కార్పోరేట్ శక్తులు రాజకీయ అండతో మీడియాను ఎలా శాసిస్తాయో దర్శకుడు ధ్రువ్ త్రిపాఠి REPORTING LIVE సినిమాలో చక్కగా చూపించాడు.
పరిణితీ చోప్రా- జర్నలిస్ట్ సంధ్యా యాదవ్‌గా, కెమెరామెన్ దేవెన్ భోజాని- వినోద్ శర్మగా చాలా బాగా నటించారు. ఇతర పాత్రల్లో నాజర్, అమోల్ పాలేకర్, ఆదిల్ హుస్సేన్, శేఖర్ సుమన్‌లు సీనియర్ నటులుగా వారి నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 9, 2026న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన హిందీ ఇన్విస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇది. తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లో అందుబాటులో ఉంది.
ఇక సినిమా కథలోకి వెళ్తే ముంబై సమీపంలోని విసర్గావ్ గ్రామంలో ఒక బ్రిడ్జి కూలిపోతుంది. ఈ ప్రమాదంలో పాఠశాల పిల్లలు, గర్భిణీ స్త్రీ సహా పలువురు ప్రాణాలు కోల్పోతారు. ‘ఆజాద్ భారతి’ అనే వార్తా సంస్థకు చెందిన ప్రతిష్టాత్మక రిపోర్టర్ సంధ్య (పరిణీతీ చోప్రా), కెమెరామేన్ వినోద్ (దేవెన్ భోజాని) ఈ ప్రమాదం వెనుక ఉన్న అసలు నిజాలను అతికష్టంగా అన్వేషించి రాబడతారు. ఈ పరిశోధనలో అక్రమ ఇసుక మాఫియా, రాజకీయ నాయకులు, బడా సిండికేట్ బంధాలు ఉన్నాయని గుర్తిస్తారు. ప్రాణాలకు తెగించి నిజాలను ప్రజల ముందుకు తీసుకురావడానికి జర్నలిస్టులు పడే కష్టాలు, మీడియా రంగానికి ఉండే ఒత్తిళ్లను ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఇసుక కోసం ఇంత దందా నడుస్తుందా..? అని జర్నలిస్ట్ సంధ్య సినిమా మొదట్లో విసర్గావ్ గ్రామంలోని ఓ పెద్ద మనిషిని అడిగితే ‘ఇసుక అంటే బంగారం తల్లీ’ అంటాడు. ‘అభివృద్ధి పేరుతో ఇప్పుడు ప్రతిగ్రామం విధ్వంసం అవుతోంది’ అన్న డైలాగ్ , ‘కలెక్టర్ నోరు విప్పడమ్మా వాడో దొంగ’ లాంటి డైలాగ్‌లు సినిమాలో చాలానే పేల్తాయి. జర్నలిజంపై ఇటీవల పెద్దగా సినిమాలు వచ్చింది లేదు. సమాచారం చేరవేతలో పక్షపాత దోరణి ఉండకూడదన్న ఓ నిఖార్సయిన జర్నలిస్ట్, వీడియో జర్నలిస్టుల కథ ఇది.
పి.వి.రావు, 9010153065







కామెంట్లు (0)