కొన్ని జీవితాలు వ్యక్తిగత విజయాలకే పరిమితమవుతాయి. మరికొన్ని జీవితాలు సమాజపు బాధలకు సమాధానంగా నిలుస్తాయి. అణచివేత, అంటరానితనం, కులవివక్ష, పేదరికంపై జీవితాంతం పోరాడి, పీడిత ప్రజల ఆత్మగౌరవమే లక్ష్యంగా బతికిన అరుదైన ప్రజానేత మిడసల వెంకటసుబ్బయ్య జీవితం రెండో కోవకు చెందుతుంది. ఆయన 54 ఏండ్ల పోరాట ప్రస్థానాన్ని కుమారుడు, ఛాయాగ్రాహకుడు మిడసల కృష్ణమూర్తి పరిశోధనాత్మకంగా అక్షరబద్ధం చేసిన గ్రంథమే ఈ పుస్తకం.
1929 జూలై 1న ప్రకాశం జిల్లా పేర్నమిట్టలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన వెంకటసుబ్బయ్యకు బాల్యంలో ఎదురైన కులవివక్షే జీవితకాల పోరాటానికి పునాది వేసింది. పదకొండేండ్ల వయసులో దేవుడి రథాన్ని చూడటానికి వెళ్లితే దళితుడనే కారణంతో అవమానానికి గురికావడం ఆయనలో ప్రశ్నించే తత్వాన్ని రగిలించింది. కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితమై ఎర్రజెండా చేతబట్టి భూమి, భుక్తి, ఆత్మగౌరవం కోసం ఉద్యమించారు. 2,114 ఎకరాల భూమిని పేదలకు దక్కేలా చేయడం, అయ్యగానిపల్లి భూపోరాటంలో 13 ఏండ్లపాటు పోరాడి వెయ్యి ఎకరాల సాగుభూమిని సాధించడం ఆయన ఉద్యమ నిబద్ధతకు నిదర్శనాలు. మంచినీటి హక్కుల కోసం పోరాటం, దళితులకు ఇళ్ల స్థలాల సాధన, కార్మికుల హక్కుల కోసం న్యాయపోరాటాలు ఆయన ప్రజాజీవితంలోని విభిన్న కోణాలను ఆవిష్కరిస్తాయి.
ఈ ప్రస్థానంలో రోశమ్మ అందించిన కుటుంబ సహకారం కూడా ప్రత్యేకంగా ప్రస్తావించదగినది. భర్త ప్రజా ఉద్యమాల్లో నిమగ్నమైతే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకొని, కార్మికురాలిగా పనిచేస్తూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఆమె త్యాగం ఈ జీవిత చరిత్రకు మరో బలమైన కోణం. వెంకటసుబ్బయ్య జీవితాన్ని కేవలం ఒక రాజకీయ నాయకుడి చరిత్రగా కాకుండా, ఆనాటి సామాజిక అసమానతలు, భూస్వామ్య దోపిడీ, కులవివక్షకు వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటాల చరిత్రగా రచయిత మలిచారు. వ్యక్తిగత సుఖాల కంటే సామాజిక ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చిన ఒక ఉద్యమకారుడి అంతరంగాన్ని ఈ గ్రంథం పరిచయం చేస్తుంది.
నేటి రాజకీయాల్లో పదవులు, అధికారం, స్వప్రయోజనాలే ప్రాధాన్యం సంతరించుకుంటున్న తరుణంలో వెంకటసుబ్బయ్య వంటి నిబద్ధత కలిగిన ప్రజానేతల జీవితాలు మరింత ప్రాసంగికం. తండ్రి పోరాటాన్ని కుమారుడు భావితరాలకు అందించడం అభినందనీయం. ఇది ఒక వ్యక్తి జీవిత చరిత్ర మాత్రమే కాదు.. ప్రజల కోసం జీవించడం అంటే ఏమిటో చాటిచెప్పే ఉద్యమ పాఠం. ప్రజాసేవ, సామాజిక న్యాయం, ఆత్మగౌరవ పోరాటాల పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ చదవాల్సిన విలువైన గ్రంథం.
కుర్ర ప్రసాద్ బాబు, 7702456364







కామెంట్లు (0)