నీట్‌ వివాదంపై ‘సుప్రీం’ సీరియస్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ పరీక్షలో పేపర్‌ లీకేజీ, అవకతవకలు జరిగాయంటూ వస్తోన్న వార్తలతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో వీటిని నిర్వహిస్తోన్న జాతీయ పరీక్ష మండలిపై భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. ఎక్కడైనా 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా.. దాన్ని సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేసింది. ‘‘పరీక్ష నిర్వహిస్తున్న సంస్థగా.. న్యాయంగా వ్యవహరించాలి. ఏదైనా తప్పిదం జరిగితే.. తప్పు జరిగిందని అంగీకరించాలి. ఈ చర్యలు తీసుకోనున్నాం అని వివరించాలి. కనీసం అదైనా మీ పనితీరుపై విశ్వాసం కలిగిస్తుంది’’ అని ఎన్టీఏకు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షకు సిద్ధమయ్యేందుకు విద్యార్థులు పడే శ్రమను మరిచిపోకూడదని తెలిపింది. వ్యవస్థను మోసం చేసే వ్యక్తి వైద్యుడైతే.. సమాజానికి ఎంత హానికరమో ఆలోచించాలని వ్యాఖ్యానించింది. ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన నీట్‌ పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ విక్రమనాథ్‌, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ మంగళవారం విచారణ జరిపింది. ఎన్టీఏ నుంచి సకాలంలో చర్యలు ఆశిస్తున్నామన్న ధర్మాసనం.. తదుపరి విచారణను జులై 8న చేపడతామని తెలిపింది.

Spread the love