డెంగ్యూ నివారణకు చర్యలు తీసుకోవాలి

– ఆదిలాబాద్‌ కలెక్టర్‌ రాజర్షి షా
– జిల్లా వ్యాప్తంగా ఘనంగా జాతీయ డెంగ్యూ దినోత్సవం

నవతెలంగాణ-ఆదిలాబాద్‌ టౌన్‌
జిల్లాలో డెంగ్యూ నివారణకు క్షేత్రస్థాయిలో పూర్తి చర్యలు తీసుకోవాలని, గత మూడు సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య చేస్తున్న కషి అభినందనీయమని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌ జిల్లాలో 2022 నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలను తెలియజేశారు. పవర్పాయింట్‌ ద్వారా డెంగ్యూ ప్రబల తీరు, నివారణ చర్యల గురించి వివరించారు. అనంతరం డెంగ్యూతో పాటు వ్యాధుల నివారణకు కషి చేస్తున్న సిబ్బందిని సత్కరించి సర్టిఫికేట్లను అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా మాట్లాడుతూ డెంగ్యూ నివారణకు ప్రతి పీహెచ్‌సీ, సబ్‌ సెంటర్లలో అవగాహన కార్యక్రమాలపై సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మూడు సంవత్సరాలుగా జిల్లాలో కేసుల నమోదు శాతం తగ్గుతుందని, మరణాలు ఏమి జరగలేదన్నారు. అయినసరే అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇంటి పరిశుభ్రత యాజమని బాధ్యత అయితే బయట పరిశుభ్రత అర్బన్‌ ప్రాంతంలో మున్సిపల్‌, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా నీరు నిల్వ ఉండగా కూండా చూడాలన్నారు. కొబ్బరి బొండలు, మెకానిక్‌ షాపుల్లో బొండలు, టైర్లలో నీరు లేకుండా నిత్యం పర్యవేక్షించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పిస్తు నివారణకు కషి చేయాలని సూచించారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రై డేలు నిర్వహించేలా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామపంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతంలో మున్సిపల్‌, వైద్య ఆరోగ్య శాఖలు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్‌ ప్రజ్ఞాన్‌ మల్వీ, జిల్లా మలేరియ అధికారి శ్రీధర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఖమర్‌ అహ్మద్‌, మెడికల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాంసి: డెంగ్యూ వ్యాధిని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దని తాంసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ శ్రావ్య ప్రజలకు సూచించారు. గురువారం జాతీయ డెంగ్యూ వ్యాధి దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆరోగ్య సిబ్బందితో కలిసి డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా డాక్టర్‌ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి ఏడీస్‌ దోమ కాటు వల్ల సోకుతుందని అన్నారు. వ్యాధి లక్షణాలు అధిక జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాల కీళ్లనొప్పులు, వాంతులు ఉంటాయని అన్నారు. దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కుండీలలో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ వసంత కుమారి, కార్యదర్శి గంగన్న, లక్ష్మి, ఆశా కార్యకర్తలు, లక్ష్మి, ప్రభావతి ఉన్నారు.
ఇంద్రవెల్లి: డెంగ్యూ వ్యాధిపై స్థానిక పీహెచ్‌సీ వైద్యులు డా.శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో డెంగ్యూ దినోత్సవాన్ని జరుపుకున్నారు. మండలకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది భీమ్‌ నగర్‌లో ఇంటింటికీ వెళ్లి పరిసరాలను పరిశీలించారు. నీటి ట్యాంకులు, ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డెంగ్యూ వ్యాధి పగటి వేళలో కుట్టే దోమవల్ల వస్తుందని తెలిపారు. దాని నివారణకు పరిశుభ్రతనే ముఖ్యమార్గమని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ ఓ.సందీప్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ శ్రీనివాస్‌, వినోద్‌, సిబ్బంది పాల్గొన్నారు.
లక్ష్మణచాంద: జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకొని గురువారం డాక్టర్‌ ప్రత్యుష ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డెంగ్యూ దోమల నివారణకు ప్రతీ మంగళవారం, శుక్రవారం డ్రై డేగా పాటించాలని డాక్టర్‌ ప్రత్యుష అన్నారు. ప్రతీ రెండు రోజులకు ఇంటి ఆవరణలో నీటి నిల్వలు తొలగించి, నీటి నిల్వ తోట్టెలు ఆరబెట్టాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత పాటించి వ్యాధి నివారణకు పాటు పడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, శివకుమార్‌ పాల్గొన్నారు.
నార్నూర్‌: జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని గురువారం వైద్యసిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా ఖంపూర్‌ గ్రామ పంచాయతీలో డాక్టర్‌ రాంబాబు, హెల్త్‌ సూపర్‌వైజర్‌ చౌహన్‌ చరణ్‌దాస్‌ ప్రజలకు డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఏడీస్‌ దోమ కుట్టుటడం వల్ల వ్యాధి వస్తుందని తెలిపారు. కుట్టినప్పుడు జ్వరం, తలనొప్పి, కాళ్లనొప్పులు, కీళ్లనొప్పులు, ఆకలి మందగించడం, వికారం, వాంతులు రావడం వంటి లక్షణాలు ఉంటాయని అన్నారు. ఇలాంటి వారిని వైద్య సిబ్బంది గుర్తించి పరీక్షలు నిర్వహించేల చూడాలని సూచించారు. జూన్‌ నెలలో వర్షకాలం సమీపిస్తున్న తరుణంలో ఇంటి వద్ద డబ్బలలో, పాత టైర్లలో, పూలకుండీలలో, కవర్లలో, మురికి కాలువలో నీరు ఆగకుండా రోజు శుభ్రంగా ఉంచుకోవాలని వాటి పైన మూతలు ఉంచి వాడుకోవాలని ముందస్తు జాగ్రత్తలపై వివరించారు. అవగాహన కార్యక్రమంలో వైద్య సిబ్బంది హిమ బిందు, గోకుల్‌, ఈశ్వరి, విద్యారాణి, ఆశా కార్యకర్తలు ఉన్నారు.

Spread the love