చాలామంది అనుకున్నట్టుగా ‘యాన్ ఈవినింగ్ ఇన్ పారిస్’ (1967) సినిమాలో షర్మిల ఠాగూర్ మాత్రమే బోల్డ్‌గా సిమ్ సూట్‌తో నటించిన మొదటి నటిగా అందరూ అనుకుంటారు. కానీ అంతకు 30 ఏండ్లకు మునుపే వెండితెరపై ఆశ్లీలతలేని జల క్రీడలను అభినయించిన తార మీనాక్షి శిరోడ్కర్. ఆ తర్వాత వచ్చిన నళిని జయవంత్, నర్గీస్, నూతన్, పర్వీన్ బాబి, జీనత్ అమన్‌లు మీనాక్షి శిరోడ్కర్ను అనుసరించారంటే ఆశ్చర్యం కలగవచ్చు.
1938లో మరాఠీ సినిమా ‘బ్రహ్మచారి’లో బ్లాక్ స్విమ్ సూట్‌తో మొదటిసారి భారతీయ సినిమా తెరపై ఒక ఉన్నత కులాలకు చెందిన మహిళ జలకలాడుతూ కనిపించడం అప్పట్లో భారతదేశమంతటా ఒక సంచలనం. మనం యూట్యూబ్‌లో చూస్తే 20 సెకండ్ల ఒక వీడియో రెండు భాగాలుగా రూపొంది కనిపిస్తుంది. ఒకవైపు పైన పేర్కొన్న మరాఠీ సినిమా నటి నలుపు తెలుపు వీడియో, మరోవైపు పదేండ్ల బాలిక రంగురంగుల స్విమ్ సూట్‌తో ఈస్ట్ మన్ కలర్లో ‘యమునా జల్ కేళుంసే ళ కన్హయ్యా కా లాడ్సా’ అన్న ఒకే పాటను అభినయిస్తూ కనిపిస్తారు. మొదట 1938 నాటి వీడియోలో కనిపించే హీరోయిన్ మీనాక్షి శిరోడ్కర్ కాగా, రెండవ వైపు ఉన్న రంగుల వీడియోలో కనిపించే బాలిక తెలుగులో అగ్ర హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు కుమార్తె సితార.
ఇంతకు ఆ తొలినాటి హీరోయిన్‌కి, మహేష్ బాబు కుమార్తె సితారకు ఏమిటి సంబంధం అని అనుమానం రావచ్చు. సితార తల్లి నమ్రత శిరోడ్కర్ నాయనమ్మే మీనాక్షి శిరోడ్కర్. అది మాత్రమే కాదు ఈ మీనాక్షి శిరోడ్కర్ పుట్టింది మన హైదరాబాదులో. ఈ విషయం చాలామందికి తెలియదు. మీనాక్షి శిరోడ్కర్ మరాఠీ హిందీ చలనచిత్ర రంగంలో టాకీల తొలిదశకం కాలంలో విశిష్ట నటిగా చరిత్రకెక్కింది. 1938లో వినాయక ఆత్రే నిర్మించి దర్శకత్వం వహించి నటించిన బ్రహ్మచారి సినిమా జాతీయ భావంతో వ్యంగ్య భావనతో తీయబడింది. ఈ చిత్రంలో నల్లని స్విమ్మింగ్ సూట్ వేసుకుని మీనాక్షి శిరోడ్కర్ చేసిన నృత్యం ఆ సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచి 25 వారాలు ఆడి సంచలనం సృష్టించింది. మీనాక్షి శిరోడ్కర్ స్విమ్‌సూట్ ధరించిన మొదటి భారతీయ నటిగా చరిత్ర సృష్టించింది. అప్పట్లో ఇది ప్రేక్షకులను ఆశ్చర్యపరచడమే కాకుండా, సంప్రదాయవాద సామాజిక నిబంధనలను సవాలు చేసింది. అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్న మీనాక్షి గొప్ప నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
మీనాక్షి శిరోద్కర్ అసలు పేరు రత్న పెండార్కర్. ఆమె 1916 అక్టోబర్ 11న హైదరాబాద్‌లోని మరాఠీ కొంకిని బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించింది. ఈనెల 11న ఆమె 110వ జయంతి నిశ్శబ్దంగా వెళ్లిపోయింది. నృత్యం, సంగీతం, గానాలపై ఆసక్తి ఉండటంతో బాల్యంలోనే భారతీయ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందింది. 1935లో ఆల్ ఇండియా రేడియో నాటకాలలో నటిస్తూ ఆమె తన కళా జీవితాన్ని ప్రారంభించింది. 1936లో ఆమె డాక్టర్ శిరోడ్కర్ను వివాహం చేసుకున్నది. తర్వాత ‘హన్స్ పిక్చర్స్’కు చెందిన పాండురంగ నాయక్ ఆమెకు నటించే అవకాశం కల్పించాడు. మొదట ఆమె తిరస్కరించినప్పటికీ, పాండురంగ నాయక్ ఆమె భర్తను ఒప్పించడంతో మీనాక్షి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈ నిర్ణయమే ఆమెను నాటి భారతదేశంలోని సినిమా అభిమానుల ప్రతి ఇంట్లోనూ తెలిసిన పేరుగా మార్చింది.
భారతదేశంలోకి టాకీలు వచ్చిన తొలిదశకంలోనే సినీ రంగ ప్రవేశం చేసిన మీనాక్షి శిరోడ్కర్ కళ్లు చాలా అర్థవంతంగా, ఆకర్షణీయంగా ఉండటంతో బ్రహ్మచారి సినిమా రచయిత ప్రహ్లాద్ కేశవ్ (పి. కె.)అత్రే ఆమెకు ‘మీనాక్షి శిరోడ్కర్’ అని పేరు పెట్టాడు. బ్రహ్మచారి సినిమాలోని మీనాక్షి పాడిన పాట ఎంతగా పాపులర్ అంటే ఇదే పేరుతో ప్రదర్శించిన నాటకంలోనూ, ఆ తర్వాత కాలంలో మరికొన్ని చిత్రాలలోనూ ఈ పాటను తిరిగి ఉపయోగించారు. ఆమె మాస్టర్ వినాయక్‌తో బ్రాందిచి బాట్లీ, ఘర్ కీ రాణి, అమృత్, మజే బాల్ వంటి అనేక ఇతర చిత్రాలలో నటించడం కొనసాగించింది. వీటితో పాటు ఆమె నటించిన దేవత (1939), లపాందవ్ (1940), జవానీ (1942), మజే బాల్, రామశాస్త్రి (1944), పన్నాదాయి (1945), సంగం (1945), అమానత్ (1945), చిముక్లా సన్సార్ (1945), సుభద్ర (1945) వంటివి ముఖ్యమైనవి.
మీనాక్షి 1940వ దశకం మధ్య నుండి 50వ దశకం ప్రారంభం వరకు ఏ సినిమాలోనూ నటించలేదు. ఆ తర్వాత ఆమె హర్ హర్ మహదేవ్, ఏక్ నజర్, తమిళం, తెలుగు ద్విభాషా, దర్ద్-ఏ-దిల్, ఆస్తిక్ వంటి చిత్రాలలో క్యారెక్టర్ యాక్టర్స్‌గా లేదా ఇతర చిన్న పాత్రల్లో నటించింది. హతీమ్ తాయ్, మిస్ మేరీ, రాజ్ తిలక్, గబాన్, మేరే హుజూర్, మూజ్రిమ్, పాకీజా, ఆగ్ ఔర్ తూఫాన్ ఆమె క్యారెక్టర్ పాత్రలు చేసిన సినిమాలు. 1950లో ప్రధాన పాత్రల నుండి రిటైర్ అయిన తర్వాత శిరోద్కర్ సినిమాలలో కొన్ని చిన్న పాత్రలు పోషించింది. 1960,1970లలో సాత్ సముందర్ పార్, సబ్ కా ఉస్తాద్, తీన్ సర్దార్ వంటి విభిన్న చిత్రాలలో నటించింది. తన ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్పై ఇన్ గోవా, ఉస్తాద్ 420 (1969)లో ఆమె నటనను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవి విభిన్న పాత్రల గతిశీలతను అన్వేషించడానికి వీలు కల్పించాయి. మీనాక్షి మరాఠీ, హిందీ చిత్రాలలోనే కాకుండా విజయవారు తెలుగు, తమిళంలో తీసిన పెళ్లి చేసి చూడు, కళ్యాణం పన్ని పార్ (1952) చిత్రాల్లో నటించడం విశేషం. ఇంకా ఆమె ‘నూతన్ సంగీత నాటక మండలి’తో మరాఠీ థియేటర్లో చేరి నాటక రంగ వికాసానికి కృషి చేసింది. 1950-75 కాలంలో మృచ్ఛకటిక్, మాన్ అప్మాన్, ఏక్ కప్ ప్యాలా వంటి పన్నెండు సంగీత నాటకాలలో ఆమె పోషించిన పాత్రలు నేటికీ గుర్తుండిపోతాయి.
మీనాక్షి శిరోడ్కర్ దంపతులకు ఒక కొడుకు నితిన్ శిరోడ్కర్. అతను గంగుబాయి అనే నటిని వివాహం చేసుకున్నాడు. ఆయన కుమార్తెలు నమ్రతా శిరోడ్కర్, శిల్పా శిరోడ్కర్లు. మనువరాళ్లు బాలీవుడ్ నటీమణులుగా రాణించడంతో చిత్ర పరిశ్రమపై నాలుగు తరాలుగా మీనాక్షి ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది. శిల్పా శిరోడ్కర్ తెలుగులో మోహన్ బాబు సరసన బ్రహ్మ (1992), హీరో నరేష్‌తో ఒక సినిమా, సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’ (2025) చిత్రంలో ‘శోభ’ అనే కీలకమైన పాత్రలో కనిపించింది. మొదటి సినిమా వచ్చిన 33 ఏండ్ల తర్వాత ఆమె ఈ సినిమాతో తెలుగులో రీ-ఎంట్రీ ఇచ్చింది. నమ్రత శిరోడ్కర్ తెలుగులో చిరంజీవి సరసన ‘అంజి’, మహేష్ బాబు సరసన ‘వంశీ’ చిత్రంలో నటించినది. ఆ సమయంలో వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమ పెండ్లికి దారితీసింది.
మీనాక్షి శిరోడ్కర్ మరాఠీ, హిందీ, తెలుగు, తమిళ చిత్రాలలోనూ, అలాగే మరాఠీ నాటకరంగంలోనూ, టెలివిజన్ రంగంలోనూ పనిచేసింది. 1997 జూన్ 3 న ఆమె కన్నుమూసింది. హైదరాబాదులో జన్మించిన మీనాక్షి శిరోడ్కర్ నటవారసత్వం మళ్లీ చివరికి ఆమె మనవరాలు నమ్రత శిరోడ్కర్ రూపంలో తిరిగి హైదరాబాద్‌తోనే ముడిపడి కొనసాగడం యాదృచ్ఛికమే అయినప్పటికీ ఒకరకంగా ఆసక్తికరమైనది కూడా.
మీనాక్షి శిరోడ్కర్ నటించిన సినిమాలు
1938 బ్రహ్మచారి (మరాఠీ / హిందీ)
1939 దేవత (మరాఠీ)
1939 బ్రాండిచి బాట్లీ / బ్రాందీ కి బోటల్
(మరాఠీ / హిందీ)
1940 లపాండవ్ (మరాఠీ)
1940 అర్ధాంగి / ఘర్ కి రాణి (మరాఠీ / హిందీ)
1941 అమృత్ / అమృత్ (మరాఠీ / హిందీ)
1941 జూలా (హిందీ)
1942 జవానీ (హిందీ)
1943 మజే బాల్ (మరాఠీ)
1943 సంగం (మరాఠీ)
1943 అమానత్ (హిందీ)
1943 చిముక్లా సన్సార్ (మరాఠీ)
1944 రామశాస్త్రి (మరాఠీ / హిందీ)
1945 బడి మా (హిందీ)
1945 పన్నాదాయి (మరాఠీ)
1952 పెళ్లి చేసి చూడు/కళ్యాణం పన్ని పార్ (తెలుగు/తమిళం)
1955 రాఫ్తార్ (హిందీ)
1957 మిస్ మేరీ (హిందీ)
1958 రాజ్ తిలక్ (హిందీ)
1966 గబన్ (హిందీ)
1968 మేరే హుజూర్
1970 మూజ్రిమ్ (హిందీ)
1972 పాకీజా (హిందీ)
మా నాయనమ్మ మీనాక్షి శిరోడ్కర్ టాకీల తొలితరంలోనే గొప్ప స్టార్‌గా వెలుగొందింది. ఆమె నటించిన సినిమాలన్నింటింటిలో చాలా ఫేమస్ బ్రహ్మచారి. ఈ చిత్రంలో ‘యమునా నది జలకేలు’ పాట ఆరోజుల్లో చాలా పాపులర్. ఆ పాట ఆమే స్వయంగా పాడింది. అయితే ఆమె ఈ స్విమ్మింగ్ పాటలో బికినీ ధరించలేదు. పూర్తిస్థాయి స్విమ్మింగ్ సూటు వేసుకోవడం గమనించదగిన విషయం. మేమంతా నేడు నటనా రంగంలో కొనసాగడం ఆమె వారసత్వ పరంపరే.
- శిల్పాశిరోడ్కర్
హెచ్.రమేష్‌బాబు, 93916 34727






కామెంట్లు (0)