దేశం గర్వించేలా ఖేలో ఇండియా గేమ్స్‌

2 గంటల క్రితం

Khelo
avatar
balaji

ప్రచురించబడింది నవం 29, 2026 | 3 నిమిషాల చదవడం

యూత్‌ గేమ్స్‌ నిర్వహణతో క్రీడా రంగానికి నూతన దశ, దిశ

క్రీడల అభివృద్దికి సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేక చొరవ

క్రీడల్లో పోటీపడనున్న 7 వేల మంది క్రీడాకారులు

27 క్రీడాంశాల్లో పతక పోటీలు, 2 ప్రదర్శన క్రీడాంశాలు

తెలంగాణ వ్యాప్తంగా పోటీల నిర్వహణ :​ ‘నవతెలంగాణ’తో ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి


తెలంగాణలో క్రీడా పండుగను దేశం గర్వించేలా నిర్వహిస్తామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌తో రాష్ట్ర క్రీడా రంగానికి నూతన దశ, దిశ రానుందన్నారు . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ​డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్‌ ‌గేమ్స్‌ ‌సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరితో ‘నవతెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ.


​తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు సిద్ధమైంది? ఈ క్రీడా పోటీల ప్రత్యేకత ఏమిటి?

తెలంగాణలో క్రీడా పండుగకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ఒక సాధారణ క్రీడా పోటీగా కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరినీ భాగస్వాములను చేసే మహోత్సవంగా నిర్వహించాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. దేశవ్యాప్తంగా 7వేల మందికి పైగా క్రీడాకారులు, 27+2 క్రీడాంశాలు, 33 జిల్లాలు, 6 నగరాలు, 20 క్రీడా వేదికలతో ఈ పోటీలు జరగనున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆతిథ్యాన్ని దేశానికి పరిచయం చేసే గొప్ప అవకాశం ఇది.

​ఇంత పెద్ద క్రీడా పోటీల నిర్వహణలో జిల్లా యంత్రాంగం పాత్ర ఎలా ఉండబోతోంది?

ఈ క్రీడల విజయవంతమైన నిర్వహణలో జిల్లా కలెక్టర్ల పాత్ర అత్యంత కీలకం. అందుకే సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు. అవసరమైన నిధులను అందిస్తున్నాం. అదనపు నిధులు అవసరమైతే వాటిని కూడా సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. క్రీడా వేదికల అభివృద్ధి, క్రీడా సామగ్రి, క్రీడాకారులకు వసతి, భోజనం, రవాణా వంటి ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం.

​రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని మీరు సూచిస్తున్నారు. దీనికి కారణం ఏమిటి?

​ క్రీడలకు రాజకీయాలతో సంబంధం ఉండకూడదు. ఇవి రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలు. అందువల్ల జిల్లా ఇన్‌చార్జి మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులందరినీ పార్టీలకతీతంగా భాగస్వామ్యం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. పోలీస్, మున్సిపల్, విద్యాశాఖతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలూ సమన్వయంతో పనిచేయాలి.

ఖేలో ఇండియా క్రీడలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు?

ఈ క్రీడల గురించి కేవలం క్రీడాకారులకే కాకుండా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలియాలి. అందుకోసం 33 జిల్లాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం. కలెక్టరేట్లు, ప్రధాన కూడళ్లు, జనసమ్మర్థ ప్రాంతాల్లో హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ వాహనాలు, ప్రజాప్రతినిధుల వాహనాలపై ఖేలో ఇండియా మస్కట్ స్టిక్కర్లు ఉండాలి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, డిజిటల్ స్క్రీన్ల ద్వారా ప్రచారం నిర్వహించాలి. ఆకాశవాణి ద్వారా కూడా ప్రచారం చేసేందుకు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా డిసెంబర్ 6 నుంచి 10 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించి క్రీడా వాతావరణాన్ని మరింత పెంచుతాం.

విద్యార్థులను ఈ క్రీడా పోటీల్లో ఎలా భాగస్వాములను చేయబోతున్నారు?

​విద్యార్థులే రేపటి క్రీడాకారులు. వారిలో చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి, స్ఫూర్తి పెంపొందించాలి. 8 నుంచి 12వ తరగతి విద్యార్థులను పోటీలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తీసుకురావాలి. క్రీడా వేదికల్లో ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండకుండా విద్యార్థులు, ప్రజలతో నింపాలి. తాము కూడా భవిష్యత్‌లో క్రీడాకారులుగా ఎదగాలన్న ఆకాంక్ష కలుగుతుంది. ఇందులో పీఈటీలు, కోచ్‌లు, విద్యాశాఖ అధికారులు కీలక పాత్ర పోషించాలి.

​33 జిల్లాల్లో నిర్వహించనున్న ఖేలో ఇండియా టార్చ్ ర్యాలీ ప్రత్యేకత ఏమిటి?

టార్చ్ ర్యాలీ అనేది కేవలం ప్రచార కార్యక్రమం మాత్రమే కాదు. క్రీడా స్ఫూర్తిని గ్రామస్థాయికి తీసుకెళ్లే కార్యక్రమం. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ ర్యాలీని ఘనంగా నిర్వహిస్తాం. గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఇందులో భాగస్వామ్యం చేయాలి. ప్రతి జిల్లాలోనూ స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టాలి. ఖేలో ఇండియా మస్కట్ ‘పాలపిట్ట’ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. అదే సమయంలో ‘నషా ముక్త్ తెలంగాణ’ సందేశాన్ని కూడా బలంగా ప్రచారం చేయాలి.

​ తెలంగాణ క్రీడా రంగాన్ని భవిష్యత్‌లో ఏ స్థాయికి తీసుకెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచన?

తెలంగాణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే మా లక్ష్యం. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా వంటి దేశాలు క్రీడల్లో సాధిస్తున్న విజయాలను ఆదర్శంగా తీసుకుని మన క్రీడాకారులను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించేలా పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలి. క్రీడా రంగానికి రూ.1,500 కోట్ల నుంచి రూ.2వేల కోట్ల వరకు బడ్జెట్ కేటాయింపులు సాధించేందుకు ముఖ్యమంత్రిని కోరుతాం.

ఈ క్రీడల నిర్వహణ ద్వారా తెలంగాణకు ఎలాంటి గుర్తింపు రావాలని మీరు ఆశిస్తున్నారు?

ఖేలో ఇండియా అనేది కేవలం 12 రోజుల క్రీడా పోటీలు కాదు. తెలంగాణ క్రీడా రంగ భవిష్యత్తుకు బలమైన పునాది. ఈ క్రీడల నిర్వహణ ద్వారా మన రాష్ట్రంలో ఉన్న క్రీడా ప్రతిభ, మౌలిక సదుపాయాలు, ఆతిథ్య సామర్థ్యం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాలి. తెలంగాణను దేశంలోనే ప్రముఖ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం. క్రీడాకారులకు అవకాశాలు కల్పించడం, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రతిభను తీర్చిదిద్దడం మా ప్రాధాన్యతలు.​





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్