ప్రతిపాదిత కొనుగోలు కేంద్రాలు ప్రారంభించని అధికారులు
నల్లగొండ జిల్లాలో 39 కేంద్రాలే ప్రారంభం
ఉమ్మడి కరీంనగర్‌లో ప్రయివేటు వ్యాపారుల వైపు చూపు
నవతెలంగాణ -
నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఈ ఏడాది ఎల్‌నినో పరిస్థితులు, వర్షాభావం వల్ల పంటల సాగు తగ్గింది. వచ్చిన కొద్దిపాటి పంటను విక్రయించేం దుకు రైతులు సిద్ధమవ్వగా అక్టోబరు నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమ య్యాయి. మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు ప్రత్యేక బోనస్ ఉండటంతో కొనుగోళ్లకు భారీ ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 8283 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అనుకుంది. విడతల వారీగా కేంద్రాలను ప్రారంభిస్తోంది. ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలో ముందస్తుగానే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలోనూ కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులు ప్రయివేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించినట్టుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నెలలో కోతలు పూర్తిస్థాయికి చేరినా ప్రభుత్వ కొనుగోళ్లు కేంద్రాల్లో ఆశించిన వేగవంతంగా జరగడం లేదని తెలుస్తోంది. దీంతో రైతులు తమ పంటను తొందరంగా అమ్ముకునేందుకు ప్రయివేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నట్టు తెలిసింది.
మద్దతు ధరకు మించి ప్రయివేటు వ్యాపారులు కొనుగోలు చేయడం కూడా ఒక కారణమని తెలుస్తోంది.
నల్లగొండ జిల్లాలో వరి ధాన్యం కోతలు దాదాపు పూర్తవుతున్నా కొనుగోళ్ల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఆశించినంత వేగంగా ముందుకు సాగడం లేదు. ప్రతిపాదిత కొనుగోలు కేంద్రాలు పూర్తిగా ప్రారంభం కాలేదు. కాంటాలు వేసిన చోట కూడా మిల్లులకు తరలించలేదు. అందులోనూ దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లే ప్రారంభించారు. సన్న రకం ధాన్యం కొనుగోళ్లు ఇంకా ప్రారంభించలేదు. దాంతో ఎక్కడికక్కడా ధాన్యం రాశులు పేరుకుపోయాయి. నల్లగొండ జిల్లాలో మొత్తం 284 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా, ఇప్పటివరకు 39 కేంద్రాలూ ప్రారంభమయ్యాయి. సోమవారం నాటికి 234 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ కొనుగోళ్ల ద్వారా 37 మంది రైతులు మాత్రమే లబ్దిపొందారు.
25,878 మెట్రిక్ టన్నుల ధాన్యం రాక
జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు 25,878 మెట్రిక్ టన్నుల ధాన్యం చేరింది. ఇందులో ఐకేపీ కేంద్రాలకు 8,576 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ కేంద్రాలకు 15,432 మెట్రిక్ టన్నులు, ఎఫ్‌పీఓ కేంద్రాలకు 1,870 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది. కేంద్రాలకు ధాన్యం భారీగా చేరుతున్నప్పటికీ కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.
రైతుల చెల్లింపుల వివరాలు సున్నా
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనప్పటికీ రైతులకు చెల్లింపులకు సంబంధించిన వివరాలు ఇంకా నమోదు కాలేదు. చెల్లించిన మొత్తం, బకాయిలు, చెల్లింపులు పొందిన రైతుల సంఖ్యకు సంబంధించిన గణాంకాలు ప్రస్తుతం రూ.0.00గా ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రాల ఏర్పాటు, ధాన్యం రాక ప్రారంభమైనప్పటికీ, కొనుగోళ్లు, రవాణా, రైతుల చెల్లింపుల ప్రక్రియలో ఇంకా వేగం పెరగాల్సి ఉంది.
284 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల కోసం ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్ పి ఓ) ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటిలో ఐకేపీ పరిధిలో 77 కేంద్రాలు, పీఏసీఎస్ పరిధిలో 176 కేంద్రాలు, ఎఫ్‌పీఓ పరిధిలో 31 కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 284 కేంద్రాల్లో 193 కేంద్రాలు దొడ్డు రకం ధాన్యం, 91 కేంద్రాలు సన్న రకం ధాన్యం కొనుగోళ్లకు ప్రతిపాదించారు. కానీ, ఇప్పటివరకు ప్రారంభించిన 39 కేంద్రాల్లో ఐకేపీకి చెందిన 13, పీఏసీఎస్‌కు చెందిన 26 కేంద్రాలు ఉన్నాయి. ఎఫ్‌పీఓ పరిధిలో ఒక్క కేంద్రం కూడా ప్రారంభం కాలేదు. సన్న రకం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదు.
ఎక్కడి ధాన్యం అక్కడే..
కేంద్రాల ప్రారంభమే కాదు.. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా మిల్లులకు తరలించే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం నల్లగొండలో 234 మెట్రిక్ టన్నుల ధాన్యం రవాణా చేయాల్సి ఉంది. ట్యాబ్ ఎంట్రీలు, ట్రక్ చిట్స్, మిల్లుల నుంచి అందాల్సిన అక్నాలెడ్జ్‌మెంట్ వివరాలు ఇప్పటివరకు సున్నాగా నమోదయ్యాయి. కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు చేరినట్టు సంబంధిత రికార్డుల్లో ఇంకా నమోదు కాలేదు.







కామెంట్‌లు (0)