Magazines

తెలంగాణ‌లో బీజేపీ ఆట‌లు సాగవు

1 గంట క్రితం

The BJP’s antics will not work in Telangana.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 2 నిమిషాల చదవడం

మీ చౌక‌బారు ప్ర‌సంగాలు

విన‌టానికి జ‌నం సిద్ధంగా లేరు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో మీ పార్టీకి ఒక్క ఎంపీ సీటూ రాదు

అమిత్ షాకు పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంట‌ర్
న‌వ‌తెలంగాణ బ్యూరో - 
హైద‌రాబాద్

కేంద్ర హోం మంత్రి అమిత్ షా చౌక‌బారు ప్ర‌సంగాలు విన‌టానికి రాష్ట్ర ప్ర‌జ‌లు సిద్ధంగా లేర‌ని టీపీసీసీ అధ్య‌క్షులు బొమ్మ మ‌హేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. స‌ర్ ప్ర‌క్రియ గురించి, ప్ర‌జాస్వామ్యం గురించి నీతులు వ‌ల్లె వేస్తున్న ఆయ‌న ముందు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల గురించి చెప్పాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ‌లో బీజేపీ ఆట‌లు సాగ‌వని ఒక ప్ర‌క‌ట‌న‌లో హెచ్చ‌రించారు. అమిత్ షా హైదరాబాద్ సభతో తెలంగాణకు ఒరిగేదేమీ లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. కేంద్రంలో 12 ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన అమిత్ షా హైదరాబాద్ వచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేప‌ట్ట‌టం విడ్డూరంగా ఉంద‌ని విమ‌ర్శించారు. తెలంగాణకు వ‌చ్చి సభలు, పాదయాత్రలు చేయటం కాదు.. ముందుగా రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి కు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తమ హక్కులు, నిధులు, అభివృద్ధి, ఉద్యోగాలు, రైతుల సంక్షేమం గురించి వారు ఆలోచిస్తున్నార‌ని పేర్కొన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తామంటూ బీజేపీ నేత‌లు కల‌లుకంటున్నార‌ని, కానీ ఆ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాద‌ని ఎద్దేవా చేశారు. ప్ర‌ధాని మోడీ తెలంగాణ‌పై రాజకీయ వివక్ష చూపుతూ నిధులు ఇవ్వ‌కుండా క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయినా త‌మ ప్ర‌భుత్వం ఏ ఒక్క సంక్షేమ ప‌థ‌కాన్నీ ఆప‌కుండా అమ‌లు చేస్తోంద‌ని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో చెప్పాలంటూ మ‌హేశ్ కుమార్ గౌడ్ ఈ సంద‌ర్భంగా అమిత్ షాను ప్ర‌శ్నించారు. తెలంగాణకు రావాల్సిన నిధుల్లో ఎన్ని విడుదల చేశారు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ వంటి హామీల పరిస్థితి ఏమిటి? తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా విషయంలో కేంద్రం వైఖరి ఏమిటి? తెలంగాణకు రావాల్సిన పన్నుల వాటా, కేంద్ర గ్రాంట్ల విషయంలో రాష్ట్రానికి న్యాయం చేశారా? అని ఆయన నిలదీశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా హైదరాబాద్‌లో రాజకీయ సభ పెట్టడం వల్ల ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ప్ర‌యోజ‌న‌మూ ఉండ‌బోద‌న్నారు.

దేశ ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు అని పీసీసీ చీఫ్ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపు వంటి అంశాలపై త‌మ పార్టీ నిరంత‌రం ప్ర‌శ్నిస్తూనే ఉంటుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఓటు చోరీపై ప్రశ్నిస్తే కాంగ్రెస్‌ను విమర్శించడం కాదు.. ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స‌ర్ పేరుతో ఓటర్ల జాబితా సవరణ జరుగుతున్నప్పుడు అర్హులైన ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల వ్యవస్థపై ఉందని గుర్తు చేశారు. బీజేపీకి నిజంగా ప్రజాస్వామ్యంపై నమ్మకముంటే తాము లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని స‌వాల్ విసిరారు. తెలంగాణ ప్రజలు మతం పేరుతో, భావోద్వేగాల పేరుతో చేసే రాజకీయాలను చాలా కాలంగా గ‌మ‌నిస్తున్నార‌ని పేర్కొన్నారు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు బీజేపీ రాజ‌కీయాల‌కు వారు త‌గిన స‌మాధానం చెబుతార‌ని హెచ్చ‌రించారు. ఎన్నికలు వచ్చినప్పుడే తెలంగాణ గుర్తుకు రావడం, అవి పూర్తయ్యాక రాష్ట్ర సమస్యలను పట్టించుకోకపోవడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్