Thursday, June 4, 2026
E-PAPER
Homeజాతీయంకేరళంలోకి నైరుతి రుతుపవనాలు

కేరళంలోకి నైరుతి రుతుపవనాలు

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్: కేరళంలోకి నైరుతి రుతుపవనాలు గురువారం ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాస్తవానికి మే 26న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తొలుత అంచనా వేసింది. అయితే, ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాల రాక కొంత ఆలస్యమైంది. మరో వారం రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి.

అదే విధంగా తమిళనాడులోని పలు జిల్లాల్లో కూడా రానున్న గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 29.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. దీంతో వర్షం, ఉరుములతో కూడిన తుఫానుకు సంబంధించి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

కేరళలోని 15జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిస్సూర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో 24 గంటల్లో 115.6 మి.మీ. నుంచి 204.4 మి.మీ. వరకు అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసరగోడ్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అమల్లో ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవడంతో పాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. జూన్ 7 వరకు కేరళ, మాహే ప్రాంతాల్లో విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దక్షిణ కేరళ తీరానికి సమీపంలోని అరేబియా సముద్రంలో, అలాగే ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థల ప్రభావంతో వర్షాలు మరింత ఉధృతమయ్యే అవకాశముంది.

ఇదే సమయంలో కేరళ–కర్ణాటక–లక్షద్వీప్ తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆదివారం వరకు చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది. మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు ప్రాణనష్టం, విద్యుత్ మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలకు నష్టం కలిగించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -