శాసన మండలి ఉపఎన్నిక కౌంటింగ్ లో షిఫ్ట్ ల వారీగా విధులు

– మొదటి రౌండ్ నుండి చివరి రౌండ్ వరకు సహనంతో అప్రమత్తంగా పని చేయాలి
– గంట ముందే కౌంటింగ్ సిబ్బంది రిపోర్ట్ చేయాలి
– సిబ్బంది సెల్ ఫోన్ లకు అనుమతి లేదు
– రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
శాసన మండలి ఉపఎన్నిక కౌంటింగ్ లో షిఫ్ట్ ల వారీగా విధులు నిర్వహించాలి.మొదటి రౌండ్ నుండి చివరి రౌండ్ వరకు సహనంతో అప్రమత్తంగా పని చేయాలి.గంట ముందే కౌంటింగ్ సిబ్బంది రిపోర్ట్ చేయాలి.సిబ్బంది సెల్ ఫోన్ లకు అనుమతి లేదు. ఇతర వస్తువులను ఏవి కూడా తీసుకురావద్దని  సిబ్బందికి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ లోని  ఉదయాదిత్య భవన్లో  వరంగల్,ఖమ్మం,నల్గొండ శాసనమండలి ఉప ఎన్నిక లెక్కింపు ప్రక్రియపై  కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు  శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియ లో ఎవరెవరి విధులు ఎలా ఉన్నాయి. వాటిని ప్రాసెస్ ప్రకారం ఎలా చేయాలనే దానిపైన  శిక్షణ జరిగింది. ప్రాథమిక కౌంటింగ్ మొదలు నుండి ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా ఫలితం వెలువడేంత వరకు  చేయాల్సినవి, చేయకూడని పనులకు సంబంధించి విపులంగా వివరంగా శిక్షణ ఇచ్చారు.  శిక్షణ సందర్భంగా కౌంటింగ్ సిబ్బంది ఎంత వేగంగా జాగ్రత్తగా పనిచేస్తే   అంత వేగంగా ఫలితాలు వస్తాయని  రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు.  కౌంటింగ్ సిబ్బందికి షిఫ్ట్ ల వారీగా  విధులను కేటాయించామని, ప్రతి ఒక్కరూ గంట ముందుగానే రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొనడానికి వచ్చేవారు సెల్ఫోన్లు తీసుకురావద్దని, బయటి నుండి ఎటువంటి వస్తువులు తీసుకురావద్దని, ఎటువంటి డ్రింక్స్ కూడా తీసుకురావద్దని తెలిపారు. కౌంటింగ్ నిర్వహించే సందర్భంలో ఒకరినొకరు గౌరవించుకొని కలిసిమెలిసి పనిచేయాలన్నారు. ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కావడంతో  ఫలితం రావడానికి సమయం పడుతున్నందున మొదటి రౌండ్ నుండి చివరి రౌండు వరకు  అప్రమత్తతతో,  సహనంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, పులిచింతల స్పెషల్ కలెక్టర్ నటరాజన్, డిఆర్డిఎ పిడి నాగిరెడ్డి, శిక్షణా కార్యక్రమాల నోడల్ ఆఫీసర్  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి  శ్రవణ్, గిరిజన అభివృద్ధి శాఖ అధికారి  రాజ్ కుమార్, ట్రైనర్ బాలు  లు పాల్గొన్నారు.
Spread the love