ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

– ప్రజావాణిలో అంగన్వాడీ యూనియన్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్‌
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ యూనియన్‌ కోరింది. ఈ మేరకు శుక్రవారం ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కే.సునీత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి, రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ బి.స్వప్న, జి. శారద, డి.సునీత, రాష్ట్ర కమిటీ సభ్యులు బి.శోభా, బి.లలిత, బి. నారాయణమ్మ, రమా, వెంకటమ్మ, సమ్మక్క, మాసమ్మ, జ్యోతి, సులోచన, సుకన్య, అంగన్వాడీ హెల్పర్స్‌ కళ్యాణి, గంగమ్మ, కళాబాయి, సత్యవతి, రాధా, మాణిక్యమ్మ తదితరులు ప్రజావాణి నోడల్‌ అధికారి దివ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీ ఉద్యోగులకు డిసెంబర్‌, జనవరి రెండు నెలల వేతనాలు చెల్లించాలనీ, 24 రోజుల సమ్మె కాలం వేతనాలు, సమ్మె సందర్భంగా ఇచ్చిన ఇతర హామీలు నెరవేర్చాలని వారు కోరారు.
ఉద్యోగాలివ్వండి ప్రజావాణిలో స్టాఫ్‌ నర్సుల వినతి
గతంలో స్టాఫ్‌ నర్సుల నియామకాల సమయంలో ఎంపికైన తమను పక్కన పెట్టారనీ, తమకు న్యాయం చేయాలని పలువురు స్టాఫ్‌ నర్సులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రజావాణిలో స్టాఫ్‌ నర్సు అభ్యర్థి పి.శోభా రాణి తదితరులు వినతిపత్రం సమర్పించారు. 2017లో 3,311 స్టాఫ్‌ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారని గుర్తు చేశారు. 2,418 మందిని ఎంపిక చేసి బడ్జెట్‌ లేదంటూ 893 పోస్టులకు అపాయింట్‌ మెంట్‌ లెటర్స్‌ ఇవ్వలేదని తెలిపారు. తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తమ పోస్టులను తమకివ్వాలని కోరారు.

Spread the love