ఏ దేశ భవిష్యత్తయినా ఆ దేశ యువత భుజస్కంధాలపైనే ఆధారపడి ఉంటుంది. కానీ, నేడు మన దేశంలో అత్యధికంగా ఉన్న ఆ యువశక్తే తీవ్రమైన మానసిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పైకి ఎంతో ఆధునికంగా, సాంకేతికతతో పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తున్న నేటి యువతరం లోలోపల తీవ్రమైన ఒత్తిడి, నిరాశ, నిస్పృహలతో కుంగిపోతోంది. జాతీయ నేర గణాంకాల సంస్థ (NCRB) నివేదికల ప్రకారం దేశంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో అత్యధిక శాతం 18 నుండి 30 ఏళ్ల లోపు యువతవే కావడం సమాజాన్ని కలవరపెడుతోంది.
ఈ మానసిక ఒత్తిడి, ఆత్మహత్యల పరంపరను కేవలం వ్యక్తిగత వైఫల్యాలుగానో, భావోద్వేగ బలహీనతలుగానో చిత్రీకరించడం ద్వారా అసలు సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది. ఏ వ్యక్తీ అకారణంగా ప్రాణాలు తీసుకోవాలనుకోడు; చుట్టూ ఉన్న వ్యవస్థలు మనిషిని ఊపిరాడని స్థితికి నెట్టినప్పుడే ఇలాంటి విషాదాలు చోటుచేసుకుంటాయి. ఈ సంక్షోభం వెనుక ఉన్న సామాజిక, ఆర్థిక, విద్యా వ్యవస్థల లోపాలను లోతుగా పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయి.
ర్యాంకుల కర్మాగారాలుగా విద్యా వ్యవస్థ
నేటి కార్పొరేట్ విద్యా వ్యవస్థ విద్యార్థులను ఆలోచనాపరులుగా కాకుండా, మార్కులు తెచ్చిపెట్టే యంత్రాలుగా మార్చేసింది. ర్యాంకులు, ప్యాకేజీలే జీవిత పరమావధి అన్నట్లుగా తల్లిదండ్రులు, విద్యాసంస్థలు నూరిపోస్తున్నాయి. చిన్న వయసు నుంచే పోటీ ప్రపంచంలోకి నెట్టబడుతున్న విద్యార్థులు, ఏమాత్రం తడబడినా తమ జీవితమే ముగిసిపోయిందన్న భ్రమలోకి వెళ్లిపోతున్నారు. ఫలితంగా, చదువుల ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
నిరుద్యోగ వ్యథ
మన దేశంలో అమలవుతున్న నయా ఉదారవాద (Neo-liberal) ఆర్థిక విధానాలు యువత భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చాయి. ఒకవైపు ఉన్నత చదువులు చదివిన యువత సంఖ్య పెరుగుతుంటే, మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాల వల్ల స్థిరమైన ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయి. ఏండ్ల తరబడి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ, అప్పులు చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు నోటిఫికేషన్ల జాప్యం, పేపర్ లీకేజీలు శాపంగా మారుతున్నాయి. ఇక ప్రయివేట్ రంగంలో 'హైర్ అండ్ ఫైర్' (Hire and Fire) విధానం, 12-14 గంటల పని భారం, అరకొర జీతాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, పని గంటల ఒత్తిడి (Toxic Work Culture) యువతను తీవ్రమైన యాంగ్జయిటీ, డిప్రెషన్లోకి నెడుతున్నాయి. ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడం, కుటుంబ బాధ్యతలు మోయలేకపోతున్నామన్న వేదన యువతను మానసికంగా కుంగదీస్తోంది.
డిజిటల్ ఏకాంతం
సోషల్ మీడియా, స్మార్ట్ఫోన్ల విస్తృతి యువతను నిజమైన మనుషులకు దూరం చేసి, ఒక వర్చువల్ ప్రపంచంలో బంధించింది. నలుగురితో కలిసి బాధలు పంచుకునే సామాజిక వేదికలు కనుమరుగై, యువత ఒంటరితనానికి (Alienation) గురవుతోంది. మరోవైపు, పెట్టుబడిదారీ మార్కెట్ వ్యవస్థ సృష్టిస్తున్న కృత్రిమ అవసరాలు, విలాసవంతమైన జీవనశైలి పట్ల ఆకర్షణ యువతలో అసంతృప్తిని పెంచుతున్నాయి. ఆశించిన స్థాయిలో ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆత్మన్యూనతా భావానికి లోనవుతున్నారు.
మానసిక ఆరోగ్యంపై నిర్లక్ష్యం
శారీరక అనారోగ్యానికి ఇచ్చినంత ప్రాధాన్యత మన సమాజంలో మానసిక ఆరోగ్యానికి ఇవ్వడం లేదు. డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి సమస్యల గురించి బయటకు చెప్పుకుంటే ఎక్కడ 'పిచ్చివాళ్లు'గా ముద్ర వేస్తారోనన్న భయంతో యువత తమ బాధను తమలోనే దాచుకుంటోంది. ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యాసంస్థలలో కనీస స్థాయిలో కౌన్సెలర్లు అందుబాటులో లేకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చుతోంది.
పరిష్కారం ఎక్కడ?
యువత మానసిక ఆరోగ్యాన్ని కాపాడటమంటే, కేవలం కౌన్సెలింగ్ కేంద్రాలు తెరవడం మాత్రమే కాదు; వారిని ఒత్తిడిలోకి నెడుతున్న వ్యవస్థాగత కారణాలను సరిదిద్దాలి. విద్యను వ్యాపారంగా కాకుండా, మానవీయ విలువలు నేర్పే సామాజిక బాధ్యతగా ప్రభుత్వం స్వీకరించాలి. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూ, యువతకు ఉపాధి భద్రత కల్పించాలి. విద్యాసంస్థలు, పని ప్రదేశాల్లో మానసిక ఆరోగ్య నిపుణులను తప్పనిసరి చేయాలి.
అన్నింటికీ మించి, పోటీ ప్రపంచపు వేగంలో అలిసిపోతున్న యువతకు 'ఓటమి జీవితాంతం కాదు' అనే భరోసాను కుటుంబం, సమాజం అందించాలి. ఉక్కు కవచంలా దేశాన్ని కాపాడాల్సిన యువతరం ఇలా నిర్వీర్యమైపోకుండా కాపాడుకోవడం నేడు మన ముందున్న అత్యంత కీలకమైన సామాజిక బాధ్యత.
అనంతోజు మోహన్‌కృష్ణ, 88977 65417







కామెంట్లు (0)