నిర్మాణ దశల్లో 1.90 లక్షల ఇండ్లు .. నాలుగు కార్పొరేషన్లలో హైదరాబాద్ తరహా ఇందిరమ్మ టవర్స్
రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుపేదల కోసం నిర్మిస్తున్న ఇందిరమ్మ పథకంలో ఇప్పటివరకు 2,21,500 ఇండ్లలో గృహప్రవేశాలు పూర్తయ్యాయని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. దీపావళి రోజు ప్రతి ఇందిరమ్మ ఇంటిలోనూ వేడుకలు చేసుకోవాలని, ఆ రోజు పేదల ఇంట్లో వెలిగే దీపం తెలంగాణ ప్రజాప్రభుత్వ సంకల్పానికి ప్రతీక కావాలని చెప్పారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కేంద్రంలో బుధవారం రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి మంత్రి పొంగులేటి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్ని ఆర్థిక అవరోధాలున్నా పేదల ఆత్మగౌరవానికి చిహ్నమైన ఇందిరమ్మ ఇండ్లను నిర్మించేందుకు ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. భద్రత, భరోసాతోపాటు ఇండ్లు ఇవ్వాలన్న సంకల్పంతో తొలి విడత 4.50 లక్షల ఇండ్లు మంజూరు చేయగా, ఇప్పటి వరకు 2,21,500 ఇండ్లలో గృహ ప్రవేశాలు పూర్తయ్యాయని, మరో 1.90 లక్షల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో పూర్తి కానున్నాయని వివరించారు.
గృహ ప్రవేశాలు చేసిన ఇండ్లకు దీపావళి రోజు ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు, ఈ పథకంతో మమేకమైన అందరూ వెళ్లి వారి ఆనందాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దీనికి సూచికగా తమ ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు అనే పోస్టర్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్ ‘క్యూర్’ ఏరియా పరిధిలో లక్ష ఇండ్లను మంజూరు చేశామని చెబుతూ హైదరాబాద్ తరహాలోనే రాష్ట్రంలోని నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ కార్పొరేషన్‌లలో కూడా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం చేపడతామని ప్రకటించారు. జీ ప్లస్-5 పద్ధతిలో నిర్మించనున్న ఈ టవర్స్ నిర్మాణానికి దీపావళిలోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ నుంచి వచ్చే ఏడాది బోనాలు ఎత్తిస్తామన్నారు. రాష్ట్రంలో రూ.40 వేల కోట్లతో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపేదిలేదని స్పష్టం చేశారు. లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు ప్రతి సోమవారమూ నేరుగా హైదరాబాద్ నుంచి నిధులను జమ చేస్తున్నామని వివరించారు.






కామెంట్‌లు (0)