‘బాహుదా’ కథల గురించి మాట్లాడాలి అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. ముందుగా బూదూరి సుదర్శన్ రచన శైలి గురించి మాట్లాడుకోవాలి. ఈ కథలు చదువుతున్నంతసేపు మనం చదువుతున్నట్టు గాక ఆ పాత్రలతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మనం కూడా పూర్తిగా రాయలసీమలో పుట్టి పెరిగినోళ్ల లాగానే అక్కడ వాళ్ళం అయిపోతాం. ఈ కథలు చదివాక పూర్తిగా మీకు కూడా రాయలసీమ యాస అలవాటు అయిపోతుంది. అంతలా ఇందులోని పాత్రలన్నీ మనలో మమేకమైపోతాయి. రాయలసీమ అనగానే ఫ్యాక్షన్, మీసాలు తిప్పడం, తొడలు కొట్టుకోవడమే కాకుండా అక్కడి లోతైన జీవితాలను, అక్కడ ఇంకిపోతున్న బాహుద నది లాగానే దాని చుట్టుపక్కల్లో ఇంకిపోతున్న బతుకులను మనకి పరిచయం చేస్తాడు రచయిత.
ఈ కథలతో మనకు సాహిత్యాన్ని అందించడమే కాకుండా సమాజంలోని రుగ్మతలను వేలెత్తి చూపుతాడు. సామాజిక స్పహని తట్టి లేపుతాడు. వీటిని కథలుగా మనం చూడటం కంటే ఒక మనిషి జీవితంలో పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు సాగే ప్రయాణం అనుకోవచ్చు. పుట్టుక నుండి చావు దాకా ఎదుర్కొనే ప్రతి అనుభవాన్ని ఒక్కచోట పేర్చినట్టు అనిపిస్తుంది.
హద్దులు అనేటివి తెలియని వయసులో స్నేహానికి కూడా గీతలు గీసే పెద్దవాళ్ల మధ్య మురారిగాని ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. మనిషికి మనిషికి మధ్య కులం అనే గీతలను గీసుకొని తేడాలతో బతుకుతున్న ఈ సమాజంలో చదువు ఒక్కటే సమానత్వాన్ని తీసుకొస్తుంది అని మురారిగాని కథతో ముచ్చటించాడు రచయిత.
ఆచారాలు, సాంప్రదాయాలనుకుంటూ అభం శుభం తెలియని వయసులో ఇష్టాయిష్టాలకు సంబంధం లేకుండా ఒకరి జీవితాన్ని మరొకరి జీవితంతో ముడి పెట్టడానికి బాల్య వివాహం అని పేరు పెట్టడాన్ని గోపిగాన్ని కలచివేసిన తీరు, వానిలో ప్రశ్నలు వర్షాన్ని కురిపించాడు రచయిత. ఇది చదువుతున్నంతసేపు పాఠకుల్లో కూడా ప్రశ్నలు మొలకెత్తడం సహజమే. అంత సహజంగా రచయిత కథలను ముందుకు తీసుకుపోయాడు.
బాల్య వివాహానికి బందీ అయిపోయి జీవితంలో తనకంటూ ఉన్న ఆశలను ఆశయాలను తనలోనే దాచేసుకుని, ఎలాగైనా మధ్యలో వదిలేసిన తన చదువును కొనసాగించాలని, ఫెయిల్ అయిన హిందీ పరీక్షను పాస్ అవ్వాలని బిందు చేసిన కషి, కేవలం చదువులోనే కాదు తన జీవితంలోనూ ఫెయిల్ అవ్వకుండా తనకొచ్చిన సమస్యను ఎదుర్కొని తన జీవిత పరీక్షను కూడా పాస్ అవుతుంది.
పంచాయితీలు, రచ్చబండల పేరుతో తెల్ల గడ్డం కప్పుకున్న పెద్దమనుషులు చేసే రచ్చ అంతా కాదు. వాళ్ళు ఇచ్చే తీర్పులన్నీ న్యాయానికి ఆమడ దూరంలో ఉంటాయి. అప్పట్లో పంచాయితీ తీర్పులంటే పెద్దకులపోల్ల పెంపుడు జంతువులె..!! ఎటు జెపుతే గటే పోతుండే తీర్పు. న్యాయాన్యాయాలకు చోటెక్కడిది ఇగ. ఎవరు ఎక్కువ దుడ్డు (పైసలు) ఇస్తే న్యాయం అటుంటది. రచ్చబండ ఎనుక ఎవడు కడుపు నింపితే వాడే నిర్దోషి. గిదే పంచాయితీ అంటే. కారణం ఎక్కువమందికి చదువు లేకపోవడం. అందరికీ విద్య అందినప్పుడే సమాజంలో జరుగుతున్న ప్రతి అంశాలకు మనిషి స్పందించగలడు. వ్యతిరేకించగలడు. తనకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించగలడు. ఈ పెద్ద మనుషుల కథలో అలాంటి అడ్డుగీతల్లో దాయబడ్డ మురారి గాడు చదువుతో గీతలను జరుపుకుంటూ వచ్చిన తీరు పాఠకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.
చివరి కథల్లో మనిషి జ్ఞాపకాలకు మించిన ఆస్తి లేదని చెప్పడం, చనిపోయాక తీసుకుపోవడానికి ఏమీ ఉండదు మనం చేసిన మంచి తప్ప అని చెప్పిన తీరు పాఠకులని సైతం జీవితం మొత్తం చూసేశామా..? అనే సందిగ్ధంలోకి తీసుకెళ్తాయి. జీవితపు అనుభవాల అనుభూతులను అందిస్తాయి.
ఇవి నిజమైన బతుకు కథలు. ఇంకిన కన్నీళ్ళతో బతుకును తడుపుకున్న కథలు. పొడిచే పొద్దును తొడుక్కున్న కథలు. మనసుకు మనసుకు మధ్య వికసించిన కథలు. ఇవి బతుకును పూయించిన కథలు.
– మూల వేణు (అధ్వాతి), 8106226506
బతుకును పూయించిన కథలు..
11:17 pm