క్రీడలు రాజకీయాలకు అతీతమైనవి

– బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
– కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ కృషి అభినందనీయం
– క్రీడాకారుల కుటుంబం మాది
– రాష్ట్ర స్థాయి షటిల్ టోర్నీని ప్రారంభించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
క్రీడలు రాజకీయాలకు అతీతమైనవని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్లబ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి షటిల్ టోర్నమెంట్ ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి  మాట్లాడుతూ.. యువత సోషల్ మీడియాలో వీడియో గేమ్స్ మోజులో కొట్టుకుపోతున్న ఈ రోజుల్లో రియల్ గేమ్స్ లో టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమన్నారు. కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్  సభ్యులు రాష్ట్రస్థాయి షటిల్ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. సొంత డబ్బులతో కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఇండోర్ స్టేడియం నిర్మించుకోవడం అద్భుత కృషి అని కొనియాడారు. తమది కూడా క్రీడాకారుల కుటుంబం అన్నారు. తన తండ్రి, దివంగత రైతు నేత వేముల సురేందర్ రెడ్డి ఐదు  పర్యాయాలు జాతీయ స్థాయి వాలీబాల్ లో ఆడిన క్రీడాకారుడన్నారు. తాను జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారుడినని, తన తమ్ముడు అజయ్ రెడ్డి యూనివర్సిటీ క్రికెట్ క్రీడాకారుడిగా, చెల్లెలు రాధికా రెడ్డి రాష్ట్ర స్థాయి కోకో క్రీడాకారిణిగా రాణించారని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి జిల్లా క్రికెట్ జట్టు అధికారిక కెప్టెన్ గా ఆడారని, ఒక మ్యాచ్ లో తాను తన తండ్రితో కలిసి మరో ఎండ్ లో బ్యాటింగ్ చేసిన సందర్భాన్ని మర్చిపోలేనన్నారు. 80, 90 దశకాల్లో కమ్మర్ పల్లితో పాటు పలు గ్రామాలు క్రీడల్లో వెలుగుందాయని గుర్తు చేస్తూ కమ్మర్ పల్లి  స్పోర్ట్స్ లవింగ్ విలేజ్ అని అభినందించారు. ఈ టోర్నీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.ఈ  కార్యక్రమంలో ఎంపీపీ లోలపు గౌతమీ సుమన్, తహసీల్దారు ఆంజనేయులు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, సర్పంచ్ గడ్డం స్వామి, ఎంపీటీసీ మైలారం సుధాకర్, కమ్మర్ పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్  గౌరవ అధ్యక్షుడు ఎండి. అహ్మద్ హుస్సేన్, సలహాదారు లుక్క గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love