సమాజంపై ప్రేమను తెలిపే కథలు

తమ చుట్టూ వున్న జీవితాలను సహానుభూతితో ప్రేమించగలిగిన వారే నిజమైన సమాజ సేవకులు. వారిని చూసి చలించి తనకు చేతనైనంత సాయం చేయాలన్న తపన ఉన్నవారే సమాజ సేవకులు. పల్లె పట్టు జీవితానికి పాత్రికేయ వృత్తి తవ్వా ఓబుల్‌ రెడ్డికి బాగా తోడయింది. ఆ వృత్తిలో వారు అనేకానేక బాధల్ని, వేదనల్ని మరీ దగ్గరగా గమనించగలిగారు. పాత్రికేయ వృత్తికి తోడుగా దళిత వాడల్లోని ప్రాథమిక పాఠశాలల్లో పనిచేశారు. అందివచ్చిన అవకాశాల్ని ఇలా జీవితాలని పరిశీలించడం, రచనలు చేయడం, చరిత్ర తెలిపే పురాతత్వ విజ్ఞానాన్ని పెంపు చేసుకోవడంలో ఉపయోగించుకుని సమాజం మీద ప్రేమ పెంచుకున్నారు. మాతృభాష మీద ప్రేమతో క్లాసులో తెలుగు మాట్లాడవద్దనే ఒక మిషనరీ స్కూలుపై ఉద్యమం నడిపి చరిత్ర సృష్టించారు. జర్నలిజాన్నే స్వచ్ఛంద వ్యాపకం చేసుకుని సమాజం మీద ప్రేమను పెంచుకున్నారు.
తక్కువ రాస్తారు. ఎక్కువ చెపుతారు. అస్తిత్వ మూలాల అన్వేషణలో వీరి చూపు నిశితమైనది. అందుకే వీరు రాస్తున్న కథలు వాస్తవపు నేలమీదే నడుస్తాయి. అంతరించిపోతున్న వృత్తి వ్యాపకాలు, నేలతల్లిని నమ్ముకున్న బడుగు బతుకులపై ‘సెర్చిలైటు’ వేసి చూపుతారు. టైటిల్‌ కథ ‘కడుపాత్రం’ కావచ్చు, ఊరిపెద్దల ఉక్కు పాదాల కింద నలిగే మల్లమ్మపైన జరిగిన ‘అత్యాచారం’ కావొచ్చు. లేదూ ‘ఆకాశం నవ్వింది’లో బాలసుబ్బడే కావొచ్చు. వీరందరూ మారుతోన్న కాలనీకి తలొగ్గలేక అత్యాచార/ అన్యాయ యజ్ఞంలో సమిధలై పోతారు. కథలు రాయడమే కాకుండా, వీరి వివరణలలో ‘సింగివాసన’ (మేకల కంపు), సారకం (పరాచికం), జొమెక్కటం (అదునుకు రావడం) లాంటి పద ప్రయోగాలతో భాషకు పరిమళాలు అద్దుతారు. తక్కువ ధరకు చేలో పంటను అమ్మి, అవే టమాటలను నాలుగింతల ధరకు చేలో పంటను అమ్మి, అవే టమాటాలను నాలుగింతల ధరకు ఓ బుట్ట కొనుక్కోవడం ప్రపంచీకరణ వల్ల బడుగు బతుకులు ఎలా బలైపోతున్నాయో చెబుతారు. పల్లె ప్రాంత వాసనలీనే వీరి కథలు ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి గారి మాటల్లో… ”కథానిక రచన ఒక సంక్లిష్ట సృజనాత్మక ప్రకియ” అని అనిపించే వీరిని ఒక గొప్ప కథకుడి కేటగిరీ లోకి వచ్చేంది. వీరి కలం నుండి మరిన్ని మంచి కథలు ఇలా వస్తూనే వుండాలని ఆశిద్దాం. రచయితకు అభినందనలు.
– కూర చిదంబరం, 8639338675

Spread the love