ఆ జీవో కారణంగా రక్షణ కోల్పోయే ప్రమాదం
వ్యతిరేకిస్తూ తెలంగాణ సమాజం పోరాడాలి : టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మెడికల్ సీట్లలో స్థానికత మార్చే విధంగా ప్రభుత్వం తెచ్చిన జీవో లు 33, 150 ల కారణంగా పెను ప్రమాదం పొంచి ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఈ జీవోలతో తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతుందనీ, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు మేలు కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు నష్టం చేసే జీవోలను రద్దు చేయకపోగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ దాన్ని డిఫెండ్ చేయటమేమిటనీ ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె సోమవారం వీడియో సందేశం విడుదల చేశారు. వెంటనే ఈ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ తెచ్చుకున్నదే స్థానిక ప్రజలకు అన్ని రంగాల్లో సర్వ హక్కుల కోసమని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ సర్కార్ ఆ హక్కులనే హరించేలా జీవోలు తెస్తోందని మండిపడ్డారు. 1 నుంచి 7వ తరగతి వరకు చదివిన వారిని స్థానికులుగా భావించకుండా 8వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు తెలంగాణలో చదివిన వారిని స్థానికులుగా అవకాశం ఇవ్వటమేమిటనీ ఆమె నిలదీశారు. దీని కారణంగా తమ పిల్లలు నష్టపోతున్నారని ఇప్పటికే విద్యార్థుల తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. మెడికల్ సీట్లలో తీసుకొచ్చిన ఈ స్థానికత విధానాన్ని భవిష్యత్తులో అన్ని రంగాల్లో అమలు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే తెలంగాణ యువత పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తెచ్చిన జీవోలు తెలంగాణకు విపత్తు లాంటివని కవిత హెచ్చరించారు. దీనిపై కచ్చితంగా తెలంగాణ సమాజమంతా ప్రశ్నించాల్సిన అవసరముందని చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మెన్ గా ఉన్న ప్రొఫెసర్ కోదండ రాం ఈ అంశంపై గళమెత్తాలనీ, విద్యార్థులకు జరిగే నష్టాన్ని ప్రభుత్వానికి వివరించాలని కోరారు. అదే విధంగా తెలంగాణ మేధావి వర్గం, యువత, విద్యార్థులు అంతా కూడా ఈ జీవోలను వ్యతిరేకించాలన్నారు. ఇప్పటికే గ్రూప్ -1 లో స్థానికత అంశం కారణంగా తెలంగాణ విద్యార్థులు ఎంతో నష్టపోయారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరిగే విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా బుద్ది మార్చుకోవాలని సూచించారు. లేదంటే తెలంగాణ ప్రజలు సరైన సమయంలో కర్రు కాల్చి వాత పెట్టటం ఖాయమన్నారు
ప్రభుత్వ తీరుతో తెలంగాణ వైద్య విద్యార్థులకు నష్టం
28 సెప్టెంబర్, 2026

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్లు (0)