Magazines

కాకి లెక్కలు!

1 గంట క్రితం

Crow
avatar
balaji

ప్రచురించబడింది నవం 26, 2026 | 6 నిమిషాల చదవడం

శిక్షణ పేరుతో నిరుద్యోగులకు టోకరా

అక్కరకురాని కేంద్ర పథకాలు
రాష్ట్రాలకు భారీగా ‘నైపుణ్య’ బకాయిలు
పార్లమెంటరీ కమిటీ తప్పుపట్టినా తీరుమారని మోడీ సర్కార్


మోడీ సర్కార్ నైపుణ్య శిక్షణ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నది. లక్షలమందికి శిక్షణ ఇచ్చినట్టు కాగితాల్లో చూపిస్తుంది. కానీ వాస్తవాలు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. నైపుణ్య శిక్షణ ఇచ్చేది స్వయంగా బ్యాంకర్లే. కానీ కేంద్రం వారికి రీయింబర్స్‌మెంట్ బకాయిల్ని పెద్దసంఖ్యలో పేర్చేయడంతో బ్యాంకర్లు మొఖం చాటేస్తున్నారు. ఈ విషయాలను స్వయంగా పార్లమెంటరీ కమిటీ తప్పు పట్టినా, మోడీ సర్కార్ తీరులో మార్పు రాలేదు. దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా రాష్ట్రాల రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశాల్లో (ఎసఎల్‌బీసీ) నైపుణ్య శిక్షణ బకాయిలు చెల్లించాలని కేంద్రాన్ని కోరుతూ ఎజెండాల్లో చేరుస్తున్నారంటే ‘పథకాల’ అమలు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.


ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్ర్తి

గ్రామీణ నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి, సొంతంగా ఉపాధి పొందేలా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థల కార్యక్రమం ఆశించిన ఫలితాలను అందించట్లేదు. శిక్షణ పూర్తిచేసుకున్న యువతకు బ్యాంకులు రుణాలిచ్చి వ్యాపారాలు ప్రారంభించేలా సహకరించడంలో వెనకడుగు వేస్తున్నాయి. ఇచ్చిన అరకొర రుణాల ద్వారా వ్యాపారాలు చేస్తున్న కుటుంబాలకు ఇప్పుడా రుణాలే గుదిబండలుగా మారుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నది. కానీ కేంద్రం ప్రకటిస్తున్న విజయ గణాంకాలకు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులకు మధ్య భారీ అంతరం కనిపిస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా పార్లమెంటరీ కమిటీ ప్రస్తావించింది. దానికితోడు అనేక అధికారిక నివేదికలు, స్వతంత్ర అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీరందరి ఉమ్మడి పరిశీలన ఒక్కటే కావడం గమనార్హం. “శిక్షణకు లక్షలాది మంది వస్తున్నా, అందరికీ బ్యాంకు రుణాలు అందడం లేదు. వ్యాపారాలు ప్రారంభించిన వారిలోనూ చాలామందికి ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదు. స్థానిక అవసరాలకు సరిపోయే శిక్షణా కోర్సులు లేవు. ప్రధానంగా మహిళలకు అనేక ఇబ్బందులు ఎదురవు తున్నాయి”. ఇవి పార్లమెంటరీ స్థాయి సంఘం సహా అన్ని అధ్యయనాలు గుర్తించిన అంశాలు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు భాగస్వాములుగా నిర్వహిస్తున్న ఈ నైపుణ్య శిక్షణ నిరుద్యోగ యువత ఆశలు పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోతున్నాయి అనడానికి ఇంతకంటే ఆధారాలు అవసరం లేదేమో!

రికార్డులు ఇలా...

గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థల (ఆర్‌ఎస్‌ఈటీఐ) కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహి స్తున్నది. దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డే-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) పరిధిలో అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ నిరుద్యోగ యువ తకు ఉచిత వసతి, భోజన సదుపాయాలతో వృత్తి శిక్షణ అందిస్తున్నట్టు రికార్డులు చెప్తున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలు, తయారీ, సేవలు, వ్యాపార నిర్వహణ వంటి విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు.

63 లక్షల మందికి శిక్షణ - 
45 లక్షల మందికి ఉపాధి!

కేంద్ర ప్రభుత్వం 2026 సెప్టెంబర్‌లో వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశవ్యా ప్తంగా 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 647 సంస్థలు 634 జిల్లాల్లో పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు 63.47 లక్షల మందికి శిక్షణ అందించారు. వీరిలో 45.60 లక్షల మందిని ఉపాధిలో స్థిరపడ్డారని కేంద్రం ప్రకటించింది. వారిలో 94 శాతం మంది స్వయం ఉపాధి కార్యకలాపాల ద్వారా, మిగిలిన ఆరు శాతం మంది వేతన ఉద్యోగాల్లో చేరినట్లు తెలిపింది. అంటే శిక్షణ పొందిన వారిలో సుమారు 71.8 శాతం మందిని ఉపాధిలో స్థిరపడినవారిగా ప్రభుత్వం లెక్కిం చింది. కానీ ఈ లెక్కల్ని పార్లమెంటరీ స్థాయి సంఘం ఆక్షేపించండం గమనార్హం!

ఇవీ వాస్తవాలు

కేంద్రం ప్రకటించిన గణాంకాలపై గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ఉచిత నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన జాతీయ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (రూడ్‌సెటీ - ఎన్‌ఏఆర్) స్వయంగా అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. అకాడమీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ అధ్యయనంలో 2017 నుంచి 2022 మధ్య శిక్షణ పొందినవారిలో ఎంపిక చేసిన 4,565 మందిని 60 శిక్షణ సంస్థల పరిధిలో సర్వే చేశారు. సర్వే సమయంలో శిక్షణ పూర్తిచేసుకున్న 58 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. 26 శాతం మంది స్వయం ఉపాధిలో, 13 శాతం మంది వేతన ఉద్యోగాల్లో, మూడు శాతం మంది రెండు రకాల ఉపాధిలో ఉన్నట్టు పేర్కొన్నారు. శిక్షణ అనంతరం సొంతంగా వ్యాపారాలు ప్రారంభించినవారిలో 50 శాతం మందికి నెలకు రూ.5 వేల లోపే లాభం వస్తున్నట్టు నిర్థారణ అయ్యింది. మరో 23 శాతం వ్యాపారాలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల మధ్య లాభం లభిస్తోంది. అంటే 73 శాతం వ్యాపారాల నెలవారీ లాభం రూ.10 వేల లోపే ఉంది. రూ.50 వేలకుపైగా లాభం పొందు తున్న వ్యాపారాలు కేవలం మూడు శాతమే.

పార్లమెంటరీ కమిటీ అసంతృప్తి

ఆరఎసఈటీఐల పనితీరుపై 2026 ఆగస్టు 11న గ్రామీణాభివృద్ధి పార్లమెంటరీ స్థాయి సంఘం తన నివేదికలో అనేక లోపాలను గుర్తిం చింది. 2026 మే నాటికి దేశంలోని 27 రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో 636 సంస్థలు 623 జిల్లాల్లో మాత్రమే పనిచేస్తున్నట్లు పేర్కొంది. ప్రతి జిల్లాకు కనీసం ఒక సంస్థ ఏర్పా టు చేయాలన్న లక్ష్యం ఇంకా పూర్తి కాలేదని ఆక్షేపించింది. అసలు ఈ నిధులు ఎటు వెళ్తు న్నాయని ప్రశ్నించింది. దీనికి సంబం ధించి అనేక సిఫార్సులు చేసింది. వెనుకబడిన జిల్లా లు, బలహీన రాష్ట్రాలకు అవసరాల ఆధా రంగా ప్రత్యేక నిధులు కేటాయించాలని సూచించింది.

కొత్త ఒప్పందంతో వెల్లడైన లోపాలు

శిక్షణ నాణ్యత, నిర్వహణ ప్రమాణాలు, పర్యవేక్షణను మెరుగుపరిచేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2026 అక్టోబరు 12న జాతీయ అకాడమీ ఆఫ్ రూడ్‌సెటీతో అవగాహన ఒప్పందం కుదుర్చు కుంది. శిక్షణ ప్రమాణాల్లో ఏకరూపత, శిక్షకులకు ప్రత్యేక శిక్షణ, ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు, అభ్యర్థుల అంచనా, ధ్రువీకరణ, డిజిటల్ పర్యవేక్షణను బలోపేతం చేయాలని నిర్ణయించింది. 2026-27లో దేశవ్యాప్తంగా 6.35 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫలితంగా ఇన్నేళ్ల ‘నైపుణ్య శిక్షణ’ గాడి తప్పినట్టు కేంద్రం అంగీకరించినట్టు అయ్యింది.

చేతులెత్తేస్తున్న బ్యాంకులు

బ్యాంకులు కేవలం శిక్షణ సంస్థలను నిర్వహించే స్పాన్సర్లుగా మాత్రమే కాకుండా, శిక్షణ పొందినవారికి రుణాలు అందించే బాధ్యతను కూడా కలిగి ఉన్నాయి. అభ్యర్థుల వ్యాపార ప్రణాళికలను పరిశీలించడం, అర్హులైనవారికి రుణాలు మంజూరు, అవసరమైన మార్గదర్శకత్వం చేయాలి. కానీ అవేవీ లేకుండా దరఖాస్తు దశలోనే తిరస్కరణలు సర్వసాధారణంగా మారాయి. ఈ ఏడాది అక్టోబరు 8న షిల్లాంగ్‌లో జరిగిన జాతీయ స్థాయి సమీక్షలో కేంద్ర గ్రామీణా భివృద్ధి శాఖ కార్యదర్శి కూడా దీనిపై అభ్యంతరాలు వ్యక్తంచేశారు. శిక్షణ పొందినవారికి ప్రత్యేక రుణ సహాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.

తెలంగాణలో...

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు నైపుణ్య శిక్షణ రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టింది. దీనితో బ్యాంకర్లు కేంద్ర పథకాల అమలుపై ఆసక్తి కనబర్చట్లేదు. తెలంగాణలో ‘నైపుణ్య’ బకాయిలు రూ.27.84 కోట్లు రావల్సి ఉంది. ఇక్కడ ఎస్‌బీఐ ఆధ్వర్యంలో తొమ్మిది నైపుణ్య కేంద్రాలకు రూ.22.53 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలోని తొమ్మిది కేంద్రాలకు రూ.4.92 కోట్లు, కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని రెండు శిక్షణ కేంద్రాలకు రూ.39 లక్షలు రావాల్సి ఉంది. మొత్తం 20 గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలు పనిచేస్తున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్స రంలో 646 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి 18,950 మందికి శిక్షణ ఇవ్వాల ని లక్ష్యంగా పెట్టుకున్నారు. సెప్టెంబరు 30 నాటికి 262 కార్యక్రమాలు నిర్వహించి 7,038 మందికి శిక్షణ అందించినట్టు ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్‌ఎల్‌బీసీ) లో వివరించారు. తమ బకాయిలు చెల్లించాలని పేర్కొంటూ సమావేశ ఎజెండాలో ప్రత్యేక అంశంగా చేర్చారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై స్పందించలేదు.

‘ముద్ర’ లేదు

చిన్న వ్యాపారాల స్థాపనకు ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద శిశ్‌, కిశోర్, తరుణ్, తరుణ్ ప్లస్ విభాగాల్లో రుణాలు అందించే అవకాశం ఉంది. అలాగే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద కొత్త సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు బ్యాంకు రుణంతోపాటు మార్జిన్ మనీ సబ్సిడీ అందిస్తారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, తయారీ, సేవా రంగాల్లోనూ బ్యాంకుల నుంచి ప్రత్యక్ష రుణాలు పొందవచ్చు. నైపుణ్యం పేరుతో శిక్షణ ఇచ్చిన బ్యాంకర్లు మాత్రం ఆయా పథకాలపై నిరుద్యోగులకు అవగాహన కల్పించట్లేదు. ఎవరైనా తెలుసుకొని దరఖాస్తు చేస్తే వివిధ రకాల పత్రాల కొరత చూపి కాలహరణం చేయడం పరిపాటిగా మారింది. దీనిపై మోడీ సర్కార్ మౌనం అనేక అనుమానాలకు తావిస్తుంది. ప్రచారం కోసం పథకాలు ప్రకటించడం, అమల్లో బ్యాంకర్ల ద్వారా కొర్రీలు పెట్టించడంలో కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అవుతున్నట్టు కనిపిస్తుంది.


దక్షిణాదిలో...

దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 217 మంది వ్యాపారవేత్తల నమూనాలోనూ 45 శాతం వ్యాపారాలకు నెలకు రూ.5 వేల లోపు లాభం వస్తోంది. మరో 25 శాతం వ్యాపారాలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల మధ్య లాభం లభిస్తోంది. అంటే దక్షిణాదిలోనూ 70 శాతం వ్యాపారాల లాభం నెలకు రూ.10 వేల లోపే ఉంది. చిన్న వ్యాపారాలు ప్రారంభించడమే కాకుండా, వాటి ద్వారా కుటుంబానికి సరిపడా ఆదాయం వచ్చేలా చేయడంలోనూ వ్యవస్థ మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.


బ్యాంకు రుణాలేవీ?

నైపుణ్య శిక్షణ సమయంలో నిరుద్యో గులకు బ్యాంకు రుణాలు ఇస్తామని చెప్పి, అది పూర్తయ్యాక ముఖం చాటేయడం బ్యాంకర్లకు పరిపాటిగా మారింది. స్వయం ఉపాధి పేరుతో సొంతవ్యాపారాలు చేస్తున్న వారిలో 82 శాతం మంది సొంత నిధులను వినియోగించినట్టు గుర్తించారు. బ్యాంకు రుణాలను కేవలం 23 శాతం మంది మాత్రమే పొందారు. స్వయం ఉపాధి రుణాల కోసం కేంద్రం ప్రకటించిన అనేక సబ్సిడీ పథకాలను అమలు చేయడంలో బ్యాంకర్లు ఆసక్తి చూపట్లేదు. బ్యాంకుల భాగస్వామ్యంతోనే శిక్షణ ఇస్తున్నా, రుణ సదుపాయం మాత్రం అందించట్లేదంటే నైపుణ్య శిక్షణ ‘మేడిపండు’ ఏపాటిదో అర్థమౌతోంది.


గణాంకాలు లేవ్

ఎంతమందికి శిక్షణ ఇచ్చారు? స్వయంఉపాధిలో స్థిరపడినవారెందరు? ఎంతమంది వ్యాపారాలు కొనసాగిస్తున్నారు? కుటుంబానికి వస్తున్న ఆదాయం ఎంత? బ్యాంకర్లు ఎంతమందికి రుణాలు ఇచ్చారు? మూతపడిన వ్యాపారాలు ఎన్ని? అనే గణాంకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నమోదు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది.


తెలంగాణలో...

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు నైపుణ్య శిక్షణ రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టింది. దీనితో బ్యాంకర్లు కేంద్ర పథకాల అమలుపై ఆసక్తి కనబర్చట్లేదు. తెలంగాణలో ‘నైపుణ్య’ బకాయిలు రూ.27.84 కోట్లు రావల్సి ఉంది. ఇక్కడ ఎస్‌బీఐ ఆధ్వర్యంలో తొమ్మిది నైపుణ్య కేంద్రాలకు రూ.22.53 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలోని తొమ్మిది కేంద్రాలకు రూ.4.92 కోట్లు, కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని రెండు శిక్షణ కేంద్రాలకు రూ.39 లక్షలు రావాల్సి ఉంది. మొత్తం 20 గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలు పనిచేస్తున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 646 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి 18,950 మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సెప్టెంబరు 30 నాటికి 262 కార్యక్రమాలు నిర్వహించి 7,038 మందికి శిక్షణ అందించినట్టు ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్‌ఎల్‌బీసీ) లో వివరించారు. తమ బకాయిలు చెల్లించాలని పేర్కొంటూ సమావేశ ఎజెండాలో ప్రత్యేక అంశంగా చేర్చారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై స్పందించలేదు.


వివిధ రాష్ట్రాలకు కేంద్ర ‘నైపుణ్య’ బకాయిలు ఇలా (రూ. కోట్లలో)

తెలంగాణ 27.84

కర్నాటక 49.56

అసోం 5.86

హిమాచల్‌ప్రదేశ్ 8.80

పశ్చిమ బెంగాల్ 11.58

జమ్మూకాశ్మీర్ 5.77

ఆంధ్రప్రదేశ్ 14.56

మధ్యప్రదేశ్ 14.67

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్