తెలంగాణ కథలో హీరో కేసీఆర్‌..విలన్‌ కాంగ్రెస్‌

1 గంట క్రితం

Telangana
avatar
balaji

ప్రచురించబడింది నవం 30, 2026 | 3 నిమిషాల చదవడం

500 రోజుల్లో కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారు

కేసీఆర్‌ దీక్షతోనే ఉద్యమానికి మలుపు..పలు జిల్లాల్లో దీక్ష‍ా దివస్‌ సభలు

నవంబర్‌ 29 తెలంగాణ చరిత్రలో చెరగని సంతకం : కేటీఆర్


నవతెలంగాణ-కరీంనగర్‌/సిద్దిపేట/జనగామ
తెలంగాణ కథలో హీరో కేసీఆర్‌ అయితే.. విలన్‌ కాంగ్రెస్‌.. అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు, రైతుబంధు, ఉద్యోగ నియామకాలు, పీఆర్సీ, ఆరు గ్యారంటీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కేసీఆర్‌ ‌దీక్షా దివస్‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం అలుగునూర్‌లో నిర్వహించిన దీక్షా దివస్‌ సభలో ఆయన మాట్లాడారు. మరో 500 రోజుల్లో కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి

అవుతారని, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ నుంచి విముక్తి కల్పిస్తారని తెలిపారు. తెలంగాణ చరిత్రలో నవంబర్‌ 29 చిరస్మరణీయమైన రోజని అన్నారు. ఎంతో మంది అమరవీరుల త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూనీ చేస్తుందని ఆరోపించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదని, నిరుద్యోగులకు జాబ్‌ నోటిఫికేషన్‌ వేస్తానన్న రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్‌ కూడా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్‌రెడ్డి ఎక్కడ ఉన్నారో చెప్పాలన్నారు. ముమ్మాటికీ కేసీఆర్‌ చేపట్టిన నిరాహార దీక్ష‍తోనే తెలంగాణ రాష్ర్టం ఏర్పడిందని స్పష్టంచేశారు. సింహం తన కథ తాను చెప్పు కోకపోతే వేటగాడు చెప్పే పిట్టకథలే నిజమవుతాయని వ్యాఖ్యానించారు. ఉద్యమ చరిత్రను భావితరాలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ బిడ్డపై ఉంద న్నారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, ఆరు నెలల్లో పీఆర్సీ, పెండింగ్‌ డీఏలు, రైతు బంధు పెంపు వంటి హామీల పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు.

ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్‌ కాలయాపన చేస్తోందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష‍ చూపుతుందని, కేంద్రం నుంచి రాష్ర్టానికి వాటాగా రావాల్సిన నిధులను ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచినా కేంద్రం నిధులు తేవడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎల్,రమణ, జీవన్ రెడ్డి, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌, మాజీ ఎంపీ బాల్క సుమన్‌, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు పాల్గొన్నారు.

రైతు కష్టాలు పట్టించుకోని ముఖ్యమంత్రి : హరీశ్‌ రావు

జనగామ, సిద్దిపేటలో నిర్వహించిన దీక్షా వివస్‌‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోయి రైతులు కష్టాలు పడుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడంలేదని ఆరోపించారు. రాష్ట్రంలో వచ్చిన కరువుకు కారణం ఎల్‌‌నినో ప్రభావం కాదని, ముఖ్యమంత్రి నిర్లక్ష్యంతోనే జరిగిందని జనగామలో నీటి ప్రాజెక్టుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేసీఆర్ బిక్షతోనే రేవంత్‌‌కు సీఎం పదవి వచ్చిందని అన్నారు. ‌కేసీఆర్‌ ‌తన పోరాటంతో కేంద్రం మెడలు వంచి.. తెలంగాణ బిల్లు పాస్‌ ‌చేయించారని తెలిపారు. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ఉంటుందా.. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2వ తేదీ ఉంటుందా.. జూన్ 2వ తేదీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఉంటుందా.. అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం రాకపోతే రేవంత్ రెడ్డి ఆంధ్రోళ్ల బూట్ల కాడనో, ఆంధ్రోళ్ల కాళ్ల కాడనో పడి ఉండేవాడని.. చంద్రబాబు నాయుడు అడుగులో అడుగు వేసుకుంటూ తిరుగుతుండేవాడని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్