Magazines

అందర్నీ ‘వెంటాడే ప్రశ్న’

5 రోజుల క్రితం

‘The question that haunts everyone’
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 2 నిమిషాల చదవడం

పురుషాధిక్యత ఏదో ఒక మోతాదులో విశ్వమంతటా వ్యాపించిన ఓ కఠోర వాస్తవం. ఆ వివక్ష - అణచివేత ఇంటా బయటా నెత్తికెక్కి తొక్కుతున్నప్పుడు ఆ ఆక్రోశంలో... ఆ ఆవేశంలో ఎన్నో... ఎన్నెన్నో ప్రశ్నలు ఉద్భవిస్తాయి. కొన్నింటికి సమాధానాలు దొరుకుతాయి. కొన్నింటికి దొరకవు. మరికొన్ని ఎప్పటికీ శేషప్రశ్నలుగానే మిగులుతాయి. అలా కవ (రచ) యిత్రి అమరవాది నీరజ కలం నుండి కన్నీటి చెమ్మతో తన్నుకొచ్చిన 51 కవితా ఖండికలు ‘వెంటాడే ప్రశ్న’ సంపుటిగా ఆవిష్కృతమైంది. ఇవి దశాబ్దిన్నర కాల (2011 - 16) అక్షర సంఘర్షణ. ఆ కన్నీటి వెచ్చని స్పర్శ పాఠకుల హృదయాలనూ తాకుతుంది. భావం తాత్కాలికమైనా అక్షర రూపం ద్వారా శాశ్వతత్వం కలుగుతుందనే విశ్వాసం ఆమెది. అలాగే అక్షరం పట్ల స్పష్టత బాధ్యతను నిస్సంకోచంగా ప్రకటిస్తారు.

పురుషాధిక్య సమాజంలో ఆడకణం ‘ఎప్పటికీ ముద్దాయే’. వివాహ సంబంధాల ‘ముడి’లో రక్త సంబంధాల ప్రేమ ముడి ఉండదా..? వివక్ష ఎప్పటికీ నీడలా ‘వెంటాడుతున్న ప్రశ్న’. ‘ఓ తల్లి జీవన ప్రస్థానం’లో జనన మరణాల ముగింపు వుండదు. నిత్య భారత కీచక పర్వంలో నడిచేందుకు ‘మీమాటే వింటా’. ఓవైపు పూజిస్తూ మరో వైపు లైంగిక దాడులకు గురౌతున్న ‘నేనొక ఉత్సవ విగ్రహం’. పచ్చిగా చెప్పాలంటే... వీరుల ధీరుల గర్భభూమిని రక్షించుకునే ‘స్వచ్ఛభారత్‌’ను. లింగ నిర్థారణ పరీక్షలతో ఆడకణాన్ని పెకిలిస్తూ పోతే ఎప్పటికీ ‘ఎదగని మొక్క’గానే మనదేశం. కరువు కాటకాలు ఎన్ని ఎదురైనా తొలకరి జల్లులకై ‘అన్వేషణ’ సాగటం ప్రకృతి లక్షణం. ఫస్ట్‌ ‌టీచర్‌ అమ్మ అయితే బెస్ట్‌ ‌టీచర్‌ ‌నాకు నేనుగా తీర్చిదిద్దుకునే ‘నా ఉనికి’. ‘యుగాలెన్ని మారినా’ ఎగిసిపడే తరంగాలను ఎందుకు ఆపుతారో..? గతి తప్పిన కాలంలో మతి తప్పిన మానవాళితో రుతువులు తారుమారైనాయి - అత్యాధునిక ‘కాలచక్రం’. మేరీ అక్క గోపాల్‌ అన్న, రహీం భయ్యా కలిస్తేనే అసలైన ఇరానీ చాయ్‌, సిసలైన హైద్రాబాద్‌ ‌‘చిరునామా’. కరోనా కాలంలో బడుల మూత. బాలలకు బాల్యం లేదు. స్కూలు నల్ల బల్లపై ‘స్పర్శలేని గీత’ శిలను మనిషిగా మార్చిన రామజన్మభూమిలో మనిషిని శిలగా మార్చగల రామ భక్తులెందరో..? కాదా ఇది ‘ఉలి చెక్కని శిల్పం’. ప్రపంచ శాంతి కోసం అహింసా జపంతో యుద్ధ తాండవం చేయాలి. అదే ‘నేటి కొత్త పథం’. ఇలా సాగిపోతాయి కవితా పంక్తులు, శీర్షికలు. అందుకే మళ్లీ మళ్లీ అక్షరంగా పురుడు పోసుకుంటూ అమ్మ ప్రేమ కోసం పసిబిడ్డ నవ్వుతో ‘ఓనమాలు’గా నర్తిస్తా అంటారామె.

శైలి

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్