మానవ అక్రమ రవాణా నివారించే అంశంపై అవగాహన కల్పించాలి

Awareness should be raised on the issue of preventing human trafficking.– ఐకెపి వ్యవసాయ విభాగం జిల్లా డిపిఎం మారుతి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మానవ అక్రమ రవాణా నివారించే అంశంపై మహిళా సంఘ సభ్యులందరికీ అవగాహన కల్పించాలని ఐకెపి వ్యవసాయ విభాగం జిల్లా డిపిఎం మారుతి అన్నారు.
శనివారం మండల సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు, చిన్నపిల్లలు అక్రమ రవాణా చేసి బొంబాయి కలకత్తా వంటి పట్టణాలలో పాటు ఇతర దేశాలకు విక్రయిస్తున్నారని, తద్వారా వారు దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు.అతి నిరుపేదలు, బలహీన వర్గాలకు చెందిన వారిని గుర్తించి వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్నారు. ఈ అంశాలపై ప్రతి ఒక్క మహిళా సంఘ సభ్యురాలికి అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక సమావేశాలు ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తుందని అన్నారు.ఏఐ టెక్నాలజీ ద్వారా మహిళల యొక్క ఫోటోలను, వీడియోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తద్వారా వారిని అక్రమ రవాణా చేస్తున్నారన్నారు. ఐకెపి సీసీలు గ్రామ సమాఖ్యల పాలకవర్గ సభ్యులు ప్రతి ఒక్క సభ్యురాలికి ఈ అంశంపై అవగాహన కల్పించాలని, గ్రామస్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ మేరకు అన్ని గ్రామ సంఘాల్లో, అన్ని చిన్న సంఘాల్లో తీర్మానాలు చేయాలని సూచించారు.
ప్రతి ఒక్క మహిళను అప్రమత్తం చేయాలి.. 
ఏపిఎం కుంట గంగాధర్
మండలంలోని ప్రతి ఒక్క మహిళకు మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్థానిక ఐకెపి ఏపిఎం గంగాధర్ పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు స్వయం సహాయక సంఘంలో కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మానవ అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండే అంశంలో పూర్తి అవగాహన కల్పించడం లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. భౌతిక కిడ్నాప్ రూపంలోనే కాకుండా సైబర్ రూపంలో కూడా మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ల ద్వారా మహిళలతో మాటలు కలిపి వారిని వక్రమార్గంలోకి పయనించేలా చేస్తున్నారని ఈ అంశాల పట్ల అవగాహన కలిపించి  మహిళలను అప్రమత్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ఐకెపి ద్వారా చేపట్టిందని తెలిపారు. ఎలాంటి సైబర్ నేరాలు జరిగిన, బెదిరింపులకు పాల్పడిన వారిపై 1930 సైబర్ క్రైమ్ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి సహాయం పొందాలని సూచించారు. కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు రోజారాణి, సీసీలు రవికుమార్, పిరియా, భాగ్యలక్ష్మి, సిబ్బంది ధనలక్ష్మి, అనసూయ, గ్రామ సమాఖ్యల అధ్యక్షురాల్లు, వీఓఏలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love