– 8 వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్ గెలుపు
– చెన్నై 103/9, కోల్‌కత 107/2
చెన్నై : ఐపీఎల్18లో చెన్నై సూపర్‌కింగ్స్ తడబాటు కొనసాగుతుంది. సీజన్లో ఐదో పరాజయం చవిచూసిన సూపర్‌కింగ్స్.. ఆరంభంలోనే ప్లే ఆఫ్స్ ఆశలను ఆవిరి చేసుకుంది!. శుక్రవారం చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్ చేతిలో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నైట్‌రైడర్స్ 10.1 ఓవర్లలోనే ఊదేసింది. మరో 59 బంతులు ఉండగానే లాంఛనం ముగించింది. సునీల్ నరైన్ (44, 18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), క్వింటన్ డికాక్ (23), అజింక్య రహానె (20 నాటౌట్) మెరవటంతో కోల్‌కత అలవోక విజయం సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ సొంతగడ్డపై తేలిపోయింది. సునీల్ నరైన్ (3/13), వరుణ్ చక్రవర్తి (2/22) మాయకు హర్షిత్ రానా (2/16) పేస్ తోడవటంతో 20 ఓవర్లలో 9 వికెట్లకు 103 పరుగులే చేసింది. శివం దూబె (31 నాటౌట్, 29 బంతుల్లో 3 ఫోర్లు), విజరు శంకర్ (29, 21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ త్రిపాఠి (16), డెవాన్ కాన్వే (12) మినహా మరో బ్యాటర్ రెండెంకల స్కోరు చేయలేదు. రచిన్ రవీంద్ర (4), అశ్విన్ (1), జడేజా (0), హుడా (0), ధోని (1), నూర్ అహ్మద్ (1) దారుణంగా విఫలమయ్యారు. సీజన్లో ఆరు మ్యాచుల్లో మూడో విజయంతో పాయింట్ల పట్టికలో కోల్‌కత మూడో స్థానంలో నిలువగా.. ఐదో ఓటమితో సూపర్‌కింగ్స్ తొమ్మిదో స్థానానికి పరిమితమైంది.