Magazines

బతుకులు ఛిద్రం!

1 గంట క్రితం

Lives
avatar
balaji

ప్రచురించబడింది నవం 17, 2026 | 3 నిమిషాల చదవడం

ఎల్‌‌నినోతో వర్షాల్లేక.. పంట దిగుబడి రాక నష్టం

అప్పుల ఊబిలో చిక్కుకుని రైతుల ఆత్మహత్య

ఆపన్నహస్తం కోసం బాధిత కుటుంబాల ఎదురుచూపులు

పట్టించుకోని ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు


​దేశానికే అన్నం పెట్టే అన్నదాతల బతుకులు ఆగమవుతున్నాయి. 
ఎల్‌నినో ప్రభావంతో వానలు ముఖం చాటేయడం, చేతికందిన పంటలు ఎండిపోవడం, పంటల దిగుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దీంతో ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబాలు నేడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడు తున్నాయి. పన్నహస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఆదుకునేవారు లేక ఉన్న ఊర్లోనే వ్యవసాయ, దినసరి కూలీలుగా మారాల్సిన దుస్థితి నెలకొంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల దయనీయ పరిస్థితి.


నవతెలంగాణ-ఆదిలాబాద్‌ ‌ప్రాంతీయ ప్రతినిధి

ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలతో భర్త ఫొటో పట్టుకుని కనిపిస్తున్న మహిళ పేరు భాగ్యశ్రీ. ఆమె భర్త ఉరాడే అవినాష్‌(40) అక్టోబర్‌ 15‌న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బేల మండలం సిర్సన్న గ్రామానికి చెందిన ఈయన ఖరీఫ్‌ ‌సీజన్‌‌లో తనకున్న నాలుగు ఎకరాలతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, సోయా పంటలు సాగు చేశాడు. వర్షాలు కురవక అతి తక్కువ సమయంలోనే చేతికి రావాల్సిన సోయా దిగుబడి పూర్తిగా పడిపోయింది. ఎల్‌‌నినో ప్రభావంతో పత్తి దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో వచ్చేలా లేదు. పంట సాగుకోసం చేసిన రూ.15లక్షల అప్పు ఎలా తీర్చాలోనని అవినాష్‌ మనస్తాపానికి గు‌రయ్యాడు. చేనులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ఇద్దరు ఆడపిల్లలను పోషించడానికి ఆ మహిళ కూలీగా మారింది.​ఆసిఫాబాద్‌ ‌జిల జైనూర్‌ ‌మండలంలోని భూషిమెట్ట గ్రామానికి చెందిన గిరిజన తెగకు చెందిన చిన్న, సన్నకారు రైతు ఘోటేకర్ సూర్యభాన్(50)ఈ నెల 2న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనకు పది ఎకరాల భూమి ఉండగా అందులో ఐదెకరాల భూమి సాగుకు యోగ్యంగా లేదు.

దాంతో మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం పదెకరాల్లో పత్తి, కంది, కూరగాయలు సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే వాడు. ఈ యేడాది వర్షాలు లేక పెట్టుబడి సాయం అందక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తరుణంలో దిగుబడులు కూడా వచ్చేలా లేవని వారం రోజులుగా బెంగపెట్టుకున్నాడు. పత్తి పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాదని భావించి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబ సభ్యులు ఇటుక బట్టీల్లో కూలీ పనికి వెళ్తున్నారు.​ఇలాంటి ఘటనలు ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక చోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి. లోటు వర్షపాతంతో పాటు ఎల్‌‌నినో ప్రభావం పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఈ యేడాది జనవరి నుంచి మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాలో 31 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కూడా ఇవ్వలేదు. జిల్లాలో అత్యధికంగా పత్తి, సోయా పంటలు సాగు చేస్తారు. సెప్టెంబర్‌ ‌నెలలో సోయా దిగుబడులు చేతికొచ్చే సమయంలో ఆత్మహత్యలు పెరుగుతూ వస్తున్నాయి. సెప్టెంబర్‌ ‌నెలలో ఆరుగురు రైతులు, అక్టోబర్‌ లో 8 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు. చనిపోయిన రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి, రుణ విముక్తుల్ని చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ ‌చేస్తున్నారు.


రైతు బీమా చెల్లించని ప్రభుత్వం

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రైతు బంధుతోపాటు రైతు బీమా డబ్బులు చెల్లించి వారిని ఆర్థికంగా ఆదుకుంది. 2018లో తెలంగాణ రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించింది. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే నెల రోజుల్లోపు నామినీ బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షలు జమ అయ్యేవి. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రైతుబంధును రైతు భరోసాగా మార్చి యేడాదికి 
ఎకరానికి రూ.12 వేలు ఇస్తామని ప్రకటించింది. ఖరీఫ్‌, రబీ పంటల సాగుకు పెట్టుబడి సాయం ఇవ్వక 
అన్నదాతలకు మొండిచేయి చూపింది. ఆ తర్వాత వేసినా ఆలస్యంగా ఇచ్చింది. ఈ తరుణంలో ఎల్‌‌నినో ప్రభావం జిల్లా రైతాంగాన్ని అతలాకుతలం చేసింది. అంతకు ముందు 2025లో అతి భారీ వర్షాలతో పాటు తుఫాను అనేక పంటలను దెబ్బతీసింది. ఖరీఫ్‌ ‌సాగు చేయడానికి అప్పులు చేసిన రైతులు దిగుబడులు రాక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆదిలాబాద్‌ ‌జిల్లాలో ప్రభుత్వం 20 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. అయితే ప్రభుత్వం తీవ్రంగా కరువు ఉన్న మండలాలు, తక్కువ తీవ్రత ఉన్న మండలాలు అనడం సరికాదని పలువురు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే కరువు భత్యం 
ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్