Friday, August 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంముంచెత్తిన బురద

ముంచెత్తిన బురద

- Advertisement -

జాడలేని 1600 మంది, వీరిలో భారతీయులు 288
దాదాపు 400కు చేరిన మృతుల సంఖ్య
నేపాల్ అంతటా నెలకొన్న విషాదం
భూకంపం కాదు..హిమానీ నదం బద్దలవ్వడం వల్లే..
మరో విపత్తు పొంచి ఉందని చైనా హెచ్చరిక

ఖాట్మాండ్ : హిమాలయ దేశం నేపాల్లో బుధవారం సంభవించిన జలప్రళయం పెను విషాదాన్ని నింపింది. తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ఈ మెరుపు వరదల్లో మృతుల సంఖ్య దాదాపు 400కు చేరుకోగా, 1,600 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో గురువారం ఎక్కడ చూసినా వరద నీరు, పెద్దయెత్తున పేరుకుపోయిన బురద కన్పించింది. నేపాల్లో 826 మంది గల్లంతు కాగా, అందులో వందలాది మంది భారతీయులున్నారు. వారిలో 30 దేశాలకు చెందిన పౌరులు ఉన్నారు. కాగా, ఇదే వరదలకు టిబెట్లో ముగ్గురు మరణించగా, 558 మంది గల్లంతైనట్టు చైనా సీసీటీవీ వెల్లడించింది. వరదలకు వందలాది ఇండ్లు ధ్వంసమయ్యాయి. వంతెనలు, పలు ప్రాజెక్టులు కూడా నాశనమయ్యాయి. నువాకోట్, రసువా జిల్లాల్లో తీవ్ర నష్టం ఏర్పడింది. డజన్ల వంతెనలు పాడైపోయాయని, 40 కి.మీ మేర రోడ్లు ధ్వంసం అయ్యాయని అధికారులు తెలిపారు.

పలు గ్రామాల్లోని నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు, శిబిరాలకు తరలిస్తున్నారు. నేపాల్లోని రసువా జిల్లా దిగువ ప్రాంతాల్లో వరద విధ్వంసమే సృష్టించింది. త్రిశూలి నది నుంచి పోటెత్తిన వరద నీరు, వ్యర్థాలు ఇండ్లు, రోడ్లు, వంతెనలు, హైడ్రోపవర్ ప్రాజెక్టును ముంచెత్తాయి. తిమురే, త్రిశూలి బజార్, బెట్రాపతి ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బలమైన నీటి ప్రవాహానికి ఒక హెలిప్యాడ్ కూడా కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడింది. కాగా, చైనాలోని గిరింగ్ పట్టణంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగా, పోర్టు ప్రాంతం మాత్రం ఇంకా అంధకారంలోనే ఉంది. వరద ప్రభావ ప్రాంతాల్లో గాలింపు, సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ధాడింగ్, గోర్ఖా, నువాకోట్, తనహూన్, రసువా, పశ్చిమ నవల్పరాసి ప్రాంతాల నుంచి కూడా ప్రాణనష్టం నమోదైంది.

హిమానీనదం వల్లే వరదలు
నేపాల్ హిమాలయ ప్రాంతాన్ని బుధవారం అతలాకుతలం చేసిన ప్రాణాంతక మెరుపు వరదలు, ఎత్తయిన పర్వతాలలో ఒక భారీ హిమానీనదం ముక్కవిరిగి కింద ఉన్న నదీలోయలో కూలిపోవడం వల్ల సంభవించి ఉండవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ ఉటంకించిన భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, హిమానీనద శాస్త్రవేత్తల ప్రాథమిక విశ్లేషణ ప్రకారం ఈ ఘటన ఒక హిమసంపాతం (ఐస్ అవలాంచ్) అని తెలుస్తున్నది. చిత్రాలను అధ్యయనం చేసిన కాల్గరీ విశ్వవిద్యాలయంలోని భూ విజ్ఞాన శాస్త్రవేత్త డేనియల్ షుగర్ ప్రకారం ఉపగ్రహ చిత్రాలు దాదాపు రెండు వేల అడుగుల వెడల్పు గల ఒక హిమానీనదంలోని ఒక భాగం విరిగి సుమారు 17 వేల అడుగుల ఎత్తు నుంచి పడిపోయినట్టు సూచిస్తున్నాయి. దీని కారణంగా పొడిపొడిగా మారిన మంచు, నీరు లెండే ఖోలా నదివైపు, చివరకు నేపాల్-చైనా సరిహద్దు సమీపంలోని భోటేభోషి నదివైపు ప్రవహించాయని వివరించారు.

28 మంది భారతీయులను రక్షించిన అధికారులు
నేపాల్ వరదల్లో గల్లంతైన 28 మందిని రక్షించినట్టు భారత ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఇంకా 288 మంది ఆచూకీ తెలియడం లేదని తెలిపింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రక్షించిన 21 మంది కూడా తమిళనాడుకు చెందిన వారని, వారిని భారత్ రప్పిస్తున్నట్టు తెలిపారు. చైనా వైపున ఉన్న సరిహద్దు ప్రాంతమైన టిబెట్లో కూడా చాలామంది భారతీయులు చిక్కుకుపోయారని, 200 మందికి పైగా సహాయం కోరుతున్నారని, వారిలో 95 మంది ప్రస్తుతం టిబెట్ లోని చిన్న గ్రామమైన దార్చెన్లో ఉన్నారన్నారు. ఆచూకీ దొరక్కుండా పోయిన 288 మందిలో 73 మంది త్రిశూలీలోని పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్నారని, ఈ ప్రాంతాన్ని ఆకస్మిక వరద తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. కాగా, నేపాల్కు మానవతా సహాయం అందించడానికి రెండు విమానాల్లో సహాయ సామగ్రి పంపినట్టు చెప్పారు. కాగా, ఆకస్మిక వరదల కారణంగా నేపాల్, టిబెట్ లో 1,500 మందికి పైగా గల్లంతయ్యారని, అందులో 800 మంది విదేశీయులు ఉన్నారని నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖానల్ తెలిపారు. కాగా నేపాల్లో భారీ వరదలు సంభవించడంతో ఆ దేశంతో సరిహద్దును పంచుకుంటున్న బీహార్ రాష్ట్రంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు ఎప్పటికప్పుడు వరద మట్టాలను నమోదు చేసుకుంటూ పరిస్థితిని గమనిస్తున్నారు.

వరద ప్రాంతాల్లో నేపాల్ ప్రధాని పర్యటన
వరదకు గురైన నువాకోఎట్లో నేపాల్ ప్రధాని బాలేందర్ షా గురువారం రోడ్డు మార్గంలో పర్యటించి నష్టాన్ని ప్రత్యక్షంగా చూశారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులు, రక్షణ శాఖ అధికారులు, నేతలతో సమావేశమై చేపట్టాల్సిన సహాయ చర్యల గురించి చర్చించారు. భారత్ పంపిన సహాయ సామగ్రిని తీవ్రంగా వరద ప్రమాదానికి గురైన ప్రాంత వాసుల కోసం హెలికాప్టర్ల ద్వారా టెంట్లు, ఆహారం, నీరు, మందులను విడిచి పంపిణీ చేస్తున్నట్టు నేపాల్ సైనిక ప్రతినిధి రాజారామ్ బసెంట్ తెలిపారు.

అధిక సంఖ్యలో దక్షిణాది వారు గల్లంతు
దక్షిణాది నుంచి వెళ్లిన 168 మంది నేపాల్ వరదల బారిన పడ్డారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన వీరు గల్లంతు లేదా చిక్కుకుపోయినట్టు సమాచారం. కాగా, తమ రాష్ట్రం నుంచి నేపాల్కు 103 మంది కైలాస యాత్రకు బయలుదేరినట్టు తమిళనాడు విద్యా శాఖ మంత్రి రాజ మోహన్ తెలిపారు. అయితే మొత్తం 21 మంది తమిళులను మాత్రమే రక్షించినట్టు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. అలాగే కేరళ నుంచి 53 మంది, కర్ణాటక నుంచి ఐదుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడుగురు ఉన్నారు. అలాగే తెలంగాణలో తమ వారు నేపాల్లో చిక్కుకుపోయారని తెలియజేస్తూ, వారి ఆచూకీ కోసం 70-80 కాల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు.

పొంచి ఉన్న మరో ముప్పు
నేపాల్లోని ఛోచెస్ ఖోలా, పురేపు సాంగ్సో నదుల సంగమ ప్రాంతం వద్ద ఏర్పడిన ఒక అవరోధ సరస్సు రాబోయే మూడు రోజుల్లో తెగిపోయే ప్రమాదం ఉందని చైనా అధికారులను ఉటంకిస్తూ గ్లోబల్ టైమ్స్ గురువారం నివేదించింది. ఇప్పటికే ఈ సరస్సు ఉదయానికి 2 మిలియణ క్యూబిక్ మీటర్ల నీటితో ఇప్పటికే నిండి పొర్లుతున్నదని చైనా జల వనరుల శాఖ వెల్లడించింది. రాబోయే మూడు రోజుల్లో మరో మూడు మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు చేరవచ్చునని, అదే జరిగితే నది పొంగే ప్రమాదముందని పేర్కొంది. కాగా తమ ప్రాంతంలో సంభవించిన వరద విపత్తు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చైనా అధ్యక్షుడుషీ జిన్ పింగ్ తన అత్యున్నత స్థాయి సహాయకుడిని గురువారం ఆ ప్రభావిత ప్రాంతాలకు పంపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -