Magazines

తగిన శాస్తి

5 రోజుల క్రితం

A fitting punishment
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026 | 2 నిమిషాల చదవడం

మహేంద్ర, సురేంద్ర మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుంటున్నారు. మహేంద్ర ఆడినంత సేపు ఆడి, ఆ తర్వాత ఇంటికి వచ్చి, చదువులో మునిగి పోయేవాడు. సురేంద్ర ఎక్కువ సేపు ఆటల్లో గడిపి, ఆ తర్వాత ఇంటికి వెళ్లేవాడు. ఇంట్లో మొబైల్ ఫోన్ తో బాగా కాలక్షేపం చేసేవాడు. మహేంద్ర ఎప్పుడూ తరగతిలో మొదటి ర్యాంకు కాగా, సురేంద్రకు ఎప్పుడూ ఫెయిల్ మార్కులు వచ్చేవి. మహేంద్ర ఎన్నోసార్లు చెప్పాడు. "రోజు మా ఇంటికి వచ్చి, నాతో పాటు కలిసి చదువుకో. ఎప్పుడూ ఉపాధ్యాయుల చేత తిట్లు ఎందుకు తింటావు? నాకు చాలా బాధగా ఉంది." అని. కానీ ఆ మూర్ఖుడికి హితబోధలు‌ చెవికెక్కలేదు.

ఒకసారి మార్కులు బాగా తక్కువ తెచ్చుకున్న సురేంద్ర తల్లిదండ్రులతో బాగా చివాట్లు తింటాడు. మరోసారి ఫెయిల్ మార్కులు వస్తే బడి మానిపంచి ఏదైనా పనిలో పెడతామని తల్లిదండ్రులు హెచ్చరించారు. ఈ విషయం సురేంద్ర చెల్లెలు అపర్ణ మహేంద్రతో చెబుతుంది. తన అన్నను ఎలాగైనా తెలివైన వాడిని చేయాలని బతిమాలింది. మహేంద్ర సురేంద్రను ఇకనుంచి అయినా కలిసి చదువుదామని బతిమాలాడు. సురేంద్ర పట్టించుకోలేదు. మహేంద్ర సురేంద్రతో ఆటలు మానేశాడు.

వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. సురేంద్ర మహేంద్ర వద్దకు వచ్చి, పరీక్షల సమయంలో మహేంద్ర రాసిన జవాబులను తనకు చూపించమని, తనకు తక్కువ మార్కులు వస్తే తల్లిదండ్రులు తనను చదువు మానిపిస్తారని అందుకే ఈ సహాయం చేయమని ప్రాధేయపడినాడు. మహేంద్ర సురేంద్రను కష్టపడి చదవమని హితబోధ చేశాడు. మహేంద్ర సురేంద్రకు తాను రాస్తున్న జవాబులను చూపించలేదు. పరీక్షలు అయిపోయిన తర్వాత సురేంద్ర మహేంద్ర వద్దకు వచ్చి, "మన ఇన్నాళ్ళ స్నేహబంధం తెగిపోయింది. ఇక నీకు నాకు శాశ్వతంగా మాటలు తెగిపోయాయి." అన్నాడు. "మంచిది. ఎన్నోసార్లు హితబోధ చేశాను. నాలాగా కష్టపడి చదవమని. మరి వినలేదు. సోమరిపోతు అయిన నీకు నాకు స్నేహం కుదరదు. నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది." అన్నాడు మహేంద్ర.

ఇంటికి వచ్చిన సురేంద్ర చెల్లెలు అపర్ణతో మహేంద్ర గురించి చెడుగా చెప్పబోతాడు. "మహేంద్ర అన్నయ్య గురించి నాకు తెలుసు. కష్టపడి చదివి, ఎప్పుడు మొదటి ర్యాంకు తెచ్చుకునే నాకు నువ్వు అన్నయ్యని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఇకనుంచి నాతో కూడా నువ్వు మాట్లాడకు." అన్నది అపర్ణ. సురేంద్ర సిగ్గుతో తలదించుకున్నాడు. తన భవిష్యత్తును ఊహించుకుని దిగులుపడ్డాడు.



సరికొండ శ్రీనివాసరాజు, 8008848703

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్