అంబిటియో భారతదేశపు మొట్టమొదటి ఎఐ అడ్మిషన్ల ప్లాట్‌ఫామ్. ఇది అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్లను ఎలా పొందవచ్చో తెలియజేయడానికి బాగా సహాయపడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) సాంకేతికతతో విదేశీ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్‌ను సులభతరం చేసి ‘అంబిటియో’ పేరుతో ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేశారు ఐఐటీ గ్రాడ్యుయేట్స్ దీర్ఘాయు కౌశిక్, విక్రాంత్ శివాలిక్, వైభవ్ త్యాగీ.
అతడి పేరు విహారి. మంచి ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ చేశాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన నాన్న సంపాదన మీదనే కుటుంబం నడవాలి. అయినా కొడుకును చాలా కష్టపడి చదివించాడు. అతని కంటే ముందు ఒక అమ్మాయి ఉంది. ఆమె చదువు అయిపోయింది. రేపోమాపో పెండ్లి చేయాలి. కేవలం తండ్రి సంపాదనతోనే చదువులు, పెండ్లిలు జరగడం కష్టం. అందుకోసమే విదేశాలకు పోదాం అనుకున్నాడు. కాలేజీలో అత్యధిక మార్కులతో పాసైనందుకు బ్యాంకు వాళ్లు కూడా తనకు లోన్ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. రెండు మూడు దేశాలకు ప్రయత్నం చేశాడు. ఆ దేశాల్లో కాలేజీలో అప్లికేషన్స్‌కి 20, 30 వేలు ఖర్చు అయింది. కొన్ని కాలేజీల నుండి చదువుకు ఆమోదం కూడా వచ్చింది. పాస్‌పోర్ట్ అని, పోలీస్ వెరిఫికేషన్ అని, హెల్త్ చెకప్ అని ఎన్నో ఆఫీసులు తిరిగి అవసరమైన డాక్యుమెంట్స్ సమకూర్చుకున్నాడు. విదేశాలకు పోయేందుకు ఇంగ్లీష్ ప్రావీణ్యం అవసరం కాబట్టి ఆ ప్రావీణ్యాన్ని తేల్చి చెప్పే పరీక్షలు ఉన్నాయి. వాటిలో కూడా మంచి ప్రావీణ్యం సాధించాడు. బ్యాంకు ద్వారా డబ్బులు కూడా ఒక విదేశీ కాలేజీకి పంపాడు. అక్కడ ఒక సంవత్సరం బతికేందుకు కావలసిన ఖర్చులను కూడా బ్యాంకులో వేయించుకున్నారు. ఆరు నెలలు పట్టింది. ఫీజు కట్టిన కాలేజీ వున్న దేశం నుండి వీసా రాలేదు. ఈ పంపిన డబ్బులకు వడ్డీ మాత్రం పెరుగుతుంది. మంచి మార్కులు వున్నాయి. విదేశాల్లో చదివేందుకు అవసరమైన కోర్సుల్లో, అవసరమైన స్థాయి కన్నా ఎక్కువ మార్కులు సంపాదించాడు. అయినా అదంతా వథా అయిపోయింది. ఇక్కడ కూడా ఉద్యోగాలు వచ్చాయి కానీ. అవి అతి తక్కువ జీతం ఇచ్చేవి. ఆ జీతాలతో వారికున్న బాధ్యతలు తీరడం అసంభవం అనుకున్నాడు. తండ్రి పదవీ విరమణకు దగ్గర్లో వున్నాడు. ఈ పరిస్థితుల్లో అంతగా ఆశపడడంలో తప్ప ఏమీలేదు.
ఇంతకు అతని దరఖాస్తును నిరాకరించేందుకు ఇచ్చిన కారణాలు విచిత్రమైనవి. మీరు చదువుకున్న కోర్స్‌కి మీరు అప్లై చేసిన కోర్సుకి సంబంధం లేదని. ఈ దేశం వచ్చేందుకు మీరు చెప్పిన ఉద్దేశం (స్టేట్మెంట్ ఇఫ్ పర్పస్) చదువుకునేందుకని, స్థిరపడేందుకు కాదని రాసి ఇచ్చింది మేము నమ్మడం లేదని వీసా తిరస్కరించారు. నిజంగా అలానే రాసి ఇవ్వాలి అని అతడికి విదేశాలు కోసం ప్రయత్నం చేయడంలో సహాయపడ్డ దళారి చెప్పాడు. కొన్ని నెలల తర్వాత అతడు కాలేజీకి కట్టిన డబ్బు అయితే తిరిగి పంపారు. కానీ, దాని మీద కట్టిన వడ్డీ వేలకు పెరిగింది. అతడికి ఏంచేయాలో తోచలేదు. ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఫలించలేదు. గత్యంతరం లేక ఇక్కడ ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ పెళ్లిళ్ల గురించి, మంచి జీవితం గురించి మర్చిపోయి జీవనం గడిపేస్తున్నాడు. ఇలాంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు. దళారుల చేతిలో మోసపోతూనే ఉన్నారు. అలాంటి వారికి ఊరట కల్గిస్తుంది అంబిటియో.
విదేశీ విద్య అనేది నేటి యువతరం కల. దానిని నేరువేర్చుకోవడానికి సప్త సముద్రాలు దాటి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా అంటూ వివిధ దేశాలకు చేరుతుంటారు. రెండేళ్లు కష్టపడితే చాలు ప్రతిభకు తగిన ఏదో ఒక మంచి ఉద్యోగం సంపాదించవచ్చు. లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకుంటారు. ఇలా చాలా మంది విద్యార్థులు అప్పులు చేసి మరీ అమెరికా విమానం ఎక్కుతుంటారు. కానీ, ”ఏ యూనివర్శిటీకి దరఖాస్తు చేసుకోవాలి? ఎక్కడికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది? వంటి ప్రశ్నలు మనల్ని వేధిస్తాయి. సహాయం చేసే కౌన్సెలర్‌లు ఉన్నప్పటికీ, వారి వసూళ్లు కూడా అదేస్థాయిలో ఉంటాయి అంటున్నారు అంబిటియో వ్యవస్థాపకుడు దీర్ఘాయు కౌశిక్. దాదాపు ఐదారేండ్ల క్రితం, దీర్ఘాయు పరిస్థితి కూడా అదే. ఆ సమయంలో అతని పరిస్థితి అతని మాటల్లోనే… ”నేను మాస్టర్స్ చదవాలనుకున్నాను కానీ ఏ కాలేజిని ఎంచుకోవాలో నాకు తెలియదు. రాతపని, దాని గురించిన ఆత్రుత నన్ను చాలా టెన్షన్‌కి గురిచేసింది” అని గుర్తుచేసుకుంటాడు. అలాంటి సమయంలో అతను సహాయం కోసం వెతుకుతున్నప్పుడు అతడి మదిలో వచ్చిన ఆలోచనే అంబిటియో. ఇది భారతదేశపు మొట్టమొదటి AI (ఎఐ) అడ్మిషన్ల ప్లాట్‌ఫామ్ పునాదికి దారితీసింది. ఇది అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్లను ఎలా పొందవచ్చో తెలియజేయడానికి బాగా సహాయపడుతుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) సాంకేతికతతో విదేశీ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్‌ను సులభతరం చేసి ‘అంబిటియో’ పేరుతో ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేశారు ఐఐటీ గ్రాడ్యుయేట్స్ దీర్ఘాయు కౌశిక్, విక్రాంత్ శివాలిక్, వైభవ్ త్యాగీ. మన దేశంలోని తొలి ఎఐ అడ్మిషన్ ప్లాట్‌ఫామ్ ‘అంబిటియో’ విజయపథంలో దూసుకుపోతోంది. ఐఐటీ – బీహెచ్‌యూ(వారణాసి)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కౌశిక్ ఫారిన్ యూనివర్శిటీలో ఎంబీఏ చేయడం కోసం అప్లై చేయాలనుకున్నప్పుడు స్టూడెంట్స్‌కు సహాయపడే ప్లాట్‌ఫామ్‌లాంటిదేమీ తనకు కనిపించలేదు. ‘విదేశీ యూనివర్శిటీలలో చేరే విషయంలో సహాయం అందించడానికి కౌన్సెలర్‌లు ఉన్నప్పటికీ ఎక్కువ డబ్బులు తీసుకుంటారు.
ఆ ఆర్థికభారం అందరికీ సాధ్యం కాదు. మరో విషయం ఏమిటంటే వారు ఒకటి రెండు కాలేజీల గురించి మాత్రమే చెబుతారు’ అంటాడు కౌశిక్. ఈ నేపథ్యంలోనే స్టూడెంట్స్‌కు సంబంధించి కాలేజీ అప్లికేషన్స్, సరైన కాలేజీ ఎంపిక చేసుకోవడం, పర్సనల్ ఎస్సేస్… మొదలైన వాటి గురించి ఒక ప్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేయాలనుకున్నాడు. కాలేజీ ఫ్రెండ్స్ విక్రాంత్, వైభవ్ త్యాగీలకు తన ఆలోచన చెప్పాడు. వారికి ఐడియా నచ్చి కౌశిక్‌తో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చారు. అలా ‘అంబిటియో’ అంకురం మొలకెత్తింది. ‘అంబిటియో’ ప్లాట్‌ఫామ్ ద్వారా మొదట పాతిక మంది స్టూడెంట్స్‌కు టాప్ ఇనిస్టిట్యూట్స్‌లో అడ్మిషన్ దొరికేలా సహాయం చేశారు. స్టూడెంట్స్ ప్రొఫైల్స్‌పై ప్రధానంగా దషి పెట్టి వాటికి మార్పులు, చేర్పులు చేశారు.
కార్నెగి మెలన్ యూనివర్శిటీ, ఎన్‌వైయూ, ఇంపీరియల్ కాలేజ్, యూసీ బర్కిలి… మొదలైన ఇంటర్నేషనల్ యూనివర్శిటీలకు సంబంధించి 175 మంది స్టూడెంట్స్‌కు సహాయపడ్డారు. ‘అంబిటియో గురించి తెలియడానికి ముందు ఒక కౌన్సెలర్ సలహాలు తీసుకున్నానుగానీ అవి నాకు ఉపయోగపడలేదు. అంబిటియో ఉపయోగించడం మొదలు పెట్టిన తరువాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. సరైన దారి కనిపించింది’ అంటున్న ప్రహార్ కమల్‌కు లండన్‌లోని వార్‌విక్ బిజినెస్ స్కూల్‌లో ప్రవేశం దొరికింది.
‘అంబిటియో’ ప్లాట్‌ఫామ్‌లో ఎఐ ఎలా ఉపకరిస్తుంది అనేదాని గురించి కో-ఫౌండర్, సిఇఒ కౌశిక్ మాటల్లో… ‘రెండు ప్రైమరీ ఏరియాలలో ఎఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మోస్ట్ సూటబుల్ ప్రోగ్రామ్ లేదా యూనివర్శిటీని ఎంపిక చేసుకోవడంలో స్టూడెంట్స్‌కు సహాయపడడం అందులో ఒకటి. తమకు అర్హత ఉన్న కోర్సులను ఫిల్టర్ చేసి చూడడానికి ప్రస్తుతం ఫిల్టరేషన్ టూల్స్ ఉన్నప్పటికీ మేము ఎఐ ద్వారా మరో అడుగు ముందుకు వేశాం. విస్తతస్థాయిలో సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్ పర్సనలైజ్‌డ్ రికమండేషన్‌లను వేగంగా అందిస్తూ స్టూడెంట్స్ టైమ్‌ను సేవ్ చేస్తుంది.
‘స్టూడెంట్స్ తమకు అవసరమైన కాలేజీని ఎంపిక చేసుకున్న తరువాత, తదుపరి దశ అద్భుతమైన వ్యాసం రాయడం. వివిధ యూనివర్శిటీలకు సంబంధించి 5,000 వ్యాసాలతో మా మోడల్‌కు శిక్షణ ఇచ్చాం. సరైన కాలేజీని ఎంపిక చేసుకోవడం నుంచి స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోవడం వరకు మా ప్లాట్‌ఫ్లామ్‌లో అన్నీ ఉచితమే’ అంటున్నాడు కౌశిక్. ఏంజెల్ ఇన్వెస్టర్‌ల ద్వారా కంపెనీ 1.5 కోట్ల నిధులను సమీకరించింది. ‘భారత్ మార్కెట్‌లో వేగంగా దూసుకుపోయి మరింతగా విస్తరించాలనేది మా లక్ష్యం’ అంటున్నాడు కౌశిక్.
– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417
విదేశీ చదువుకు దశ, దిశ
12:37 am