Magazines

గ్రంథాలయాలు.. జ్ఞాన సమాజ నిర్మాణానికి వెలుగుదివ్వెలు

30 నిమిషాల క్రితం

Libraries
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 5 నిమిషాల చదవడం

ప్రపంచ అభివృద్ధికి పునాదులు.. ప్రజాస్వామ్యానికి ప్రాణాధారాలు.. సమానత్వానికి జ్ఞాన వారధులు! “ఒక దేశం ఎంత సంపదను సృష్టించిందనే దానికంటే, ఆ సంపదలో ఎంత జ్ఞానాన్ని ప్రజలందరికీ పంచిందనేదే ఆ దేశ నాగరికతకు నిజమైన కొలమానం. ఆ జ్ఞానాన్ని ప్రతి గడపకూ చేరవేసే మహత్తర ప్రజాస్వామ్య సంస్థే గ్రంథాలయం.” ఒక సమాజంలోని చివరి వ్యక్తికి విద్య ఎంత చేరువైంది? పేద విద్యార్థికి పుస్తకం అందుబాటులో ఉందా? గ్రామీణ యువకుడికి సమాచారాన్ని పొందే అవకాశం ఉందా? మహిళకు స్వేచ్ఛగా చదువుకునే వాతావరణం ఉందా? ప్రతి పౌరుడికి తన జీవితాన్ని మార్చుకునే జ్ఞాన వనరులు అందుతున్నాయా? అనే ప్రశ్నలకు లభించే సమాధానాలే నిజమైన అభివృద్ధికి నిదర్శనాలు. ఈ ప్రశ్నలన్నింటికీ ఆశాజనకమైన సమాధానాన్ని అందించగల సామాజిక సంస్థ గ్రంథాలయం.
(నవంబర్‌ 14 నుండి 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు)


నేటి ప్రపంచం నాలుగో పారిశ్రామిక విప్లవం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాంకేతికత, సమాచార విస్ఫోటనం వైపు వేగంగా ప్రయాణిస్తోంది. ఈ మార్పుల మధ్య గ్రంథాలయాల అవసరం తగ్గలేదు. మరింత పెరిగింది. ఎందుకంటే సమాచారాన్ని పొందడం ఒక విషయం, సరైన సమాచారాన్ని గుర్తించడం మరో విషయం. చదవడం నైపుణ్యం, చదివిన దానిని విశ్లేషించి జీవితానికి అన్వయించుకోవడం సామర్థ్యం. ఈ రెండింటినీ పెంపొందించే కేంద్రాలుగా ఆధునిక గ్రంథాలయాలు రూపాంతరం చెందుతున్నాయి. భారతదేశంలోని ప్రజా గ్రంథాలయాల వాస్తవ పరిస్థితినిరాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ కోసం KANTAR సంస్థ రూపొందించిన ఈ అధ్యయనం గణాంకాల సమాహారంగా కాకుండా, దేశంలోని కోట్లాది మంది ప్రజల జ్ఞాన ఆకాంక్షలకు అద్దం పట్టే పత్రంగా చూడాలి.

గ్రంథాలయ అవసరం

ఒక దేశంలోని గ్రంథాలయాల పరిస్థితిని తెలుసుకోవాలంటే కేవలం ఎన్ని గ్రంథాలయాలు ఉన్నాయి? వాటిలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? అనే ప్రశ్నలు సరిపోవు. వాటిని ఎంతమంది ఉపయోగిస్తున్నారు? ఎవరికెవరికీ వాటి సేవలు అందడం లేదు? ప్రజలు ఎలాంటి పుస్తకాలను కోరుకుంటున్నారు? గ్రంథాలయాలు వారి జీవితాల్లో ఎలాంటి మార్పును తీసుకువస్తున్నాయి? అనే అంశాలను కూడా పరిశీలించాలి. ఈ లక్ష్యంతో నిర్వహించిన భారతీయ గ్రంథాలయ సర్వే దేశవ్యాప్తంగా 5,140 గ్రంథాలయాలను పరిశీలించి, ప్రజా గ్రంథాలయాలను ఉపయోగించే పాఠకులు, ఇతర గ్రంథాలయాల వినియోగదారులు, గ్రంథాలయాలకు వెళ్లని వ్యక్తుల అభిప్రాయాలను సేకరించింది. రాష్ట్ర కేంద్ర గ్రంథాలయాల నుంచి జిల్లా, పట్టణ, గ్రామీణ, గిరిజన ప్రాంతాల గ్రంథాలయాల వరకు విస్తృతమైన పరిశీలన చేపట్టింది.

నేర్చుకోవాల్సిన పాఠాలు

ప్రపంచ దేశాల అభివృద్ధి చరిత్రను పరిశీలిస్తే బలమైన గ్రంథాలయ వ్యవస్థలు విద్య, పరిశోధన, ప్రజాస్వామ్యం, సామాజిక సమానత్వం, జీవితకాల అభ్యాసానికి ఎంతగానో దోహదపడుతున్నాయని స్పష్టమవుతుంది. ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే, స్వీడన్, సింగపూర్ వంటి దేశాలు గ్రంథాలయాలను కేవలం పుస్తకాలు ఇచ్చే కేంద్రాలుగా కాకుండా ప్రజల జీవితాల్లో భాగమైన జ్ఞాన, సాంస్కృతిక, డిజిటల్ సేవా కేంద్రాలుగా అభివృద్ధి చేశాయి.

జ్ఞానానికి అందని గ్రామీణ గడపలు

గ్రంథాలయంలోని పుస్తకాల సంఖ్య దాని విజ్ఞాన సంపదకు ఒక సూచిక. అయితే ఆ సంపద ప్రజల అవసరాలకు ఎంతవరకు ఉపయోగపడుతోంది అనేదే అసలైన ప్రశ్న. సర్వే వివరాల ప్రకారం రాష్ట్ర కేంద్ర గ్రంథాలయాల్లో సగటున 77,515 పుస్తకాలు, జిల్లా గ్రంథాలయాల్లో 24,145 పుస్తకాలు ఉన్నాయి. గ్రామీణ గ్రంథాలయాల్లో సగటున 3,548 పుస్తకాలు, గిరిజన ప్రాంత గ్రంథాలయాల్లో కేవలం 1,790 పుస్తకాలు మాత్రమే ఉన్నట్లు వెల్లడైంది. అన్ని రకాల గ్రంథాలయాలను కలిపి చూస్తే ఒక్కో గ్రంథాలయంలో సగటున 5,500 పుస్తకాలు ఉన్నట్లు అంచనా. ఈ వ్యత్యాసం పట్టణ, గ్రామీణ, గిరిజన ప్రాంతాల మధ్య జ్ఞాన వనరుల పంపిణీలో ఉన్న అసమానతను స్పష్టం చేస్తోంది. సుమారు 51 శాతం మంది పాఠకులు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు మరింతగా అందుబాటులో ఉండాలని కోరుకోవడం గమనార్హం.

నేటి పోటీ ప్రపంచంలో ఒక పేద విద్యార్థి భవిష్యత్తును నిర్ణయించేది అతని ప్రతిభ మాత్రమే కాదు, ఆ ప్రతిభను నిరూపించుకునేందుకు అవసరమైన వనరులు కూడా. ఒక విద్యార్థి దగ్గర డబ్బు లేకపోవడం వల్ల మంచి పుస్తకం కొనలేకపోతే, అతని కలలు కూలిపోకూడదు. అలాంటి విద్యార్థికి గ్రంథాలయమే విశ్వవిద్యాలయం కావాలి. పోటీ పరీక్షల పుస్తకాలు, ఉద్యోగ సమాచార వనరులు, పరిశోధనా గ్రంథాలు, బాలసాహిత్యం, మహిళా సాధికారతకు సంబంధించిన పుస్తకాలు, ప్రాంతీయ భాషా సాహిత్యం సమృద్ధిగా అందుబాటులో ఉండాలి. ఫిన్లాండ్ వంటి దేశాల్లో ముద్రిత పుస్తకాలతో పాటు ఈ-పుస్తకాలు, ఆడియో పుస్తకాలు, వివిధ భాషల సమాచార వనరులు అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో కూడా ప్రతి గ్రంథాలయానికి వార్షిక పుస్తక కొనుగోలు బడ్జెట్ కేటాయించాలి. ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక పుస్తక నిధిని ఏర్పాటు చేయాలి.

మారుతున్న గ్రంథాలయ ముఖచిత్రం

ప్రపంచం క్షణాల్లో సమాచారాన్ని పొందగలిగే డిజిటల్ యుగంలోకి ప్రవేశించింది. కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్, ఈ-లెర్నింగ్, ఓపెన్ యాక్సెస్ ప్రచురణలు, డిజిటల్ ఆర్కైవ్స్ జ్ఞాన సముపార్జనకు కొత్త మార్గాలను తెరిచాయి. అయితే ఈ మార్పులన్నీ భారతదేశంలోని ప్రతి గ్రామీణ, గిరిజన గ్రంథాలయానికి ఇంకా చేరలేదు. సర్వే ప్రకారం కేవలం 30 శాతం గ్రంథాలయాల్లో మాత్రమే కంప్యూటర్ సదుపాయం ఉంది. కంప్యూటర్లు ఉన్న గ్రంథాలయాల్లో కూడా సుమారు సగం మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రపంచంలోని ఆధునిక గ్రంథాలయాలు ఈ దిశగా ముందంజలో ఉన్నాయి. సింగపూర్‌లో డిజిటల్ పుస్తకాలు, ఆన్‌లైన్ డేటాబేస్‌లు, మొబైల్ అప్లికేషన్లు, డిజిటల్ అభ్యాస సేవలు సమగ్రంగా అందిస్తున్నారు. ఫిన్లాండ్‌లో గ్రంథాలయాల ఇంటర్నెట్ సేవల వినియోగం కోట్ల సంఖ్యలో నమోదవుతోంది. ఇది డిజిటల్ సాంకేతికత గ్రంథాలయాల పరిధిని ఎంతగా విస్తరించగలదో చూపిస్తోంది.

పాఠకుడి గౌరవమే అభివృద్ధికి కొలమానం

సర్వే ప్రకారం 96 శాతం గ్రంథాలయాలకు విద్యుత్ సదుపాయం ఉన్నప్పటికీ, తాగునీటి సౌకర్యం అన్ని ప్రాంతాల్లో సమానంగా లేదు. గ్రామీణ గ్రంథాలయాల్లో 62 శాతం, గిరిజన గ్రంథాలయాల్లో 51 శాతం మాత్రమే తాగునీటి సదుపాయాన్ని కలిగి ఉన్నాయి. సుమారు 35 శాతం గ్రంథాలయాల్లో మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదని నివేదిక పేర్కొంది.

గ్రంథపాలకులు

గ్రంథాలయంలో పుస్తకాలు ఉంటాయి. కంప్యూటర్లు ఉంటాయి. భవనాలు ఉంటాయి. డిజిటల్ వనరులు ఉంటాయి. కానీ వీటన్నింటినీ సమన్వయం చేసి పాఠకుడి అవసరానికి అనుగుణంగా జ్ఞానాన్ని చేరువ చేసేది గ్రంథపాలకుడు. ఒక పాఠకుడు ఏ పుస్తకం చదవాలి? ఏ సమాచార వనరును ఉపయోగించాలి? పరిశోధనకు అవసరమైన సమాచారం ఎక్కడ లభిస్తుంది? డిజిటల్ వనరులను ఎలా వినియోగించుకోవాలి? అనే ప్రశ్నలకు సమాధానాలు అందించే విజ్ఞాన మార్గదర్శి గ్రంథపాలకుడు. సుమారు 46 శాతం గ్రంథాలయాల్లో వృత్తిపరమైన అర్హత కలిగిన సిబ్బంది లేరు. దాదాపు 65 శాతం మంది సిబ్బంది గత ఐదేళ్లలో వృత్తిపరమైన శిక్షణ పొందలేదు. ఇది భారత గ్రంథాలయ వ్యవస్థ ఎదుర్కొంటున్న తీవ్రమైన మానవ వనరుల సమస్యను తెలియజేస్తోంది. గ్రంథాలయాలు ఆధునికీకరణ చెందుతున్నప్పుడు గ్రంథపాలకుల నైపుణ్యాలు కూడా ఆధునికీకరణ చెందాలి. అర్హత కలిగిన గ్రంథపాలకుల నియామకం, తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత, పదోన్నతులు, వృత్తిపరమైన శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి.

చెరగని మమకారం

సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా పుస్తక పఠనంపై, గ్రంథాలయాలపై ప్రజలకున్న మమకారం తగ్గలేదని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. సుమారు 60 శాతం మంది పాఠకులు తమ ప్రాంతంలో గ్రంథాలయం లేకపోతే పెద్ద లోటుగా భావిస్తామని వెల్లడించారు. 65 శాతానికి పైగా సభ్యులు గత రెండేళ్లలో గ్రంథాలయ సందర్శనలు, సమాచార వినియోగం పెరిగినట్లు తెలిపారు. ఈ అభిప్రాయాలు గ్రంథాలయాలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి. ప్రజలు గ్రంథాలయాలకు వచ్చేది కేవలం నవలలు, కథలు, పత్రికలు చదవడానికి మాత్రమే కాదు. ఉద్యోగ నోటిఫికేషన్లు తెలుసుకోవడానికి, పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి, ప్రభుత్వ పథకాల వివరాలు తెలుసుకోవడానికి, పరిశోధనలకు సమాచారం సేకరించడానికి, తమ పిల్లల్లో పఠన అలవాటు పెంపొందించడానికి కూడా వస్తున్నారు. అంటే గ్రంథాలయం ఒక వ్యక్తి జీవితంలోని అనేక అవసరాలకు సమాధానం అందించే సామాజిక సంస్థగా మారుతోంది.

చేరువ కావాల్సిన కొత్త పాఠకులు

ఒక గ్రంథాలయం ఎంతమంది పాఠకులను కలిగి ఉందనేది దాని విజయానికి ఒక కొలమానం. అయితే గ్రంథాలయాలకు రాని ప్రజలను ఎందుకు ఆకర్షించలేక పోతున్నాం? వారి అవసరాలు ఏమిటి? వారికి ఎలాంటి సేవలు అందించాలి? అనే ప్రశ్నలు కూడా అంతే ముఖ్యం. సర్వేలో పాల్గొన్న గ్రంథాలయాలకు వెళ్లని 2,035 మందిలో సుమారు 54 శాతం మంది ప్రజా గ్రంథాలయాలు తమకు ఉపయోగకరమని అంగీకరించారు. అయినప్పటికీ సమయం లేకపోవడం, అవసరమైన సదుపాయాలు లేకపోవడం, తమకు కావాల్సిన సమాచారం అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో గ్రంథాలయాలకు వెళ్లడం లేదని వెల్లడించారు. ప్రజలు గ్రంథాలయాలకు రావడం లేదని వారిని నిందించడం కంటే, గ్రంథాలయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే మార్గాలను అన్వేషించాలి. పాఠశాలలు, కళాశాలలు, గ్రామపంచాయతీలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పఠనోద్యమాలు నిర్వహించాలి. బస్‌స్టాండ్లు, ఆసుపత్రులు, పార్కులు, సామాజిక కేంద్రాల్లో చిన్న పఠన కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మొబైల్ గ్రంథాలయాల ద్వారా పుస్తకాలను గ్రామీణ ప్రాంతాలకు చేరవేయాలి. ప్రపంచంలోని అనేక దేశాల్లో మొబైల్ లైబ్రరీలు, ఇంటి వద్దకు పుస్తకాల పంపిణీ, స్వయంసేవ గ్రంథాలయాలు, డిజిటల్ లైబ్రరీ కార్డులు, ఆన్‌లైన్ సేవలు ప్రజలకు చేరువయ్యాయి. ఫిన్లాండ్‌లో 2024 నాటికి 118 మొబైల్ గ్రంథాలయాలు పనిచేయడం ఈ విధానానికి మంచి ఉదాహరణ.

భవిష్యత్తు తరాలకు పఠన సంస్కృతి

చిన్నతనం నుంచే పిల్లల్లో పఠన అలవాటు పెంపొందిస్తే వారు కేవలం పరీక్షల్లో మార్కులు సాధించే విద్యార్థులుగా కాకుండా, ప్రశ్నించే, ఆలోచించే, సృజనాత్మకంగా స్పందించే పౌరులుగా ఎదుగుతారు. మన సంకల్పం.. జ్ఞాన తెలంగాణ నుంచి జ్ఞాన భారతదేశం వరకు. ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలి. ప్రతి గ్రంథాలయంలో అర్హత కలిగిన గ్రంథపాలకుడు ఉండాలి. ప్రతి విద్యార్థి చేతిలో ఒక పుస్తకం ఉండాలి. ప్రతి యువకుడికి ఉద్యోగ సమాచారం అందాలి. ప్రతి మహిళకు జ్ఞానాన్ని పొందే స్వేచ్ఛ ఉండాలి. ప్రతి పౌరుడికి నాణ్యమైన సమాచార వనరులు అందుబాటులో ఉండాలి. ప్రతి గ్రంథాలయం ముద్రిత, డిజిటల్ విజ్ఞానాన్ని సమన్వయం చేసే కేంద్రంగా ఎదగాలి.



డా. రవికుమార్ చేగోని 98669 28327

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్