లంగర్‌హౌజ్‌లో ముఠా గుట్టురట్టు
46 గృహోపయోగ సిలిండర్లు, 35 చిన్న సిలిండర్లు, 2 ఆటోలు స్వాధీనం
సిలిండర్ నుంచి 2 కిలోల గ్యాస్ మళ్లింపు
డెలివరీ బాయ్స్ సహా ఆరుగురు నిందితుల అరెస్ట్
టాస్క్‌ఫోర్స్, పౌరసరఫరాల శాఖ సంయుక్త మెరుపు దాడులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
సామాన్య వినియోగదారులకు పంపిణీ చేయాల్సిన గృహ ఉపయోగ ఎల్‌పీజీ సిలిండర్ల నుంచి అక్రమంగా గ్యాస్‌ను దొంగిలించి, చిన్న సిలిండర్లలో నింపి బ్లాక్ మార్కెట్లో సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు రట్టు చేశారు. హైదరాబాద్ లంగర్‌హౌజ్ బాపూఘాట్ సమీపంలోని ఓ స్క్రాప్ దుకాణం అడ్డాగా సాగుతున్న ఈ అక్రమ దందాపై గోల్కొండ జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం మెరుపు దాడులు నిర్వహించింది. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుంది.
సిలిండర్‌కు 2 కిలోల చొప్పున లూటీ..
అబిడ్స్ చిరాగ్ అలీ లేన్‌లోని ‘ఎస్కే ఎంటర్‌ప్రైజెస్’ గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ సిబ్బందిగా పనిచేస్తున్న విక్కీ, రాము గోదాము నుంచి వినియోగదారులకు చేరవేయాల్సిన 14.2 కిలోల నిండు సిలిండర్లను లంగర్‌హౌజ్‌లోని స్క్రాప్ దుకాణానికి తరలించేవారు. అక్కడ రీఫిల్లింగ్ పైపుల ద్వారా ఒక్కో సిలిండర్ నుంచి దాదాపు 2 కిలోల గ్యాస్‌ను అక్రమంగా బయటకు తీసి, 3 కిలోల చిన్న సిలిండర్లలో నింపేవారు. ఆ తర్వాత పెద్ద సిలిండర్లకు తిరిగి మూతలు బిగించి.. వినియోగదారులకు అంటగడుతున్నారు. చోరీ చేసిన గ్యాస్‌ను చిన్న సిలిండర్ల ద్వారా అధిక ధరలకు విక్రయిస్తూ భారీగా అక్రమ ఆర్జనకు పాల్పడుతున్నారు.ఈ దందాలో పాలుపంచుకున్న లంగర్‌హౌజ్ ప్రాంతానికి చెందిన రవి, సోహైల్, ఆటో డ్రైవర్ పంకజ్, గ్యాస్ డెలివరీ బాయ్ విక్కీతో పాటు మల్లేపల్లికి చెందిన రాము, రాజును టాస్క్‌ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. వారి నుంచి 46 పెద్ద హెచ్‌పీ సిలిండర్లు, 35 చిన్న సిలిండర్లు, ఒక ఎలక్ట్రానిక్ కాటా, 7 రీఫిల్లింగ్ పైపులు, రెండు లోడింగ్ ఆటోలను సీజ్ చేసింది.
ఏజెన్సీ గోదాములో పౌరసరఫరాల శాఖ సోదాలు
టాస్క్‌ఫోర్స్ సమాచారంతో హైదరాబాద్ జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్‌వో) శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఏసీఎస్‌వో, డీటీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సిలిండ ర్లను తనిఖీ చేశారు. అనంతరం అబిడ్స్‌లోని ‘ఎస్కే ఎంటర్‌ప్రైజెస్’ ప్రధాన కార్యాలయంతో పాటు సర్దార్ బాగ్‌లోని గ్యాస్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గ్యాస్ నిల్వలు, బుకింగ్స్, డెలివరీ రికార్డులను పరిశీలించారు. ఈ వ్యవహారంలో ఏజెన్సీ యాజమాన్య పాత్రపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.
బరువు చూసుకున్నాకే సిలిండర్ తీసుకోవాలి : డీఎస్‌వో శ్రీనివాస్
వినియోగదారులు సిలిండర్ డెలివరీ తీసుకునే సమయంలో తప్పనిసరిగా బరువును తూకం వేయించి సరిచూసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారి కె.శ్రీనివాస్ చెప్పారు. తూకంలో తేడా ఉంటే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలనీ, గృహోపయోగ గ్యాస్‌ను అక్రమంగా రీఫిల్లింగ్ చేసినా, దారిమళ్లించినా నిత్యావసర సరుకుల చట్టం (ఈసీ యాక్ట్) కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.







కామెంట్‌లు (0)