బహుముఖ పోరాటాలకు రైతులు సిద్ధం కావాలి
మతోన్మాదాన్ని, సామ్రాజ్యవాదాన్ని ఎదిరించాలి
అందుకు నల్లగొండ నుంచే నాంది పలకాలి : ఏఐకేఎస్ ప్రతినిధుల సభ ప్రారంభోపన్యాసంలో అశోక్ ధావలే పిలుపు
సారంపల్లి మల్లారెడ్డి నగర్ (నల్లగొండ) నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
ప్రపంచంలో, దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో రైతులు బహుముఖ పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకెఎస్) జాతీయ అధ్యక్షులు అశోక్ ధావలే పిలుపునిచ్చారు. సంఘం తన స్వతంత్ర బలాన్ని పెంచుకుని, మరింతగా విస్తరించేందుకు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఏఐకేఎస్ 36వ మహాసభ ఆదివారం నల్లగొండలో అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ‘ఏఐకేఎస్ వర్థిల్లాలి, రైతాంగ పోరాటాలు వర్థిల్లాలి’ వంటి నినాదాల హోరుతో ప్రతినిధుల సభ ఉత్తేజభరితంగా ప్రారంభమైంది. సంఘం పతాకాన్ని అశోక్ ధావలే ఆవిష్కరించి మహాసభను ప్రారంభించారు. ఏఐకేఎస్ జాతీయ నాయకత్వం, ప్రతినిధులు, సానుభూతి పరులు అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన ప్రారంభ సభకు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ అధ్యక్షత వహించారు.
మహాసభ జరుగుతున్న జిఎం గౌడ్ కన్వెన్షన్ సెంటర్ ప్రాంగణానికి ఇటీవల మరణించిన రైతు నాయకులు సారంపల్లి మల్లారెడ్డి నగర్‌గా, మహాసభ జరుగుతున్న హాల్‌కు కేరళం మాజీ సీఎం విఎస్ అచ్యుతానందన్ హాల్‌గా, వేదికకు సీనియర్ రైతు నాయకులు శంకరయ్య వేదికగా నామకరణం చేశారు. ధావలే ప్రారంభోపన్యాసం చేస్తూ...రాబోయే రోజుల్లో సైద్ధాంతిక, రాజకీయ, సాంస్కృతిక, రంగాల్లో నిరంతర, వినూత్నమైన, శక్తివంతమైన పోరాటాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. పోరాటాల పురిటిగడ్డ నల్లగొండలో జరుగుతున్న ఏఐకేఎస్ మహాసభ ఈ కార్యాచరణకు పూనుకోవాలని సూచించారు. రైతాంగ సమస్యలపై సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తున్న ఏఐకేఎస్ కు సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. కోటీ 58 లక్షల సభ్యత్వం కలిగి 27 రాష్ట్రాల్లోని 459 జిల్లాలకు విస్తరించిన ఏఐకేఎస్ దేశంలోనే అతిపెద్ద రైతు సంఘమని గుర్తు చేశారు. రాజకీయ రంగంలో, మన దేశానికి, మన ప్రజలకు ప్రధాన శత్రువైన ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ కూటమిని ఓడించడానికి, దానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులను ఏకం చేయడానికి గల అన్ని ప్రయత్నాలనూ కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు.
వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ ప్రతిఘాత విధానాలను ఓడించడానికి కార్మికవర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులకు చెందిన అన్ని సంఘాలనూ భారీ పోరాటాలలో ఏకం చేయాలని కోరారు. ఈ కర్తవ్యాన్ని సాధించడం ద్వారా మాత్రమే జాతీయ సార్వభౌమత్వం, జాతీయ ఐక్యత, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్యవాదం, ప్రజల సామాజిక-ఆర్థిక హక్కులు, జీవనోపాధిని కాపాడగలమని నొక్కి చెప్పారు. వామపక్షాల, ప్రత్యేకించి ఏఐకేఎస్ స్వతంత్ర బలాన్ని పెంచడానికి ఉన్న ఎలాంటి అవకాశాన్నీ వదిలిపెట్టకూడదని సూచించారు. ఈ కార్యాన్ని సాధించడం ద్వారా మాత్రమే నిజమైన సమూల సామాజిక-ఆర్థిక, రాజకీయ పరివర్తన సాధ్యమవుతుందని చెప్పారు. ఆందోళన, ప్రచారం, సంస్థాగత నిర్మాణాలను ఏకీకృతం చేసి, సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
బీజేపీతో తీవ్ర ప్రమాదం
బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో కొనసాగితే, అది పేదలు, శ్రామిక ప్రజలు, అన్ని వర్గాల వారిపై మరింత తీవ్రమైన దాడులకు దారి తీస్తుందని ధావలే ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల దేశీయ విదేశీ కార్పొరేట్ మిత్ర సంస్థలు మరింతగా లాభపడతాయని చెప్పారు. సామ్రాజ్యవాద శక్తుల ముందు మరింత బానిసత్వంతో కూడిన లొంగుబాటు చోటుచేసుకుంటుందని, ఆర్‌ఎస్‌ఎస్ ఒక ఫాసిస్ట్ సంస్థ, దానికి హిట్లర్, ముస్సోలినీలు నిజమైన ఆదర్శాలని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సార్వభౌమాధికారం, సమాఖ్య వ్యవస్థ, సామాజిక-ఆర్థిక న్యాయం, భారత రాజ్యాంగం మొత్తానికే ముగింపు పలుకుతుందని హెచ్చరించారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, సంఘ్ పరివార్‌లను ఎలాగైనా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం, వారికి వ్యతిరేకమైన లౌకిక శక్తులన్నింటినీ ఏకం చేయాలి, వామపక్ష శక్తులను బలోపేతం చేయాలని అశోక్ ధావలే దిశా నిర్దేశం చేశారు.
సంతాప తీర్మానం
గత మహాసభ నుంచి ఇప్పటి వరకు మరణించిన ఏఐకేఎస్ నాయకులకు, పలు రంగాల్లోని ప్రముఖులకు మహాసభ సంతాపం ప్రకటించింది. సంతాప తీర్మానాన్ని ఏఐకేఎస్ నాయకులు డి రవీంద్రన్ ప్రవేశపెట్టగా మహాసభ ఆమోదించింది. మహాసభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీం, సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు రాకేష్ టికాయత్, ఏఐకేఎస్ (అజయ్ భవన్) ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, ఏఐకేఎంఎస్ నేత పురుషోత్తమ శర్మ, ఎఐకెకెఎంఎస్ ప్రధాన కార్యదర్శి శంకర్ ఘోష్, ఐద్వా జాతీయ అధ్యక్షులు శ్రీమతి టీచర్ సౌహార్ద సందేశాలను ఇచ్చారు.







కామెంట్‌లు (0)