Magazines

దేశాన్ని లూటీ చేసి కార్పొరేట్లకు దోచిపెట్టడమే..

1 గంట క్రితం

corporates
avatar
balaji

ప్రచురించబడింది నవం 17, 2026 | 6 నిమిషాల చదవడం

దేశంలో భూసంస్కరణలు అమలు చేసింది కమ్యూనిస్టులే

ఢిల్లీ రైతాంగ పోరాట హామీల విస్మరణ

మోడీ సర్కారు విధానమిదే

అమెరికా సామ్రాజ్యవాదానికి సాగిలబడుతున్న మోడీ..దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలు బలోపేతమవ్వాలి :ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌


సారంపల్లి మల్లారెడ్డి నగర్‌ నుంచి అచ్చిన ప్రశాంత్‌

దేశాన్ని లూటీ చేసి కార్పొరేట్లకు దోచిపెట్టడమే అన్నట్టుగా కేంద్రంలోని బీజేపీ పాలనా విధానం ఉందని అఖిల భారత కిసాన్‌ ‌సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌ ‌విమర్శించారు. అమెరికా సామ్రాజ్యవాద విస్తరణలో భాగంగా ఆ దేశాధ్యక్షులు ట్రంప్‌ విధానాలన్నింటినీ కేంద్రంలోని మోడీ సర్కార్‌ అమలు చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. సారంపల్లి మల్లారెడ్డి నగర్‌ (నల్లగొండ)లో జరుగుతున్న ఏఐకేఎస్‌ ‌జాతీయ 36వ మహాసభలో విజూ కృష్ణన్‌ సోమవారం ప్రధాన కార్యదర్శి నివేదికను ప్రవేశపెడుతూ ప్రసంగిం చారు. మన దేశ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే లా అమెరికా, న్యూజిలాండ్‌, యూరోపియన్‌ ‌యూనియన్‌, తదితర దేశాలతో మోడీ సర్కార్‌ చేసుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశ ఆర్థిక సమగ్రతకే ప్రమాదకరమని హెచ్చరిం చారు. అమెరికాలో ఒక రైతు సగటు భూమి 400 ఎకరాలనీ, ఆ రైతు పంటలు పండించేం దుకు అక్కడ పెద్ద ఎత్తున సబ్సిడీలు అందుతాయ ని తెలిపారు.

కానీ, మన దేశంలో ఒక రైతు సగటు వ్యవసాయ కమతం ఐదెకరాల లోపేనని గుర్తు చేశారు. మన దగ్గర ఇచ్చే సబ్సిడీ అంతంతే ననీ, అలాంటప్పుడు విదేశీ రైతులతో మన రైతు ఎలా పోటీపడగలడని ప్రశ్నించారు. ఆ దేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి అయితే మన రైతులు రోడ్డున పడే ప్రమాదముందని హెచ్చరించారు. దేశంలో మోడీ, అంబానీ, అదానీ లూటీ పాలన సాగుతున్నదని విమర్శిం చారు. ఖనిజ వనరులను, భూములను మోడీ సర్కారు కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెడుతున్న తీరును విజూ కృష్ణన్‌ ఎండగట్టారు. ఓవైపు అడవుల సంరక్షణ పేరుతో ఆదివాసీలను మోడీ సర్కారు బలవంతంగా అడవుల నుంచి గెంటివేస్తూ మరోపక్క అదే అడవుల్లోని ఖనిజ వనరులను అంబానీ, అదానీ, జిందాల్‌, బిర్లా లాంటి కార్పొరేట్లకు కట్టబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణ విధ్వంసానికి కారకులు కార్పొరేట్లే అని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. దేశంలో కమ్యూనిస్టులు పోరాటాలు చేసిన, కమ్యూనిస్టు ప్రభుత్వాలున్న రాష్ర్టాల్లోనే భూసంస్కరణలు అమలయ్యాయని గుర్తు చేశారు.

హిందూత్వ ఎజెండా ముసుగులో ముస్లింలు, క్రిస్టియన్లు, ఆదివాసీలు, గిరిజనులు, మహిళలపై దాడులు పెరిగిపోతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులను కట్టుబానిసలుగా మార్చేందుకు నాలుగు లేబర్‌ ‌కోడ్‌‌లను మోడీ సర్కార్‌ తీసుకొచ్చిందని విమర్శించారు. సర్‌ ‌పేరుతో 14 కోట్ల మంది ఓట్లను ఈసీ తొలగించిన తీరును వివరించారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టిందనీ, జాతీయ మీడియా దీన్ని కప్పిబెడుతూ బడ్జెట్‌‌ను పొగుడుతూ కథనాలు రాసిన తీరును ఎండగట్టారు. కౌలు రైతులను ఆదుకోవడంలో విఫలం దేశంలో సబ్సిడీలు, రుణాలు, పంట నష్టపరిహారాలు అందక కౌలు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విజూ కృష్ణన్‌ అన్నారు. తెలంగాణలో 20 లక్షల మందికిపైగా, ఏపీలో 30 లక్షల మందికిపైగా కౌలు రైతులున్నారనీ, వారిని ఆదుకోవడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.


దేశంలో 342కిపైగా జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొంటే కేంద్ర ప్రభుత్వంగానీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలుగానీ రైతులకు పైసా సాయం అందించలేదని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్‌ ‌చేశారు. గ్రామీణ పేదలను రోడ్డున పడేసేలా వీబీ గ్రామ్‌‌జీ చట్టం ఉందని విమర్శించారు. ఎకోటూరిజం, తదితర అభివృద్ధి పనుల పేరిట రైతుల నుంచి భూములను లాక్కోవడాన్ని తప్పుబట్టారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. ఢిల్లీ రైతాంగ పోరాట విరమణ సందర్భంగా మోడీ సర్కారు ఇచ్చిన లిఖిత పూర హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ ‌చేశారు. ఎమ్‌ఎస్‌ ‌స్వామినాథన్‌ ‌ సిఫారసులను అమలు చేయాలని ఆయన కోరారు. మోడీ సర్కారు అనుసరిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలను ఉధృతం చేయాలనీ, రైతాంగ, కార్మిక ఐక్య ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.


కార్మిక–కర్షక ఐక్యతతోనే కార్పొరేట్ దోపిడీకి అడ్డుకట్ట

రైతు, కార్మిక ఉమ్మడి పోరాటాలు మరింత బలోపేతం కావాలి : సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎలమారం కరీం

-సారంప‌ల్లి మ‌ల్లారెడ్డి న‌గ‌ర్ నుంచి గుడిగ ర‌ఘు
దేశంలో రైతులు, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలకు ఐక్య ఉద్యమాలే పరిష్కారమని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎలామరం కరీం నొక్కి చెప్పారు. అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్‌) 36వ మహాసభలో భాగంగా సోమ‌వారం ప్రారంభ‌మైన ప్ర‌తినిధుల స‌భ‌లో ఆయ‌న సౌహర్ధ సందేశమిచ్చారు. రైతులు, కార్మికుల ప్రయోజనాలు పరస్పరం ముడిపడి ఉన్నాయని, ఆ పోరాటాలను విడదీయలేమని పేర్కొన్నారు. దేశ వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డీజిల్, విద్యుత్ తదితర వ్యవసాయ పెట్టుబడుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఫ‌లితంగా రైతులకు తగిన ఆదాయం లభించడం లేదన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక‌వైపు వ్యవసాయ రంగంలో కార్పొరేట్ సంస్థల ఆధిపత్యం పెరుగుతుండ‌గా, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, నిల్వలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ రంగాలపై పెద్ద కంపెనీలు పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు.

corporates
మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, కరువులు, వడగాల్పులు రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను చారిత్రక రైతాంగ పోరాటం ద్వారా వెనక్కి తీసుకునేలా చేయగలిగామని, అయితే ఆ ఉద్యమం సందర్భంగా రైతులు లేవనెత్తిన కనీస మద్దతు ధర చట్టబద్ధత వంటి అనేక ప్రధాన డిమాండ్లు ఇంకా పరిష్కారం కాలేదని తెలిపారు. ఏఐకేఎస్ దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా రైతాంగాన్ని సంఘటితం చేస్తూ భూస్వామ్య వ్యవస్థ, కుల వివక్ష, సామాజిక అణచివేత, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా చారిత్రక పోరాటాలు నిర్వహించిందని కొనియాడారు. పెట్టుబడి ఖర్చులు పెరగటం, లోపభూయిష్ట మార్కెట్ విధానాల వల్ల రైతులు నష్టపోతుంటే, తక్కువ వేతనాలు , కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి సమస్యలు కార్మికులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్మికుల హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరడం, కార్మికులకు అందుబాటు ధరల్లో నిత్యావసర వస్తువులు అందించాలని డిమాండ్ చేయడం పరస్పర విరుద్ధమైనవి కావని, ఈ రెండు పోరాటాలు ఒకదానికొకటి అనుబంధ‌మైన‌వని స్పష్టం చేశారు. రైతుల కొనుగోలు శక్తి తగ్గితే పారిశ్రామిక ఉత్పత్తి, ఉపాధిపై కూడా ప్రభావం పడుతుందని వివరించారు.


మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రక పోరాటంలో ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు కలిసి నిర్వహించిన ఉద్యమాలు కార్మిక–కర్షక ఐక్యతకు గొప్ప ఉదాహరణగా నిలిచాయని పేర్కొన్నారు. కార్పొరేట్ దోపిడీ, ధరల పెరుగుదల, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక హక్కులపై దాడులకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు ఉమ్మడి ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మికుల సమస్యలకు గ్రామీణ ఉద్యమంలో అత్యంత ప్రాధాన్యత కల్పించాలని, భూమిలేని పేదలు, అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన, స్కీమ్ వర్కర్లు, గిరిజన ప్రజలను కూడా ఐక్య ఉద్యమంలో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకంలో మార్పుల వల్ల గ్రామీణ కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా భారీ పోరాటాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న‌ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు ఐక్యంగా పోరాడాలని క‌రీం ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు. కార్మికులు, రైతుల ఆత్మగౌరవం, ఆర్థిక భద్రత, ప్రజాస్వామ్య హక్కులను కాపాడినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. సీఐటీయూ, ఏఐకెఎస్ సంఘాల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేసి దేశవ్యాప్త ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని సూచించారు.


అమరవీరులకు జోహార్లు

ఏఐకేఎస్‌ ‌మహాసభలో సంతాప తీర్మానం : ప్రవేశ పెట్టిన జాతీయ ఉపాధ్యక్షులు రవీంద్రన్‌

-సారంపల్లి మల్లారెడ్డి నగర్‌ నుంచి గుడిగ రఘు
దేశంలోని రైతాంగానికి, ప్రజానీకానికి సేవ చేసిన పలువురు అమరవీరులకు నల్లగొండలో కొనసాగుతున్న ​ఏఐకేఎస్‌ 36‌వ మహాసభ ఘనంగా నివాళులర్పించింది. సోమవారం నల్లగొండలో ప్రారంభమైన ప్రతినిధుల సభలో ఏఐకేఎస్‌ ‌జాతీయ ఉపాధ్యక్షులు రవీంద్రన్‌ సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. సీపీఐ(ఎం) అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి, మేధావి, ప్రజా ఉద్యమాల రూపకర్త సీతారాం ఏచూరికి మహాసభ ఘనంగా నివాళులర్పించింది. కేరళం మాజీ సీఎం అచ్యుతానందన్‌, బెంగాల్‌ ‌మాజీ సీఎం బుద్ధదేవ్‌ ‌భట్టాచార్య మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల మరణించిన ఏఐకేఎస్‌ ఉద్యమ నాయకులు ఎన్‌ ‌శంకరయ్య, మదన్‌ ‌ఘోష్‌,, సారంపల్లి మల్లారెడ్డి, జీసీ బయ్యరెడ్డి, హిట్రోబెనియల్‌, లుహనుకోమ్‌, హరేన్‌ ‌కృష్ణ సమంత, పీకే సుధాకరన్‌, కమృద్దీన్‌, సిద్ధప్ప కాల్‌‌శేట్టి, జైసింగ్‌ మాలి, శంకర్‌‌రావు ధనవ్‌, రెహమాన్‌, కమల్‌ ‌కర్‌, పెన్న అనంత రామశర్మ, అనిల్‌, చక్మా, కరుణ బుయ్యాన్‌,


corporates
అసీమ్‌‌సాహు, ఎస్‌ ‌వెల్మరన్‌, జగనాథ్‌, సోనేలాల్‌, ప్రదీప్‌‌సింగ్‌, ఎన్‌ ‌చెల్లాదురయ్‌, అమర్‌ ‌ధని కైపాంగ్‌, హెమగోపాల్‌ ‌శర్మ, మాణిక్‌ ‌దాస్‌‌గుప్తా, ఓవీ నారాయణన్‌, చావిహుడా మరణం పట్ల మహాసభ తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చింది. ​అనుబంధ సంఘాలకు చెందిన నాయకులకు సంతాపం సీఐటీయూ జాతీయ మాజీ ఉపాధ్యక్షులు బాసుదేబ్‌ ఆచార్య, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాయింట్‌ సెక్రెటరీ సునీత్‌‌చోప్రా, స్వాతంత్య్ర సమరయోధులు కన్నయ్‌ ‌బెనర్జీ, ఎంఎం లారెన్స్‌, ఐద్వా మాజీ కోశాధికారి బెనయ్‌ ‌బీస్వాస్‌, ఉపాధ్యాయ ఉద్యమ నేత డాక్టర్‌ ‌కిషోర్‌ ‌థాక్కెదత్‌, సీపీఐ(ఎం) మాజీ కేంద్ర కమిటీ సభ్యులు మ్రిదుల్‌ ‌దేవ్‌, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ నిప్కేలేబ్‌ ‌భట్టాచార్య, ఐద్వా మాజీ ఉపాధ్యక్షులు సరోజిని బాలనందన్‌, సీఐటీయూ నేత కేపీ సహదేవన్‌, నాయకులు కేఎం తివారీ, బేబీ జాన్‌, బిస్న మహంతితోపాటు వివిధ రంగాలకు చెందిన నాయకుల మరణం పట్ల సభ సంతాపాన్ని తెలిపింది. సంతాప సూచికంగా ప్రతినిధులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.


ఆరేండ్ల‌యినా ఒప్పందం అమలు కాలేదు

ఏఐకేఎస్ (అజ‌య్ భ‌వ‌న్‌) జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య

-న‌ల్ల‌గొండ నుంచి న‌వ‌తెలంగాణ ప్ర‌త్యేక ప్ర‌తినిధి
నల్ల చట్టాలను రద్దు చేస్తామంటూ ప్రధాని మోడీ ప్రకటించి ఆరేండ్లు కావ‌స్తున్నా..ఆ ఒప్పందాలను ఇంకా అమ‌లు చేయ‌లేద‌ని ఏఐకేఎస్ (అజయ్ భవన్) జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య అన్నారు. నల్లగొండలో జరుగుతున్న ఏఐకేఎస్ 36వ అఖిల భారత మహాసభలో సోమవారం ప్రతినిధుల సభలో ఆయన సౌహార్ధ సందేశమిచ్చారు. దేశవ్యాప్తంగా 540 రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చాగా ఏర్పడి 13నెలల నిర్విరామంగా చేసిన ఆందోళనతో మోడీ దిగొచ్చార‌ని గుర్తు చేశారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న రైతుల‌కు క్షమాపణలు చెప్పారని అన్నారు. ఇది అన్న‌దాత‌ల విజ‌య‌మ‌ని అభివ‌ర్ణించారు. ఆనాటి ఒప్పందంలో భాగంగా.. పంటలకు గిట్టుబాటు ధర, రైతు రుణాల మాఫీ, విద్యుత్ బిల్లు ఉపసంహరణ, రైతులకు పింఛ‌న్ త‌దితర హామీల‌ను అమలు చేయాల్సి ఉన్నా, వాటిప‌ట్ల కేంద్రం తీవ్ర నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని విమర్శించారు . దీనికి నిరసనగా ఎస్కేఎం ఆధ్వర్యంలో ఈనెల 26న చేప‌ట్ట‌నున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.


corporates

​




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్