నెలకు రూ.18 వేల వేతనం, పీఎఫ్, ఈఎస్‌ఐ ఇవ్వాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలి
వెట్టిచాకిరీ బంద్ కావాలంటే పోరాటమే మార్గం : తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్
(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి పిలుపు
రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ఆశా కార్యకర్తల ధర్నాలు
నవతెలంగాణ- సిటీబ్యూరో/విలేకరులు
రాష్ట్రంలో రెండు దశాబ్దాలుగా ప్రజారోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్లకు నెలకు రూ.18వేల కనీస వేతనం చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐతో పాటు సమగ్ర ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశాలు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ.. తెలంగాణలో 28 వేల మంది ఆశా కార్యకర్తలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు కంటికి రెప్పలా సేవలందిస్తున్నారని తెలిపారు. మాతాశిశు సంరక్షణ, టీకాలు, సర్వేలు, చివరికి కళ్లె డబ్బాలు మోయడం వరకు రేయింబవళ్లు వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో వీరి సేవలను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆశాలను ‘గ్లోబల్ లీడర్స్’గా కొనియాడిందని, కానీ స్వదేశంలో పాలకులకు మాత్రం వీరి శ్రమ కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిదేండ్లుగా ఒక్క రూపాయి పారితోషికం పెంచకుండా, కేవలం నెలకు రూ.9,900 అరకొర వేతనంతో బతుకులను వెళ్లదీయమంటున్నారని, పెరిగిన నిత్యావసరాల ధరలతో ఆశా కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని తెలిపారు.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆశా వర్కర్ల ఆందోళనల్లో ప్రత్యక్షంగా పాల్గొని.. తాము అధికారంలోకి రాగానే రూ.18 వేల వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఆ ఊసే ఎత్తకపోవడం నమ్మక ద్రోహమేనన్నారు. అధికారులతో జరిపిన చర్చల్లో రూ.50 లక్షల బీమా, రూ.50 వేల దహన సంస్కార ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, వేతనంతో కూడిన సెలవులు ఇస్తామని లిఖితపూర్వకంగా చెప్పినప్పటికీ ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఎన్నికల హామీలను యుద్ధప్రాతిపదికన నెరవేర్చాలని, లేనిపక్షంలో డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మె ద్వారా ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి జె.కుమారస్వామి, కమిటీ అధ్యక్షులు ఎం.దశరథ్, సౌత్ కమిటీ అధ్యక్షులు మీనా, సెంట్రల్ అధ్యక్షులు టి.యాదమ్మ, కార్యదర్శి సారాబాబు, కోశాధికారి సరస్వతి పాల్గొన్నారు.
జిల్లాల్లో..
నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. మహబూబ్‌నగర్, నారాయణపేట కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేసి అధికారులకు వినతిప్రతాలు అందజేశారు. వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి.. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. కలెక్టరేట్ల ఎదుట ధర్నాల అనంతరం.. మెదక్‌లో అదనపు కలెక్టర్ నగేష్‌కి, సంగారెడ్డిలో కలెక్టరేట్ ఏవోకి, సిద్దిపేటలో డీఎంఅండ్‌హెచ్‌ఓలకు సమ్మె నోటీస్‌లు అందజేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట కూడా ధర్నాలు చేశారు.







కామెంట్‌లు (0)