సింగరేణి భవిష్యత్తు ఉద్యోగులపై ఉంది

– ఇన్‌చార్జి జీఎం ఎం. శ్రీనివాస్‌
నవతెలంగాణ-నస్పూర్‌
సింగరేణి భవిష్యత్తు నూతన ఉద్యోగులపై ఉందని ఇన్‌చార్జి జీఎం ఎం శ్రీనివాస్‌ అన్నారు. కారుణ్య నియామకాలలో భాగంగా శ్రీరాంపూర్‌ ఏరియాలో నియామకం పొందిన 102 మంది యువతీ యువకులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ సింగరేణి సంస్థ కారుణ్య నియామకాలు చేపడుతూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందని, దక్షిణ భారతదేశంలోనే సింగరేణి సంస్థ దేశానికే తలమానికంగా ఉందని అన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న ఉద్యోగులు సర్ఫేస్‌లో లైట్‌ జాబ్‌ కోసం ప్రయత్నం చేయకుండా, గైర్హాజరు కాకుండా ఉద్యోగం చేసుకోవాలని అన్నారు. అలాగే తమ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ, క్రమశిక్షణతో ఉద్యోగం చేసుకోవాలని, సింగరేణిని లాభాల బాటలో తీసుకురావడానికి కృషి చేయాలని అన్నారు. అదే విధంగా వారి తల్లిదండ్రులను, అత్త మామలను కూడా మంచిగా చూసుకోవాలని సూచించారు. సింగరేణిలో రెండవ తరానికి ఉద్యోగాలు రావడం మీ అదృష్టంగా భావించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్‌ సెక్రటరీ బాజీ సైదా, ఎస్‌ఓ టూ జీఎం వి పురుషోత్తమరెడ్డి, డీజీఎం (ప) అరవింద రావు, పర్సనల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌, సీనియర్‌ పీఓ కాంతారావు, అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ సత్యనారాయణ, సీనియర్‌ అసిస్టెంట్‌ రాఘవేంద్ర పాల్గొన్నారు.

Spread the love