కూలీలుగా మారుతున్న రైతన్నలు..దొడ్డిదారిన వ్యవసాయ నల్ల చట్టాలు
ప్రజలు కలిసికట్టుగా తిప్పికొట్టాలి : ఏఐకేఎస్ బహిరంగ సభలో బృందా కరత్
నల్లగొండ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
కార్పొరేట్ల చేతుల్లో మన వ్యవసాయం బందీ అయిందని సీపీఐ (ఎం) జాతీయ నేత, మాజీ ఎంపీ బృందా కరత్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో దేశంలోని రైతన్నలు కూలీలుగా మారిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సుదీర్ఘంగా పోరాడి వాటిని ఉపసంహరించుకొనేలా చేశారని గుర్తు చేశారు. అయినా దొడ్డి దారిన వాటిని మళ్లీ అమలు చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని ఆక్షేపించారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు కలిసి కట్టుగా ఇలాంటి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభను పురస్కరించుకుని ఆదివారం నల్లగొండలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. మహాసభ ఆహ్వానసంఘం చైర్మెన్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో బృందా కరత్ ప్రసంగిస్తూ... కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 80 ఏండ్ల తర్వాత అధికారాన్ని వెలగబెడుతున్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అంగీకరించట్లేదని విమర్శించారు. ఏఐకేఎస్ ఏర్పడి 90 ఏండ్లయిందని, నాడు బ్రిటిష్ సామ్రాజ్యవాద వేధింపులకు వ్యతిరేకంగా పోరాడిందని గుర్తు చేశారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వద్ద సాష్టాంగపడి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకొని రైతులను బలి చేస్తోందని విమర్శించారు. అందుకు వ్యతిరేకంగా రైతులు.. వ్యవసాయ కూలీలు, ఇతర ప్రజానీకం పోరాడాలని పిలుపునిచ్చారు. రైతుల, వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం ఏఐకేఎస్ పోరాడుతోందని, ఆయా తరగతులకు అండగా నిలుస్తోందని తెలిపారు. తెభాగా, వర్లీ, వీర తెలంగాణ... ఇలా ఎన్నో పోరాటాలకు నాయకత్వం వహించిందన్నారు.
ప్రస్తుతం వీర తెలంగాణ సాయుధ పోరాటానికి సైతం మతం రంగు పులుముకునేందుకు ప్రయత్నిస్తోందని హెచ్చరించారు. అలా చేస్తే... ఖబడ్దార్.. బీజేపీ నేతల్లారా అని హెచ్చరించారు. పంటలకు కనీస మద్దతు ధరల విషయంలో స్వామినాథన్ నివేదిక తోపాటు, పేదలకు ఉపాధి కల్పించే నరేగాను సైతం కేంద్రం ఆపేసిందంటూ దుయ్యబట్టారు. ఆదివాసీల హక్కులను కాలరాసి వారిని అడవుల నుంచి బలవంతంగా వెళ్లగొట్టే దుర్మార్గానికి మోడీ ప్రభుత్వం బరి తెగించిందన్నారు. ఆదివాసీ హక్కుల పోరాట యోధుడు దిర్శా ముండా చూపిన బాటలో ఏఐకేఎస్ నడుస్తోందని చెప్పారు. అదే స్ఫూర్తితో మరిన్ని ఉద్యమాలకు రూపకల్పన చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ఏఐకేఎస్ మహాసభ నిర్ణయాలతో రైతాంగ పోరాటాలపై కొత్త వెలుగులు ప్రసరించాలని బృందా కరత్ ఆకాంక్షించారు. రానున్న కాలంలో జరిగే పోరాటాలను అది నిర్దేశించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె తన ప్రసంగాన్ని ‘సోదరీ సోదరులారా అందరికీ నమస్కారం..’ అంటూ తెలుగులో ప్రారంభించి, సభికులను ఉత్సాహపరిచారు.
బహిరంగ సభలో ఎంపీ అమరరామ్, ఐద్వా జాతీయ అధ్యక్షులు శ్రీమతి, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, సీఐటీయూ జాతీయ కోశాధికారి ఏం. సాయిబాబు, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ, ప్రజా సంఘాల నాయకులు హన్నన్ మొల్ల, కృష్ణ ప్రసాద్, ఏ. ఆర్. సింధు, పుణ్యవతి, విక్రమ్ సింగ్, మల్లు లక్ష్మి, అరుణ జ్యోతి, మాజీ ఎమ్మెల్యేలు చెరుపల్లి సీతారాములు, నంద్యాల నరసింహారెడ్డి, కేకే రాకేష్, బాల గోపాల్, ఏపీ రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణయ్య, ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ రైతు సంఘం కోశాధికారి ఎం. శోభన్, నల్లగొండ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, మహిళా రైతుల కన్వీనర్ కందాల ప్రమీల, తుమ్మల వీరారెడ్డి, నారి ఐల ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, మల్లు నాగార్జున రెడ్డి, పలు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)