– చట్టాలఉల్లంఘనే: నిపుణులు
– ఎన్నికల వేళ మోడీ ప్రభుత్వంపై స్పైవేర్ ఆరోపణలు
– కప్పదాటు వివరణ ఇచ్చిన యాపిల్
– అనుకూల మీడియా సాయంతో కేంద్రం నష్టనివారణ చర్యలు
రాజకీయ ప్రత్యర్థులపై స్పైవేర్ ఆయుధాన్ని ప్రయోగించడం వారి గోప్యత హక్కుకు భంగం కలిగించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. ఎన్నికల ప్రక్రియను పక్కదారి పట్టించడమే . అంతేకాక అధికార పార్టీ ప్రయోజనాల కోసం స్పైవేర్ కొనుగోలుకు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించడం అవినీతి నిరోధక చట్టం, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నేరం. మరి నేడు దేశంలో జరుగుతున్నదేమిటీ..? అమెరికాలో అయితే ఇలాంటి నిఘా ఆరోపణలపై అప్పటి దేశాధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. మరి మన దేశంలో అలాంటివి కనీసం ఊహించగలమా..?
న్యూఢిల్లీ : ‘మీ ఫోన్లను ప్రభుత్వ ప్రేరేపిత హ్యాకర్లు’ హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఐ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ నుండి తమకు అలర్ట్ నోటిఫికేషన్ వచ్చిందని పలువురు ప్రతిపక్ష నేతలు చేసిన ప్రకటనలు దేశంలో రాజకీయ అలజడి సృష్టించాయి. కానీ ఏ ప్రభుత్వం లేదా ఏ సంస్థ హ్యాకింగ్‌కు ప్రయత్నిస్తోందో యాపిల్ చెప్పడం లేదు. అయితే అది నకిలీ అలర్ట్ అయి ఉండవచ్చునని, హ్యాకింగ్ ప్రయత్నం జరగలేదని యాపిల్ చెబుతోంది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గతంలో కూడా ఇజ్రాయిల్‌కు చెందిన స్పైవేర్ పెగాసస్ ద్వారా ప్రతిపక్ష నేతలను, పలువురు సీనియర్ పాత్రికేయులను లక్ష్యంగా చేసుకొన్న విషయం తెలిసిందే. ఇపుడు కూడా బాధితులకు యాపిల్ సంస్థ నుంచి అలర్ట్‌లు వచ్చాయి. అంటే ప్రత్యర్థులపై, విమర్శకులపై మరోసారి పెగాసస్‌ను ప్రయోగిస్తున్నారా? లేకుంటే ప్రెడేటర్ వంటి ఇతర స్పైవేర్‌ను వాడుతున్నారా?
స్పైవేర్ అనేది ప్రపంచంలో పెద్ద వ్యాపారం. పలు దేశాల్లో పాలక పార్టీలు దానిని ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నాయి. పాలకులు తమ సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని ఆయుధంగా ఉపయోగించుకుంటూ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇజ్రాయిల్‌కు చెందిన స్పైవేర్ ఉత్పత్తిదారు ఎన్‌ఎస్‌ఓకు క్లయింట్లుగా ఉన్న అనేక దేశాల ప్రభుత్వాలు దాని సాయంతో వేలాది మందిని లక్ష్యంగా ఎంచుకున్న విషయం తెలిసిందే. పెగాసస్ బాధితుల జాబితాలో మన దేశానికి చెందిన 140 మంది ప్రముఖులు ఉండడం గమనార్హం.
యాపిల్ గుర్తించింది కానీ…
ఇక తాజా పరిణామానికి సంబంధించి పలువురు ప్రతిపక్ష నేతలు మోడీ ప్రభుత్వంపై అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో యాపిల్ స్పందించింది. ‘ప్రభుత్వ ప్రేరేపిత హ్యాకర్’ హ్యాకింగ్‌కు పాల్పడ్డారని చెప్పలేమని ఆ సంస్థ వివరణ ఇచ్చింది. 2021 నుండి యాపిల్ సంస్థ ప్రపంచంలోని 150 దేశాలకు చెందిన పలువురు వ్యక్తులకు అలర్ట్ నోటిఫికేషన్లు పంపింది. అంటే దీనర్థం ఏమిటి? వివిధ ప్రభుత్వాలు, వేర్వేరు సమయాల్లో వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని చేసిన ప్రయత్నాలను యాపిల్ గుర్తించింది. అయితే ఏ సందర్భంలోనూ దాడి చేసిన వ్యక్తిని నియోగించింది ఏ ప్రభుత్వమో వెల్లడించలేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే యాపిల్ నుండి ఎల్ సాల్వెడార్ దేశానికి చెందిన 12 మంది పాత్రికేయులకు అప్పట్లో అలర్ట్‌లు వచ్చాయి. అప్పుడు ఏం తేలింది? వారిని లక్ష్యంగా చేసుకుంది అక్కడి ప్రభుత్వమేనని కదా..?
ఆ అవసరం ఎవరికి?
మరి మన దేశంలోని ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొని వారి ఫోన్లను హ్యాక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? దీనికి సమాధానం చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు. మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలను ప్రయోగించడాన్ని చూస్తూనే ఉన్నాం. ఫలితంగా కొందరు నెలల తరబడి కారాగారాల్లో మగ్గుతున్నారు. ఇక కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, ప్రతిపక్ష నేతల ఫోన్లలో పెగాసస్ స్పైవేర్‌ను అమర్చిన విషయం తెలిసిందే. మరి యాపిల్ సంస్థ తాను పంపిన నోటిఫికేషన్లలో కొన్ని తప్పుడువై ఉండవచ్చునని ఎందుకు చెబుతోంది? మోడీ ప్రభుత్వానికి వంత పాడే కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి. అసలు యాపిల్ ఏం చెప్పాలని అనుకుంటుందో దానిని అర్థం చేసుకోకుండా వార్తలు వండి వార్చాయి. యాపిల్ చేసిన ప్రకటన ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో చాలా కాలంగా ఉంటోంది. కానీ యాపిల్ ఇచ్చిన వివరణలో కొంత భాగాన్ని మాత్రమే మీడియా ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసింది.
యాపిల్ ఏం చెప్పింది?
వాస్తవానికి యాపిల్ వెబ్‌సైట్‌లో ఇలా ఉంది…’ప్రభుత్వ ప్రేరేపిత దాడులు చేసే వారికి పుష్కలంగా నిధులు అందుతాయి. ఆ దాడులు అత్యాధునికంగా ఉంటాయి. అలాంటి దాడులను గుర్తించాలంటే థ్రెడ్ ఇంటెలిజెన్స్ సిగల్‌పై ఆధారపడాలి.అయితే అవి తరచుగా అసమగ్రంగా ఉంటాయి. సరిగా ఉండవు. యాపిల్ ఇచ్చే కొన్ని అలర్ట్ నోటిఫికేషన్లు తప్పుడువై ఉండవచ్చు. లేదా కొందరు హ్యాకర్లను గుర్తించకపోవచ్చు’. దీనిని బట్టి అర్థమవుతోంది ఏమంటే ప్రభుత్వ ప్రేరేపిత దాడుల కారణంగా జరిగే ప్రమాదాలను యాపిల్ సంస్థ పునరుద్ఘాటించింది.
యాపిల్ ఒక్కటే కాదు
స్పైవేర్ దుర్వినియోగంలో ప్రభుత్వ పాత్రను బయటపెట్టిన టెక్నాలజీ సంస్థల్లో యాపిల్ మొదటిదేమీ కాదు. 2021లో ఇజ్రాయిల్ స్పైవేర్ పెగాసస్ వ్యవహారాన్ని ది వైర్ సంస్థ మరో 16 మీడియా సంస్థలతో కలిసి రట్టు చేసింది. గతంలో యాహూ, గూగుల్ సంస్థలు కూడా ఇప్పుడు యాపిల్ పంపిన విధంగానే అలర్ట్ నోటిఫికేషన్లు పంపాయి.
నాలిక కరుచుకొని…
హ్యకింగ్ ఆరోపణలు వెల్లువెత్తగానే మోడీ ప్రభుత్వం నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. ఈ అలర్ట్‌లు పొరబాటున పంపి ఉండవచ్చునంటూ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించింది. పలు టీవీ ఛానల్స్ యాంకర్లు ‘యాపిల్‌లోని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ’ అంటూ వార్తా ప్రసారాలు చేశారు. ఈ ఉదంతంపై యాపిల్ ఓ ప్రకటన చేస్తుందంటూ లీకులు ఇచ్చారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలగని విధంగా వార్తలు అందించాలంటూ సీనియర్ మంత్రి ఒకరు సలహా ఇచ్చారని ఓ పాత్రికేయుడు ‘ఆఫ్ ది రికార్డ్’గా చెప్పారు. అసలు మోడీ ప్రభుత్వమే యాపిల్ సంస్థతో వివరణ ఇప్పించిందని సీనియర్ పాత్రికేయులు వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారాన్ని కేంద్రం తేలిగ్గా తీసుకుంది. హ్యాకింగ్ ఆరోపణల్లో వాస్తవం, నిర్దిష్టతలు లేవని తేల్చేసింది. ఒక విషయం మాత్రం సుస్పష్టం. తాను చెప్పిన దాని కంటే వ్యవహారం చాలానే ఉందని యాపిల్‌కు తెలుసు. అయితే మరింత సమాచారం అందించేందుకు ముందుకు రావడం లేదు. బహుశా ఎలాంటి ప్రకటనలు చేయవద్దని యాపిల్‌ను మోడీ ప్రభుత్వం కట్టడి చేసి ఉండవచ్చు.