తన్వీ శర్మ, అర్జున్ జోడీ సైతం
ఆస్ర్టేలియన్ ఓపెన్ సూపర్ 500
సిడ్నీ : భారత అగ్రశ్రేణి షట్లర్, వరల్డ్ నం.10 పి.వి సింధు ఆస్ర్టేలియన్ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో సహచర భారత క్రీడాకారిణి ఇషారాణి బారుహపై సింధు 22-20, 21-12తో వరుస గేముల్లో గెలుపొందింది. 42 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో సింధుకు తొలి గేమ్‌లో గట్టి పోటీ ఎదురైంది. 11-10తో ఇషారాణి విరామ సమయానికి ఆధిక్యంలో నిలిచి సింధును ఒత్తిడిలోకి నెట్టింది. సింధు స్కోరు సమం చేసినా.. ద్వితీయార్తం అంతా ఆధిక్యం చేతులు మారుతూ ఉత్కంఠ రేపింది. 20-20 వద్ద ఇషారాణిని నిలువరించిన సింధు.. వరుసగా రెండు పాయింట్లతో తొలి గేమ్‌ను ఖాతాలో వేసుకుంది. రెండో గేమ్‌లో సింధుకు తనదైన జోరు చూపించింది. దీంతో యువ షట్లర్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. 11-3తో దూసుకెళ్లిన సింధు దూకుడుగా ఆడింది. సహచర యువ షట్లర్‌పై సాధికారిక విజయం నమోదు చేసింది. మరో ఇద్దరు భారత షట్లర్లు పోటీపడిన మ్యాచ్‌లో తన్వీ శర్మ పైచేయి సాధించింది.
వరల్డ్ నం.36 తన్వీ శర్మ 21-13, 21-15తో వరల్డ్ నం.46 మాళవిక బాన్సోద్‌పై గెలుపొందింది. 37 నిమిష్లాలోనే ముగిసిన మ్యాచ్‌లో మాళవిక బాన్సోద్ ఆశించిన పోరాట పటిమ చూపించలేదు. మరో మ్యాచ్‌లో తాన్య హేమంత్ 2-21, 15-21తో రెండో సీడ్, థాయ్‌లాండ్ షట్లర్ చొచువాంగ్ చేతిలో వరుస గేముల్లో ఓటమి చెందింది. ఇండోనేషియా ఓపెన్‌లో ఆకట్టుకున్న పురుషుల డబుల్స్ జోడీ ఎంఆర్ అర్జున్, హరిహరణ్‌లు ఆస్ర్టేలియాలోనూ అదే జోరు కొనసాగిస్తున్నారు. మెన్స్ డబుల్స్ ప్రీ క్వార్టర్స్‌లో లోకల్ జోడీ మైఖేల్, డైలాన్‌లపై అర్జున్, హరిహరణ్‌లు 21-17, 21-7తో మెరుపు విజయం సాధించారు. తొలి గేమ్‌లో 11-10తో అర్జున్ జోడీ ముందంజ వేసినా.. 16-16 వరకు నువ్వా నేనా అన్నట్టు పోటీ సాగింది. ఆ తర్వాత వరుస పాయింట్లతో అర్జున్ జోడీ తొలి గేమ్‌ను గెల్చుకుంది. రెండో గేమ్‌లో అర్జున్, హరిహరణ్‌లు దూకుడుగా ఆడి ఏకపక్షంగా రెండో గేమ్‌ను సొంతం చేసుకుని క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు. మిక్స్‌డ్ డబుల్స్ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో ధ్రువ్ రావత్, మనీశ కె జంట 19-21, 18-21తో అకీరా,సయిటో (జపాన్) చేతిలో పోరాడి ఓడింది. నేడు జరిగే మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్స్‌లో టాప్ సీడ్ అకానె యమగూచి (జపాన్)తో తన్వీ శర్వ పోటీపడనుండగా.. చైనీస్ తైపీ షట్లర్ చెన్ సు యుతో పి.వి సింధు తలపడనుంది.
క్వార్టర్స్‌కు సింధు
- Advertisement -
- Advertisement -



