Sunday, May 3, 2026
E-PAPER
Homeహెల్త్వేసవి అంటే విశ్రాంతి కాదు… వికాసం

వేసవి అంటే విశ్రాంతి కాదు… వికాసం

- Advertisement -

వేసవి సెలవులు ఆనందాన్ని నేర్చుకునే కాలం… చదువుకు పునాది వేసే సమయం. వేసవి సెలవులు అనగానే చాలా మంది ‘చదువుల నుంచి బ్రేక్‌’ అని మాత్రమే భావిస్తారు. కానీ నిజానికి ఇది పిల్లల జీవితంలో అత్యంత కీలకమైన అభివృద్ధి దశ. ఈ కాలంలో పిల్లలు పుస్తకాలకంటే బయట ప్రపంచాన్ని చదువుతారు. ప్రకృతి, మనుషులు, అనుభవాలు ఇవన్నీ కలసి ఒక జీవన పాఠశాలగా మారుతాయి. ఈ అనుభవాలు పిల్లలలో ఆసక్తి, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను పెంచుతాయి. ఇవే తర్వాత బడి తెరిచినప్పుడు చదువుపై దృష్టిని పెంచే మూలాధారాలు అవుతాయి.

పిల్లలు ఏడాది పొడవునా ఒక క్రమబద్ధమైన షెడ్యూల్‌లో ఉంటారు. అలాంటి సమయంలో వేసవి సెలవులు వారికి మానసికంగా విశ్రాంతి ఇస్తాయి. ఈ విరామం వల్ల మెదడు ”రీసెట్‌” అవుతుంది. ఒత్తిడి తగ్గి, కొత్త విషయాలు నేర్చుకునే ఉత్సాహం పెరుగుతుంది. సెలవుల్లో ఆడిన ఆటలు, చేసిన ప్రయాణాలు పిల్లల్లో ఉత్సాహాన్ని పెంచుతాయి. అదే ఉత్సాహం బడి మొదలైన తర్వాత కూడా కొనసాగి, చదువుపై దృష్టి కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. విశ్రాంతి తీసుకున్న మెదడు ఎక్కువగా గుర్తుంచుకుంటుంది, వేగంగా అర్థం చేసుకుంటుంది.
ప్రకృతితో అనుబంధం.. కుతూహలానికి ప్రారంభం
పల్లెలో గడిపిన రోజులు లేదా ప్రకృతిలో గడిపిన సమయం పిల్లలలో ప్రశ్నించే స్వభావాన్ని పెంచుతుంది. చెట్లు ఎలా పెరుగుతాయి? పక్షులు ఎలా ఎగురుతాయి? రైతులు ఎలా పనిచేస్తారు? అనే ప్రశ్నలు వారి లోపల ఒక చిన్న శాస్త్రవేత్తను మేల్కొలుపుతాయి. ఈ కుతూహలం బడి తెరిచిన తర్వాత సైన్స్‌, సామాజిక శాస్త్రాలపై ఆసక్తిని పెంచుతుంది. పుస్తకాల్లో చదివే విషయాలు వారికి సులభంగా అర్థమవుతాయి, ఎందుకంటే అవి ఇప్పటికే అనుభవించినవే.
కుటుంబ సమయం.. భావోద్వేగ బలం
తాతాబామ్మల ఇల్లు, బంధువులతో గడిపిన రోజులు పిల్లలకు భావోద్వేగ భద్రతను ఇస్తాయి. ప్రేమ, ఆప్యాయత, పంచుకోవడం వంటి విలువలు అక్కడ సహజంగా నేర్చుకుంటారు.
ఈ భావోద్వేగ బలం పిల్లలకు బడి జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. పరీక్షల ఒత్తిడి వచ్చినప్పుడు, పోటీ ఎదురైనప్పుడు.. ఈ మానసిక స్థిరత్వం వారిని నిలబెడుతుంది. ”నేను చేయగలను” అనే నమ్మకం అక్కడే పుడుతుంది.
సాంఘిక అనుభవాలు… క్లాస్‌రూమ్‌లో ధైర్యం
వేసవిలో ఇతర పిల్లలతో ఆడటం, కొత్త ప్రదేశాలకు వెళ్లటం, కొత్త వ్యక్తులను కలవటం వల్ల పిల్లల్లో సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయి. మాట్లాడటం, వినటం, కలిసి పని చేయటం వంటి లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. బడి ప్రారంభమైన తర్వాత ఈ నైపుణ్యాలు చాలా ఉపయోగపడతాయి. టీచర్‌తో మాట్లాడటంలో, ఫ్రెండ్స్‌తో కలిసిపోవటంలో, గ్రూప్‌ యాక్టివిటీల్లో పాల్గొనటంలో పిల్లలు ధైర్యంగా ఉంటారు.
సేవా కార్యక్రమాలు.. బాధ్యతా భావం
వేసవిలో చిన్న చిన్న సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం పిల్లల్లో బాధ్యతా భావాన్ని పెంచుతుంది. ఇతరులకు సహాయం చేయడం వల్ల జీవితాన్ని విభిన్న కోణంలో చూడటం నేర్చుకుంటారు. ఇలాంటి అనుభవాలు బడి జీవితంలో క్రమశిక్షణను పెంచుతాయి. హోంవర్క్‌ చేయడం, సమయాన్ని పాటించడం, బాధ్యతగా చదవడం వంటి అలవాట్లు సహజంగా వస్తాయి.
సంప్రదాయ ఆటలు.. మెదడు శక్తికి పునాది
కబడ్డీ, చెస్‌, పచ్చీసు వంటి ఆటలు పిల్లల్లో ఆలోచనాశక్తిని పెంచుతాయి. గెలుపోటములను అంగీకరించడం, వ్యూహాలు రూపొందించడం వంటి లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. ఈ నైపుణ్యాలు చదువులో కూడా ఉపయోగపడతాయి. గణితంలోని సమస్యలు పరిష్కరించడంలో, సైన్స్‌ కాన్సెప్ట్స్‌ అర్థం చేసుకోవడంలో ఈ ఆలోచన విధానం సహాయపడుతుంది.
సమతుల్య వేసవి.. విజయవంతమైన విద్యార్థి
వేసవి పూర్తిగా ఆటలతో గడవకూడదు, పూర్తిగా కోచింగ్‌లతో కూడా కాదు. కొంత సమయం విశ్రాంతి, కొంత సమయం నేర్చుకోవడం, కొంత సమయం కుటుంబంతో గడపడం ఈ సమతుల్యతే ఉత్తమం. ఇలా గడిపిన వేసవి పిల్లలను శారీరకంగా, మానసికంగా సిద్ధం చేస్తుంది. బడి తెరిచిన తర్వాత వారు ఉత్సాహంగా, దృష్టి కేంద్రీకరించి, ఆనందంగా చదువుకుంటారు.
వేసవి ఉత్సాహం.. చదువులో విజయం
వేసవిలో సేకరించిన ఆనందం, అనుభవాలు, ఉత్సాహం ఇవన్నీ బడి ప్రారంభమైన తర్వాత చదువులో ప్రతిఫలించాలి. సెలవులు కేవలం గడిచిపోవద్దు.. అవి భవిష్యత్తుకు బలమైన పునాది కావాలి. పిల్లలకు మనం ఇవ్వాల్సింది ఒత్తిడి కాదు.. ఉత్సాహం, అనుభవం, ఆత్మవిశ్వాసం. అప్పుడు మాత్రమే వారు పుస్తకాల్లోనే కాదు.. జీవితంలో కూడా విజయం సాధిస్తారు.

డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -