– గరిటె తిప్పే చేతులు సాధించిన విజయం
– 15 దేశాలకు ఎగుమతి
నవతెలంగాణ – మల్హర్ రావు; ఒక మహిళ మదిలో మెదిలిన ఆలోచన ఎంతో మంది మహిళలకు జీవితాన్ని ఇచ్చింది. సంకల్ప బలం ముందు ఏదీ గొప్పది కాదని నిరూపించింది. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది. నలుగురితో కలిసి పనిచేస్తే కనీసం ఆ పని విలువైన తెలుస్తుంది అని భావించిన నలుగురు మహిళలు ఇప్పుడు మహిళా లోకానికే ఆదర్శం అయ్యారు. గరిట తిప్పగల చేతులతోనే ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ముందుకు దూసుకుపోతున్నారు.
నలుగురితో మొదలైన ప్రయాణం..
నలుగురుతో మొదలైన ప్రయాణం వందకు పైగా మహిళలకు భరోసా హనుమకొండలో నలుగురు మహిళలతో ప్రారంభమైన శ్రీనిధి తెలంగాణ పిండివంటలు ఇప్పుడు వంద మందికి పైగా మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతుంది. ఒక మంచి ఫుడ్ ఇండస్ట్రీ గా తయారైంది. ఈ పిండివంటల ఇండస్ట్రీ ఈ ప్రాంత మహిళలకు ఉపాధి కల్పించి ఆర్థికంగా అండదండలను అందిస్తుంది. నేర్చుకోవాలన్న పట్టుదల ఉంటే మహిళలు నేర్చుకోలేని ఏ విద్య లేదు. సాధించాలన్న తపన ఉంటే మహిళలు సాధించలేనిది ఏదీ లేదు.
సంప్రదాయ పిండి వంటలు..
సాంప్రదాయ పిండివంటలు రుచి చూపించాలనే ఉద్దేశం కేవలం వంటింటికే పరిమితమైన మహిళలు తమకు తెలిసిన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని నమ్ముకొని మొదలుపెట్టిన ప్రస్థానం అప్రతిహతంగా ముందుకు సాగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లారం గ్రామానికి చెందిన ధన్నపునేని రాజేశ్వరరావు, రాధ దంపతులకు నలుగురు పిల్లలు. వీరంతా సాంప్రదాయ పిండివంటలను రుచి చూస్తూ పెరిగినవారు. నేటి తరానికి కూడా సాంప్రదాయ పిండివంటలను రుచి చూపించాలన్న ఉద్దేశంతో రమా ,ఉమా, ఉష ముగ్గురు అక్కాచెల్లెళ్లు , మరదలు అర్చన దీనిని ప్రారంభించారు.
15 దేశాలకు పిండివంటలు ఎగుమతి
2016 మే రెండవ తేదీన ప్రారంభించిన ఈ శ్రీనిధి తెలంగాణ పిండివంటలు ప్రస్తుతం 100 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తుంది. ఇక్కడి నుంచి దాదాపు 15 దేశాలకు పిండివంటలు ఎగుమతి అవుతున్నాయి. ఇక మన దేశంలో కూడా యూపీ, ఢిల్లీ, చెన్నై వంటి అనేక చోట్లకు పిండివంటలను ఎగుమతి చేస్తున్నారు. ఇక పిండివంటలలో ఎన్ని వెరైటీలు ఉంటాయో అన్ని వెరైటీల పిండి వంటలను చేసి ప్రజలకు రుచి చూపిస్తున్నారు.మహిళలకు అండగా పిండివంటల ఇండస్ట్రీ
ఇంతమంది మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తూ పని ఇవ్వగలుగుతున్నందుకు సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. ఇక శ్రీనిధి తెలంగాణ పిండివంటలలో పనిచేస్తున్న మహిళలు సైతం అంతకుముందు తాము ఆర్థిక ఇబ్బందులతో బాధపడ్డామని ఇక్కడ పనిచేస్తున్న క్రమంలో ఆ ఇబ్బందులు తొలగిపోయి సంతోషంగా ఉన్నామని చెబుతున్నారు.
పిండివంటలు మాత్రమే కాదు పచ్చళ్ళు, కారప్పొడి, నాన్ వెజ్ పచ్చళ్ళు ఇలా ప్రజల డిమాండ్ మేరకు తయారు చేసి విక్రయిస్తున్నారు.