు. నేటి యువతరం దేశ గతాన్ని వీరుల త్యాగాన్ని కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా వినిమయ తత్వానికి, వ్యసనాలకు బానిసలై దేశ అభివృద్ధికి ఆటంకులు అవుతున్న తీరును చూస్తుంటే భాదేస్తుందని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల జీవిత పోరాట గాధలను నేటి విద్యార్థులు యువతరంలో విస్తృతంగా అవగాహన స్పృహ కల్పించే కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపట్టాలని ఆకాంక్షించారు.భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల ఆశయ సాధనను యుఎస్ఎఫ్ఐ గా సాధించే దిశగా వారి విప్లవ వారసులుగా కృషిని నిరంతరం కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు గణేష్ మరియు నగర కమిటీ సభ్యులు వేణుగోపాల్,మహేందర్, మహేష్ రాకేష్,బాబురావు తదితరులు పాల్గొన్నారు.