దేశ వ్యాప్తంగా బలమైన ప్రజా ఉద్యమాలు రావాలి : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
ఓ వర్గం ఓట్లను కుట్రపూరితంగా తొలగిస్తున్నారు : సీపీఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శి జాన్‌వెస్లీ
సర్‌ను నిషేధించేవరకు పోరాటం ఆగదు..రాజ్యాంగ పరిరక్షణ వేదిక సదస్సులో తీర్మానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘సర్’ పై రాజకీయ పార్టీల మౌనం ప్రమాదకరమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ‘ఇండియన్ కాన్ స్టిట్యూషన్-రైట్ టూ ఓట్- ఎలక్ర్టోరల్ రిఫార్మ్స్’ అనే అంశంపై రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ దేశంలో నివసించినట్టయితే కాందీశీకులకు కూడా ఓటు హక్కు కల్పించాలని దేశ విభజన సమయంలో రాజ్యాంగ పరిషత్ నొక్కి చెప్పగా, ఆ స్ఫూర్తిని నేటి పాలకులు కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పాలకులు ఎవరుండాలనేది ఓటర్లు నిర్ణయిస్తే నేడు ఓటర్లు ఎవరుండాలని పాలకులు నిర్ణయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బతికున్న వ్యక్తులు కూడా తమ ఓటు హక్కును మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ సర్ ప్రక్రియ చేపట్టిన తర్వాత జరిగిన ఎన్నికలంటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పునరుద్ధరించిన ఓట్లతో తిరిగి ఎన్నికలను నిర్వహించాలని కోరారు.
ప్రజా సమాచార హక్కు జాతీయోద్యమ ప్రచార కో కన్వీనర్ అంజలీ భరద్వాజ్ మాట్లాడుతూ సర్ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోలేదనీ, అందుకే అది చట్టబద్ధం కాదని తెలిపారు.
కమిషనర్ల నియామకంలో నిబంధనలు మార్చడం, ఎలక్టోరల్ బాండ్స్ లాంటి తీవ్రమైన విషయాల్లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పేందుకు ఏడేండ్ల సమయం తీసుకోవడం ప్రణాళికాబద్ధంగా జరుగిందని ఆరోపించారు. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ సంజయ్ ఆర్.హెగ్డే మాట్లాడుతూ చట్టబద్ధంగా వచ్చిన హక్కును తొలగిస్తున్నప్పుడు ప్రతి దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఉందని గుర్తుచేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ దేశ ప్రజలందరికి సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక ప్రధాన కార్యదర్శి డీజి.నర్సింహరావు, రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు కె.పార్థసారథిలు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సర్‌ను నిషేదించేవరకు పోరాటం ఆగదని వేదిక నాయకులు కే.ఉమామహేశ్వర్‌రావు ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కార్యక్ర మంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు కే.గోవర్దన్, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు యూ.ప్రభాకర్, వేదిక నాయకులు రామచంద్రారెడ్డి, వి.కామేశ్‌బాబు, కే.వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఓ వర్గం ఓట్లను కుట్రపూరితంగా తొలగిస్తున్నారు
సీపీఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శి జాన్‌వెస్లీ
‘సర్’ ప్రక్రియ పేరిట దళితులు, ముస్లింలు, ఆదివాసీలు, పేదలు, మహిళల ఓట్లను లక్ష్యంగా చేసుకొని తొలగిస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. వలస వెళ్లిన 7 కోట్ల మంది ఓట్లను తొలగించడ తప్పా అని ఇటీవల హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షులు నిస్సిగ్గుగా మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఉపాధి లేక వలస వెళ్లడం పేదలు చేసిన తప్పా అని నిలదీశారు. ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఉపాధి కోసం వెళ్లినంత మాత్రాన వారి ఓట్లను తొలగించడం సరికాదన్నారు. అక్రమ చొరబాటుదారులు ఉన్నారని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం వారి వివరాలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. పన్నెండేం డ్లుగా కేంద్రంలో అధకారంలో ఉన్న వారు ఏంచేస్తు న్నారని ప్రశ్నిం చారు. గత ఎన్నికల్లో చావుదప్పి కన్నులొట్ట బోయిన బీజేపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అడ్డదా రులు దొక్కుతోందని విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థ లను నిర్వీర్యం చేస్తున్న బీజేపీని తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.







కామెంట్‌లు (0)