రెన్యూవల్ చేసుకోవాలంటూ..బ్యాంకుల నుంచి ఫోన్లు
బంగారం ధర తగ్గుతుండటంతో గోల్డ్ లోన్ బాధితులకు కొత్త చిక్కులు
ధర పెరిగినప్పుడు అంటగట్టి..ఇప్పుడు తిరిగి కట్టాలనడంపై ఆగ్రహం
మరింత ఒత్తిడి తీసుకొస్తున్న ఎన్‌బీఎఫ్‌సీలు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
బంగారం ధర తగ్గుతుండటంతో గోల్డ్ లోన్ తీసుకున్న ఖాతాదారులకు కొత్త చిక్కులు వస్తున్నాయి. గతంలో తీసుకున్న వాటికి ప్రస్తుతం తగ్గిన ధరతో మార్జిన్ తగ్గడంతో వ్యత్యాసం ఉన్న లోన్ డబ్బులు చెల్లించాలని పలు బ్యాంకులు తమ ఖాతాదారులకు సమాచారం ఇస్తున్నాయి. లోన్‌ను రెన్యూవల్ చేసుకోవాలని లేకుంటే మిగిలిన బ్యాలెన్స్ అయినా చెల్లించాలని సిబ్బంది చెబుతున్నారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలైతే (ఎన్‌బీఎఫ్‌సీలు) అదనంగా బంగారం తీసుకురావాలని ఒత్తిడి తీసుకొస్తుండటం గమనార్హం. ఇన్ని రోజుల పాటు సదరు కంపెనీల లాభాల కోసం పెరిగిన ధరకు అదనంగా ఇచ్చి ఇప్పుడు ఒక్కసారిగా డబ్బులు తీసుకొచ్చి కట్టాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలని ఖాతాదారులు ఆవేదన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండలో ఓ గోల్డ్ లోన్ ఇచ్చే ఫైనాన్స్ కంపెనీ అధికారులతో ఖాతాదారులు వాగ్వాదానికి సైతం దిగారు. మిగతా చోట్ల కూడా ఇదేవిధమైన పరిస్థితులు ఉన్నాయి. సాధారణంగా బహిరంగా మార్కెట్‌లో పలికే బంగారం ధర కంటే 25 శాతం తక్కువ రేటుతో బ్యాంకులు, ఇతర కంపెనీలు గోల్డ్ లోన్ ఇస్తుంటాయి. ఆర్‌బీఐ నిబంధనలు లోన్ టూ వాల్యూ(ఎల్‌టీవీ) ప్రకారం బంగారు అభరణాల స్వచ్ఛత, బరువు ఆధారంగా తరుగు తొలగించి చెల్లిస్తుంటారు. ఇటీవల ఒక గ్రాము బంగారం ధర రూ.14 వేల నుంచి రూ.15వేలు పలకగా స్వచ్ఛత ఆధారంగా పలు బ్యాంకులు గ్రాముకు రూ.8500 నుంచి రూ.9500 వరకు లోన్ ఇచ్చాయి. ప్రస్తుతం బహిరంగా మార్కెట్‌లో గ్రాము ధర రూ.12,900కు పడిపోవడంతో ఎల్‌టీవీ ధర సైతం రూ.7300 నుంచి రూ.8300 వరకు పడిపోయింది. దీంతో తగ్గిన మార్జిన్‌ను తిరిగి రాబట్టుకునేందుకు ప్రభుత్వ, ప్రయివేట్ బ్యాంకులు ప్రయత్నాలు ప్రారంభించి గోల్డ్ లోన్ ఖాతాదారులకు మెసేజ్‌తో పాటు ఫోన్లు చేస్తున్నాయి.
తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తున్న ఎన్‌బీఎఫ్‌సీలు
ప్రభుత్వ, ప్రయివేట్ రంగ బ్యాంకులతో పాటు పలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) గోల్డ్ లోన్‌లు ఇస్తుంటాయి. బ్యాంకులు ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం లోన్ టూ వాల్యూ ప్రకారం బహిరంగ మార్కెట్‌కు అనుగుణంగా 75 శాతం ధర నిర్ణయిస్తే.. పలు ఫైనాన్సియల్ కంపెనీలు ఖాతాదారులను పెంచుకుని తద్వారా తమ
వ్యాపారం పెంచుకునేందుకు వీలుగా గ్రాముకు అదనంగా చెల్లిస్తూ ఎక్కువ మొత్తంలో వడ్డీ వసూలు చేస్తుంటాయి. ప్రస్తుతం గోల్డ్ రేట్ తగ్గడంతో లోన్ మార్జిన్ వ్యత్యాసం భారీగా పెరిగింది. ఎన్‌బీఎఫ్‌సీలను నియంత్రించేందుకు జిల్లా స్థాయిలో యంత్రాంగం లేకపోవడంతో వారి ఆగడాలకు అడ్డులేకుండా పోతోందని, వాటి ఆగడాలను నియంత్రించాలని ఖాతాదారులు కోరుతున్నారు. ధర పెరుగుతున్న వేళ కంపెనీ లాభాల కోసం రెన్యూవల్ సమయంలో అదనంగా డబ్బులు అంటగట్టి ఇప్పుడు ఇలా వేధించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గోల్డ్ లోన్‌లకు ఆదరణ
అత్యవసరాలకు తక్కువ సమయంలో రుణాలు తీసుకునేందుకు గోల్డ్ లోన్‌లు ఉపయుక్తంగా మారడంతో వినియోగదారులు వీటిపై ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీంతో ఖాతాదారుల సంఖ్య, లోన్‌ల సంఖ్య ఏటికేడూ పెరుగుతూ వస్తుంది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల నివేదికల ప్రకారం రాష్ట్రంలో సుమారు 47 లక్షల నుంచి 52 లక్షల మంది ఖాతాదారులు 75 లక్షలకు పైగా గోల్డ్ లోన్ ఖాతాలు కలిగి ఉన్నట్టు అంచనా. వీటి విలువ సుమారు రూ.1.60 లక్షల కోట్లు ఉంటుందని సదరు ఏజెన్సీలు నివేదించాయి.







కామెంట్‌లు (0)