నిలిచిపోయిన నిర్మాణాలు..

– పెద్ద మజిద్ నిర్మాణం నిలిపివేత
– కోర్టు జోక్యంతో షాదిఖాన కు బ్రేక్
– శిలాఫలకానికి పరిమితమైన మైనార్టీ కమ్యూనిటీ హల్ నిర్మాణం
– నిద్రావస్థలో వక్ఫ్ బోర్డు
– పట్టించుకోని అధికారులు
– ప్రజా దర్బార్ దృష్టికి తీసుకెళ్ళుతాము..ముస్లిం సంఘాలు
– కొత్తగా వచ్చాను..ఆర్.అండ్.బి ఈఈ ప్రభాకర్
– నిధుల కోసం చూస్తున్నాం…ఆర్.అండ్.బి డి.ఈ పద్మావతీ
– నిలిపివేయడం జరిగింది.. పంచాయతీ రాజ్ డీఈ మనోహర్
నవతెలంగాణ – సూర్యాపేట
జిల్లా కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా నిర్మిస్తున్న ముస్లిం మైనారిటీలకు చెందిన వివిధ అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. వీటి గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యారు.ఇందులో ప్రధానంగా కోటి రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న పెద్ద మజీద్,రెండు కోట్ల తో నిర్మించ తలపెట్టిన షాది ఖాన,40 లక్షలతో నిర్మించనున్న మైనార్టీ కమ్యూనిటీ హల్ నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయి నెలలు గడుస్తున్నాయి. బి.ఆర్.యస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వీటి నిర్మణాలకు స్వీకారం చుట్టిన విషయం తెల్సిందే. కాగా నెలల తరబడి ఈ నిర్మాణాలు ఆగిపోయినప్పటికి వీటి గురించి సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడం గమన్హారం. వీటిలో ప్రధానంగా పట్టణంలోని గ్రంధాలయం సమీపంలో 450 సంవత్సరాల క్రితం నిర్మించిన పెద్ద మజీద్ పునరేకీకరణ కోసం అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి 50 లక్షలు మంజూరు చేయించారు. ఇందుకు గాను ఆర్భాటంగా 2018 సంవత్సరంలో పనులు ప్రాంభించారు.మొదటి విడతలో 50 లక్షలు మంజూరు కావడంతో మజీద్ పనులు మొదలు పెట్టారు.ఇక సాగదితగా అడపాదడపాగా పనులు సాగాయి.చేసిన పనులకు బిల్లు కూడా మంజూరు అయింది. కానీ నిర్మాణం మాత్రం పిల్లర్ల వద్దకే వచ్చి ఆగింది.నిధులు సరిపోలేదని చెప్పడంతో మరోమారు 2022 లో 50 లక్షలు నిర్మణానికి మంజూరు అయ్యాయి. ఇదిగో…అదిగో అంటూ మళ్ళీ పెద్ద మజీద్ నిర్మాణ పనులు ప్రాంభించారు. సంవత్సరం కు పైగా నిధులు మంజూరు అయినప్పటికీ నిర్మాణ పనుల్లో మాత్రం జాప్యం చేస్తూ వచ్చారు.తర్వాత ఏమైందో ఏమో కానీ మజీద్ నిర్మాణ పనులను మధ్యలోనే వదిలేశారు.దీంతో గత కొన్ని నెలలుగా మజీద్ నిర్మాణం నిలిచింది. ఈ రకంగా గత ఆరు సంవత్సరాల నుండి మజీద్ నిర్మాణం కొనసాగడం గమన్హారo.దీని కంటే తర్వాత మంజూరు అయిన వివిధ అభివృద్ధి పనులు పూర్తి అయి ప్రారంభోత్సవాలు కూడా జరిగాయి. మరి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా పండుగల సందర్భంగా మజీద్ ను సందర్షించారు.అయినా కూడా పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందనంగా పెద్ద మజీద్ పరిస్థితి నెలకొంది. దీంతో ముస్లింలు నమాజ్ సమయంలో నానా ఇబ్బందులు పడుతున్నారు.వక్ఫ్ బోర్డ్ పరిధిలో ఉన్న పెద్ద మజీద్ ఆలాన-పాలన గురించి ఇంతవరకు ఆ శాఖ అధికారులు పట్టించుకోకుండా నిద్రావస్థలో వున్నారు. ఇక ఇదిలావుండగా పట్టణ నడిబొడ్డున పాత ఈద్గా లో బలిష్టంగా బహుబలి తరహాలో నిర్మించిన షాది ఖాన ను కూల్చి ఆ స్థానంలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో కొత్త షాది ఖాన నిర్మాణం కోసం జగదీష్ రెడ్డి శిలాఫలకం వేశారు.
ఈ క్రమంలో పనులు ప్రారంభమై అందులో పిల్లర్లు కూడా వేశారు.ఇది కొనసాగుతున్న క్రమంలోనే ఈ స్థలం మాది అంటూ స్థల వారసులు హైకోర్టు కు వెళ్లి స్టే తెచ్చిన విషయం తెల్సిందే. దీంతో షాది ఖాన నిర్మణానికి బ్రేక్ పడ్డది. కాగా ఈ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించకుండా ఆర్.అండ్.బి అధికారులు ఎలా పనులు ప్రాంభించారో అర్ధం కాని ప్రశ్న గా మిగిలింది.ఇదిగాక ఈ స్థలంలో సమాధులు కూడా ఉన్నాయి.మరి జగదీష్ రెడ్డి తో పాటు ఏ ఒక్కరూ కూడా వీటిని ఎందుకు పరిగణనలోకి తీసుకొలేదో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఈ సమస్య కోర్టు పరిధిలో ఉంది. ఇక పోతే పట్టణంలోని చిన్న మజీద్ వద్ద గత సెప్టెంబర్ నెలలో ముస్లింల కోసం 40 లక్షల రూపాయలతో  మైనార్టీ కమ్యూనిటీ హల్ నిర్మాణం కోసం  జగదీష్ రెడ్డి ఫౌండేషన్ వేశారు. నిధులు విడుదల అయ్యాయా….లేదా తెలియదు కానీ పనులు మాత్రం షురూ కాలేదు.ఇది కేవలం శిలాఫలకానికె పరిమితం అయింది.ఈ రకంగా పట్టణంలో ముస్లిం మైనారిటీలకు చెందిన వివిధ అభివృద్ధి పనులు నిలిచి పోయాయి. ప్రతిసారి ఎన్నికల సమయంలో మాత్రం వీటిని ప్రచార అస్త్రాలు గా బి.ఆర్.యస్ పార్టీ వాడుకుందే తప్ప నిర్మాణ పనుల్లో మాత్రం శ్రద్ధ పెట్టలేదని ముస్లిం సంఘాలు విమర్శిస్తున్నాయి. నిలిచి పోయిన నిర్మణాల గురించి మాజీమంత్రి దామోదర్ రెడ్డి ని కలిసి ప్రజాదర్బార్ లో ఫిర్యాదు చేయడానికి కొందరూ ముస్లింలు సమాయత్తం అవుతున్నారు.వీటిపై సంబందిత అధికారుల వివరణలు ఈ విధంగా ఉన్నాయి.
కొత్తగా వచ్చాను..ఆర్.అండ్.బి ఈఈ ప్రభాకర్: పెద్ద మజీద్,షాది ఖాన ల నిర్మణాల నిలిపివేత పై ఆయన మాట్లాడుతూ తాను కొత్తగా వచ్చాను.వాటి వివరాలు తెలియదు.డీఈ లేదా జేఈ ని అడగగలరు.
నిధుల కోసం చూస్తున్నాం….ఆర్.అండ్.బి డి.ఈ పద్మావతీ: పెద్ద మజీద్ నిర్మాణ పనుల ప్రారంభానికి నిధుల గురించి చూస్తున్నాం.త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. షాది ఖాన నిర్మాణం కోర్టు స్టే తో పనులు నిలిచిపోయాయి.
నిపిలి వేయడం జరిగింది… పంచాయతీ రాజ్ డీఈ మనోహర్: చిన్న మజీద్ వద్ద నిర్మించనున్న మైనార్టీ కమ్యూనిటి హల్ నిర్మాణం ప్రభుత్వ ఆదేశాలతో నిలిపి వేయడం జరిగింది.
Spread the love