Magazines

రూ.100 కోట్లు సీఎస్ఆర్ నిధుల సమీకరణ లక్ష్యం

16 నిమిషాల క్రితం

CSR funds
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఫౌండేషన్ ప్రారంభం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రాబోయే సంవత్సర కాలంలో రూ.100 కోట్ల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లోని మండలి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మండలి చైర్మెన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి “హయ్యర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (హెరిఫ్)”ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. సెక్షన్–8 కింద లాభాపేక్షలేని సంస్థగా ఏర్పాటు చేస్తున్న ఈ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు నిధుల సమీకరణలో ఒక ప్రత్యేక వేదిక అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా దాదాపు 30 వేల కంపెనీలు రూ.40,794 కోట్ల సీఎస్ఆర్ నిధులను ఖర్చు చేయగా, అందులో రూ.13,877 కోట్లు (34 శాతం) విద్యారంగానికి కేటాయించబడ్డాయని వివరించారు. సీఎస్ఆర్ నిధుల వినియోగంలో తెలంగాణ రూ.1,445.78 కోట్లతో దేశంలో తొమ్మిదో స్థానంలో ఉందని, కర్ణాటక రూ.3,395.43 కోట్లతో మూడో స్థానంలో, తమిళనాడు రూ.2,738.49 కోట్లతో ఐదో స్థానంలో ఉన్నాయని తెలిపారు. మొదటి, రెండో స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్ ఉన్నాయని చెప్పారు. జనవరి 8వ తేదీ లేదా 9వ తేదీన 100 కార్పొరేట్ కంపెనీలతో సమావేశం అవుతున్నట్టు వెల్లడించారు. దీంతో ఉన్నత విద్యకు, ప్రభుత్వ యూనివర్సిటీలకు ప్రోత్సాహం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మెన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్